- పరీక్షలు రాయనున్న విద్యార్థులు 8.26 లక్షల మంది
- మే మూడో వారంలో ఫలితాలు
సాక్షి, బెంగళూరు : పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ ం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 8,26,269 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4.88 లక్షల మంది బాలురు, 3.37 లక్షల మంది బాలికలు ఉన్నారు. కాగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఎస్‌ఎల్‌సీ బోర్డ్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,016 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
గత అనుభవాల దృష్ట్యా ఇందులో 161 సమస్యాత్మక, 51 అతి సమస్యాత్మక కేంద్రాలుగా విద్యాశాఖ గుర్తించింది. వీటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో స్క్వాడ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా పరీక్ష కేంద్రంలో వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈ విధంగా వీడియో తీయడం ఇదే మొదటిసారి.
ఇదిలా ఉండగా ఈసారి పదోతరగతి ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. మొదట్లో వచ్చేనెల 14 నుంచి పరీక్షల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. అయితే అదే నెల 17న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగనుంది. దీంతో మూల్యాంకనం ఏప్రిల్ 20న ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది.
ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. అందువల్ల మొదట్లో అనుకున్నట్లు మే మొదటి వారంలో కాకుండా మే మూడో వారంలో పదోతరగతి ఫలితాలు వెలువడే అవ కాశం ఉన్నట్లు సమాచారం.