మహాత్మా మన్నించు..! | Tension prevails in Tanuku | Sakshi
Sakshi News home page

మహాత్మా మన్నించు..!

Published Sun, Oct 15 2017 12:08 PM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

Tension prevails in Tanuku - Sakshi

తణుకు: ప్రతిష్టాత్మక దండి మార్చ్‌ విగ్రహాలపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తి కట్టారు. వీటిని తొలగించి ఆ ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని భావించారు. దాంతో అత్యంత హేయమైన రీతిలో శనివారం రాత్రి దొంగచాటుగా వీటిని వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్ర పన్నారు. ఇందుకు ముందస్తు ప్రణాళిక రచించిన అధికార టీడీపీ నేతలు భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. విగ్రహాల తొలగింపును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విగ్రహాలను తొలగించడానికి వీలు లేదని పట్టుబడుతూ నాయకులు ధర్నాకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అరెస్టు చేసి ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒకానొక సమయంలో పోలీసులకు, వైఎస్సార్‌ సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రధానమైన గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి ఎన్టీఆర్‌ పార్కు వద్దకు తరలించారు. మిగతా వాటిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా
దేశంలో న్యూఢిల్లీ, గుజరాత్‌లో మాత్రమే దండి మార్చ్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు. తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జిల్లాలో తణుకు పట్టణంలో నాలుగేళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. అప్పటి మునిసిపల్‌ అధికారులు సైతం విగ్రహాల ఏర్పాటుకు సహకరించారు. అయితే అప్పట్లోనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకులతోపాటు బీజేపీ నాయకులు విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించారు. దేవాదాయశాఖకు చెందిన స్థలంలో వీటిని ఏర్పాటు చేశారంటూ తీవ్ర రాద్ధాంతం చేశారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో దేవాదాయశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే విగ్రహాలపై వివక్ష చూపుతున్న అధికార పార్టీ నాయకులు అక్కడే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని భావించి విగ్రహాలను ఎన్టీఆర్‌ పార్కు వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

మునిసిపాలిటీ తీర్మానం
గతంలో దండి మార్చ్‌ విగ్రహాల ఏర్పాటుకు అనుకూలంగా పని చేసిన మునిసిపాలిటీ ప్రస్తుత పాలకవర్గం మాత్రం వీటిని నిర్మించడం విరుద్ధమని చెబుతుండటం గమనార్హం. దండి మార్చ్‌ విగ్రహాలకు సంబంధించి న్యాయస్థానంలో వాదోపవాదాలు నడుస్తుండటంతోపాటు సంబంధిత విగ్రహాలు దేవస్థానం స్థలంలో ఏర్పాటు చేయడంపై వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దండి మార్చ్‌ విగ్రహాలను పట్టణంలోని ఎన్టీఆర్‌ పార్కు లేదా సొసైటీ రోడ్డులోని వైఎస్సార్‌ పార్కునకు తరలించాలని గతేడాది జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో అనుకూలంగా వ్యవహరించిన మునిసిలిటీ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని కళాశాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతంలో పలు విద్యాసంస్థలు ఉండటం, పైగా రద్దీ ప్రాంతం కావడంతో వీటి ప్రాధాన్యం ఎక్కువ మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన దండి మార్చ్‌ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగానే కేవలం రాజకీయ కారణాలతోనే తరలించే ప్రయత్నం చేస్తున్నారని పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు.

కేవలం వివక్షతోనే
ప్రస్తుతం విగ్రహాల ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా వీటిని తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విగ్రహాలను వేరే చోటకు తరలించడానికి కోర్టు అనుమతులు ఇచ్చిందని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేశారన్న అంశం మినహాయించి విగ్రహాల తరలింపునకు సంబంధించి ప్రత్యేక కారణాలు ఏమీ అధికారులు వెల్లడించడంలేదు. విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం నెరవేరడం లేదనీ, ట్రాఫిక్‌ నియంత్రణ సాధ్యం కావడంలేదనీ, ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ కౌన్సిల్‌ తీర్మానించడం విశేషం. గత పురపాలక సంఘం మద్దతుతో విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గతేడాది మునిసిపల్‌ కమిషనర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవు పిటిషన్‌ వేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ జారీ చేసింది. అయితే పిటిషన్‌ ఉపసంహరించుకుని విగ్రహాలను తొలగించే ప్రయత్నం కౌన్సిల్‌ చేసింది.

దురుద్దేశంతోనే
కేవలం దురుద్దేశంతోనే ప్రతిష్టాత్మక దండి మార్చ్‌ విగ్రహాలను అధికార పార్టీ నాయకులు తొలగిస్తున్నారు. గతంలో విగ్రహాల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించిన మునిసిపల్‌ కౌన్సిల్‌ ఇప్పుడు విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పేరుతో ఇలాంటి ప్రతిష్టాత్మకమై విగ్రహాలను తొలగించడం భావ్యం కాదు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు కావడంతోనే వివక్షతోనే వీటిని తొలగిస్తున్నారు.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, తణుకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement