- రాష్ర్ర్ట వ్యాప్తంగా స్వచ్ఛభారత్ అభియాన్
- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
సాక్షి, బెంగళూరు : స్వచ్ఛత ఆవశ్యకతపై ప్రజల్లో జాగృతి కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్‌లు, బహిరంగ ప్రదేశాలు, పాఠశాల ఆవరణలు తదితర ప్రాంతాల్లో సామాన్యుడు మొదలుకొని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు.... ప్రతి ఒక్కరూ చీపురు చేతబట్టి స్వచ్ఛతా నినాదాన్ని వినిపించారు.
బెంగళూరులోని కంటోన్మెంట్, సిటీ రైల్వే స్టేషన్‌తో పాటు రాచనగరి మైసూరు, ధార్వాడ, దావణగెరె, కార్వార తదితర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నగరంలోని సిటీ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్, ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీ, బీజేపీ సీనియర్ నేత కె.ఎస్.ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. సిటీ రైల్వే స్టేషన్ ఆవరణను చీపురుతో ఊడ్చిన అనంతరం ప్లాట్‌ఫామ్‌ను సైతం అనంతకుమార్ శుభ్రపరిచారు.
బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పి.సి.మోహన్ పాల్గొన్నారు. దావణగెరెలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జి.ఎం.సిద్దేశ్వర, మాజీ మంత్రి రేణుకాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దావణగెరెలోని రోడ్లను కేంద్ర మంత్రి జి.ఎం.సిద్దేశ్వర శుభ్రపరిచారు. కార్వారలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే పాల్గొన్నారు.
జిల్లా అధికారులతో కలిసి ఆయన కార్వార రోడ్లను ఊడ్చారు.రాచనగరి మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ప్రతాప్ సింహ పాల్గొన్నారు. మైసూరులోని రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రపరిచారు.ఇక ధార్వాడ నగరంలోనూ స్వచ్ఛతా అభయాన్‌కు అనూహ్య స్పందన లభించింది. స్వచ్ఛతా అభయాన్‌లో భాగంగా ధార్వాడ మినీ విధానసౌధ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మినీ విధానసౌధ ఆవరణలోని గడ్డిమొక్కలను తీసేసి శుభ్రపరిచారు.