పంచాయతీ కార్యదర్శి పోస్టులపై ఉత్కంఠ | tension on panchayat secretary posts | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి పోస్టులపై ఉత్కంఠ

Published Thu, Jan 23 2014 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

tension on panchayat secretary posts

ఒంగోలు, న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా 129 రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసేందుకు 2013లో జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇదే తరహా నోటిఫికేషన్ ఇతర జిల్లాల్లో కూడా సంబంధిత జిల్లా యంత్రాంగాలు విడుదల చేశాయి.

 ప్రస్తుతం ఇతర జిల్లాల్లో పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు కొంతమంది పోస్టులు మొత్తం తమకే కేటాయించాలంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో తాత్కాలికంగా స్టే కొనసాగుతోంది. ఈ దశలో మన జిల్లాలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
 జిల్లాలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులుగా 129 మంది పనిచేస్తున్నారు.  వీరిలో 8 మంది ఉద్యోగాల నుంచి తరువాత తప్పుకున్నారు.

 అయితే గత ఏడాది నవంబర్‌లో జిల్లా యంత్రాంగం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్‌లో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇది కాకుండా డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏడాదికి ఒక శాతం చొప్పున పదేళ్లకు మించకుండా పది మార్కులు కేటాయించారు. దీంతో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శి  డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై ఉంటే అతనికి ఉద్యోగం లభించినట్లే.

 రోస్టర్ ప్రకారం పరిశీలిస్తే మరో మూడు పోస్టులకు కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు అనర్హులుగా మిగులుతారు. అంటే 118 మంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పర్మినెంట్ అవుతారనేది స్పష్టం. ఈ నేపథ్యంలో మిగిలిన 11 ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5400 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

 దరఖాస్తుల ప్రక్రియ 2013 నవంబర్ 18వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా అధికారులు వారంరోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రకటించినా జాప్యం జరిగింది. ఇప్పటి వరకు రోస్టర్ తదితర వివరాలను పోల్చి చూస్తూ ఇంటర్వ్యూకు అర్హులైన వారిని పిలిచేందుకు జాబితా  కూడా సిద్ధం చేసుకున్నారు. చివరిగా ఒకసారి పరిశీలించి వాటిని కలెక్టర్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

 ఇదీ తాజా సమస్య:
 మన జిల్లాలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించలేదు. ఆ మేరకు ఎటువంటి ఉత్తర్వులు లేవు. ఒక వేళ అభ్యర్థులను ఎంపికచేసి కౌన్సెలింగ్ పూర్తిచేసే నాటికి ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే విధానం అంటూ తీర్పు ఇస్తే కౌన్సెలింగ్‌కు పిలిచిన వారిని ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది.

అదే జరిగితే ఆశగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు. ఇప్పటికే పరీక్ష ఫీజు, దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో నిరుద్యోగులు చాలా ఖర్చుచేసిన నేపథ్యంలో మరలా వారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుందేమో అని అధికారులు అయోమయపడుతున్నారు. ఇదిలా ఉంటే  రోస్టర్ ప్రకారం పరిశీలిస్తే జిల్లాలో కొంతమంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగాలు లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రక్రియను జాప్యం చే స్తున్నారు.

 ప్రస్తుతం పూర్తి వివరాల కోసం  ఎదురుచూస్తున్నాం: కే.శ్రీదేవి, డీపీవో
 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచేందుకు  జాబితా సిద్ధం చేశాం. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులతో మన జిల్లాకు ఎటువంటి సంబంధం లేకపోదు. ముందు ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ట్రిబ్యునల్  ఉత్తర్వులకు సంబంధించి ఇతర జిల్లాలకు వచ్చిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకునే పనిలో ఉన్నాం. కలెక్టర్‌తో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement