ప్రిపరేషన్ పదింతలు
- మరో నెలరోజుల్లో టెన్త్ పరీక్షలు
- పక్కాగా వంద రోజుల ప్రణాళిక
- {పిపరేటరీ ఫలితాలపై చర్యలు-డీఈవో
సాక్షి, విశాఖపట్నం : పది పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నెల రోజులు మాత్రమే మిగిలున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో.. ఉపాధ్యాయులు పునఃశ్చరణ తరగతుల్లో బిజీగా ఉన్నారు. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం ఫలితాలపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కనీసం గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో పర్యవేక్షణలో వంద రోజుల ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతోంది. ఇప్పటికే 65 రోజులు గడిచిపోయాయి.
అదనపు తరగతులు.. పరీక్షలు
ఎంతగా సెలవురోజులు, ఆదివారాలు పనిచేస్తున్నా.. సిలబస్ పూర్తి చేశామనిపించుకున్నారు తప్ప, పూర్తి స్థాయిలో టెన్త్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆకస్మిక తనిఖీలతో దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మందికి మెమోలిచ్చారు.
ఇందులో ఐదుగురు ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో భాగంగా ఎంఈవోలను కూడా అప్రమత్తం చేశారు. రోజూ కనీసం రెండు ఉన్నత పాఠశాలల్ని తనిఖీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతం ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారంతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. వీటి ఫలితాల ఆధారంగా మరోసారి ఏబీసీడీ గ్రేడ్లు విభజించి, సీ,డీ గ్రేడ్లవారిపై అదనపు శ్రద్ధ చూపనున్నారు.
గ్రేడ్ దాటాల్సిందే! : ప్రిపరేటరీ పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా గతంలోనే విద్యార్థుల గ్రేడ్లను నిర్ణయించి, అదనపు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించామన్నారు. అయినప్పటికీ ప్రిపరేటరీ పరీక్షల్లో మార్పు కనిపించకపోతే క్షమించేది లేదని హెచ్చరించారు.
త్వరలో జరిగే హోప్ ఎగ్జామ్స్ నాటికి డి గ్రేడ్ విద్యార్థులు కనిష్ట స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని సూచించారు. డి గ్రేడ్ విద్యార్థులకు ప్రధానాంశాలు, తరచూ వచ్చే ప్రశ్నలపై ఎక్కువగా తర్ఫీదిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిపరేటరీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణివ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.