మంత్రి జానారెడ్డి కనుసన్నల్లోనే నాపరాయి, ఇసుక, మద్యం మాఫియా పని చేస్తోందని టీడీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇంఛార్జీ తేర చిన్నపరెడ్డిఆరోపించారు.
హైదరాబాద్: మంత్రి జానారెడ్డి కనుసన్నల్లోనే నాపరాయి, ఇసుక, మద్యం మాఫియా పని చేస్తోందని టీడీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇంఛార్జీ తేర చిన్నపరెడ్డిఆరోపించారు. దోపిడీ దార్లకు, దొంగల ముఠాలకు ఆయన కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకన విడుదల చేశారు.
మంత్రి అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల నాగార్జునసాగర్ నియోజక వర్గం లో పరిపాలన గాడి తప్పిందని, ఫలితంగా గిరిజన బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నియోజకవర్గం ప్రజల ఓట్లతో గెలుపొందిన మంత్రి జానారెడ్డి వారికి చేసిందేమీ లేదని విమర్శించారు.
జిల్లాలో 1169 గ్రామ పంచాయితీలు ఉండగా, వీటిలో 495 గ్రామ పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారని, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లైనా జిల్లాకు ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అధికార పార్టీ ముసుగులో ఆయన చేస్తున్న అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చి, రిగ్గింగ్‌ను అరికట్టాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.