కంచరపాలెం ప్రాంతం ఆర్పీ పేట జీవీఎంసీ హైస్కూల్లో టెన్త్ పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతున్న టెన్త్ విద్యార్థులు
ఆరిలోవ(విశాఖతూర్పు) :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. సాంఘిక శాస్త్రం–2 పరీక్ష ముగియగానే పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కరచాలనం చేసుకొని సరదాగా గడిపారు. ఎలా రాశావని ఒకర్నొకరు అడుగుతూ సందడిగా గడిపారు. పదికి పది గ్యారంటీ అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షలు ముగియడంతో సాయంత్రం విద్యార్థులంతా బీచ్‌లో వాలిపోయారు. ఇదిలావుండగా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారికి ఈ నెల 29 వరకూ పరీక్షలు జరగనున్నాయి.
99 శాతానికి పైగా హాజరు..
విద్యాశాఖ అధికారులు జిల్లాలో 55,493 మంది విద్యార్థులకు పరీక్ష హాల్ టిక్కెట్లు పంపించారు. వారిలో 99 శాతం పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 597 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. ప్రతి పరీక్షకు 100కు పైగా గైర్హాజరయ్యారు. గణితం పరీక్షకు (1,2 పేపర్లు) అన్నింటికంటే ఎక్కువగా 142 మంది గైర్హాజరయ్యారు.
మాల్ ప్రాక్టీస్ కేసులు లేవు
జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం కలగలేదన్నారు. దీంతో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. జిల్లాలో 240 పరీక్ష కేంద్రాలను 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు సందర్శించి విధులు సక్రమంగా నిర్వహించామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశామన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన పోలీసులు, వైద్య సిబ్బంది, 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు, ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఐదుగురిపై వేటు..
పరీక్షలు మొదలయినప్పటి నుంచి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురిపై డీఈవో బి.లింగేశ్వరరెడ్డి వేటు వేశారు. వారిలో నలుగురు అధికారులను విధుల నుంచి బహిష్కరించగా, ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయడం విశేషం. ఈనెల 21న జిల్లాలో పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటిండెంట్ కృష్ణమూర్తి, డిపార్టుమెంట్ ఆఫీసరు ఎన్‌ఎస్‌ఎస్ పడాల్ పరీక్షల ప్రారంభమయినప్పటి నుంచి సరిగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరిపై ఆ పరీక్ష కేంద్రం అబ్జర్వేటర్ ఇచ్చిన నివేదిక మేరకు డీఈవో విధుల నుంచి తప్పించారు. ఈనెల 23న అరుకు వేలీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం విధులు సరిగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ రామారావు, నక్కపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం విధుల సక్రమంగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ పద్మావతిని విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా వీరితో పాటు నక్కపల్లి హైస్కూల్ కేంద్రంలో ఇన్విజిలేటరుగా విధులు నిర్వహిస్తూ పరీక్ష హాల్‌లోనే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డీఈవో కంటపడిన (జానకయ్యపేట హైస్కూల్ భౌతిక శాస్త్రం) ఉపాధ్యాయుడు ఎం.రమణబాబును సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment