కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలానే ఈసారీ విద్యార్థులకు సమస్యలు తప్పేట్లు లేవు. ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో 4 గంటలు, డివిజన్ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల కోత విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం కాగా చాలా పాఠశాలల్లో సిలబస్‌ను మమ అనిపించారు. చాలాచోట్ల బట్టీ కొట్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే క్షమించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్ని ఇక్కట్ల నడుమ గురువారం నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని.. ఆలస్యమైతే 10 గంటల వరకు అనుమతిచ్చేందుకు నిర్ణయించారు. రెగ్యులర్ విద్యార్థులు 47,057 మందికి 199, ప్రైవేట్ విద్యార్థులు 6,293 మందికి 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ కోత తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమైతే హెల్ప్‌లైన్ నెంబర్ల(98499 32289, 08518-277064)ను సంప్రదించాలని సూచించారు.
టీచర్లకు ఎన్నికల టెన్షన్
ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఉపాధ్యాయులకు పరీక్షలు, ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధికారులకు తలనొప్పిగా మారింది. కర్నూలు నగరం నుంచి ఆలూరు, ఆదోని, ఆస్పరి, కౌతాళం, చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర దూర ప్రాంతాలకు ఎన్నికల విధులు వేయడంతో కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 29వ తేదీన టెన్త్ పరీక్ష ముగియగానే, అటు నుంచి అటే ఎన్నికల విధులు నిర్వహించే కేంద్రానికి వెళ్లాలంటే సమయం సరిపోదని వారు వాపోతున్నారు.
పది ‘పరీక్ష’
Published Thu, Mar 27 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement