tera chinnapa reddy
-
అక్కడి బీఆర్ఎస్లో వర్గపోరు.. మన్నెంకు టికెట్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ పార్టీలో అంసతృప్తి నాయకులు పెరుగుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల చకిలం అనిల్‌కుమార్ పార్టీని వీడగా.. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ, మరికొంత మంది నాయకులు కూడా పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. మరికొందరు అంతర్గతంగా తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇటు అంసతృప్తులు అటు ఆశావహులతో బీఆర్ఎస్ అధిష్టానం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకగా పనిచేసిన నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వారిలో కొందరికి కార్పొరేషన్ తదితర పదవులను ఇచ్చి సంతృప్తి పరిచినా మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతోనే ఉన్నారు. అలా మందుల సామేలు లాంటి కొందరు పార్టీని వీడుతున్నారు. కొందరు సీఎం కేసీఆర్‌పై భారం వేసి, ఎదురుచూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా.. నల్లగొండ నియోజకవర్గానికి చెందిన చకిలం అనిల్‌కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాకముందు ఆయ న నల్లగొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 2009లో పొత్తుల్లో భాగంగా టికెట్ కాంగ్రెస్‌కు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో చకిలంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన ఇటీవల తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న చాడ కిషన్‌రెడ్డి ప్రతిసారి అడుగుతున్నా ఇవ్వడం లేదు. మరోవైపు పిల్లి రామరాజు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ► కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కన్నంతరెడ్డి శశిధర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నా చివరి నిమిషంలో తెలుగుదేశం నుంచి వచ్చిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు టికెట్ దక్కింది. ఆతర్వాత శశిధర్‌రెడ్డికి ఎలాంటి పదవులూ దక్కలేదు. ఈసారి ఆయన టికె ట్ కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కూడా ఉన్నారు. ► నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మె ల్యే నోముల భగత్‌కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్ ఉన్నారు. ► దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. బయటి విమర్శలు చేసుకోకపోయినా అవి అంతర్గంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగులకే ఈసారి టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో.. టికెట్ రాకపోతే వీరేశం పార్టీ నుంచి వెళ్లిపోతాడన్న చర్చ సాగుతోంది. ► మునుగోడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికితోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, గుత్తా అమిత్‌రెడ్డి, నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ► తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు కూడా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గాదరి కిషోర్‌కుమార్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సామేలుకు కార్పొరేషన్ పదవి ఇచ్చినా, ఎమ్మెల్యే కావాలన్న కోరికతో టికెట్ అడుతున్నారు. తిరుమలగిరిలో గురువారం జరిగిన ప్రగతి నివేదన సభలో కిషోర్‌ను మూడోసారి గెలిపించాలని కేటీఆర్ ప్రకటించడతో తనకు ఇక టికెట్ రాదని భావించి సామేలు బీఆర్ఎస్కు రాజీనామ చేశారు. ► సూర్యాపేటలో పార్టీ శ్రేణులంతా మంత్రి జగదీ‹శ్రెడ్డికే మద్దతు పలుకుతున్నారు. టికెట్ ఆశించేవారు ఎవరూ లేరు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై అసంతృప్తి ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించేవారు పెద్దగాలేరు. ఆలేరు నియోజకవర్గంలోని అదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్లో చేరారు. అధిష్టానం ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది తేలాల్సి ఉంది. భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కాదని, టికెట్ ఆశించేవారు ఇప్పటివరకు బయటకు రాలేదు. -
కోట్లు వెదజల్లినా.. ఓటమి మూటగట్టుకున్న వ్యాపారవేత్తలు వీళ్లే
రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వ్యాపారవేత్తలకు ఆ నియోజకవర్గం మింగుడు పడటం లేదు. ఎన్నికల బరిలో నిలబడి ప్రజాధరణ పొందాలని ఆశించిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులకు ఎదురైన అనుభవాలే దీనికి నిదర్శనమని వారు విశ్లేషించుకుంటున్నట్లు సమాచారం. చేతిలో కోట్లాది రూపాయలు ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో గెలవాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానం ఏదంటే.. వీరు వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే.. ఒకరకంగా చెప్పాలంటే తరాలు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించుకున్నారు. ఆ దన్నుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్నారు. కానీ వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. వీరిని నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి ఈ వ్యాపార వేత్తలు ఎవరో కాదు. ఒకరు తేరా చిన్నప్పరెడ్డి అయితే.. మరొకరు వేమిరెడ్డి నరసింహారెడ్డి.. ఇద్దరూ వ్యాపారంలో బాగానే సంపాదించారు. సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ బ్యాలెట్ బరిలో మాత్రం విఫలమయ్యారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ ఇద్దరూ ప్రజాధరణ పొందలేక పోయారు. నాగార్జున సాగర్‌కు చెందిన వ్యాపారవేత్త తేరా చిన్నప రెడ్డికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా బాగా సంపాదించారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత 2009లో టీడీపీ తరపున నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? తరువాత 2014లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి టీడీపీ తరపున నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడా సేమ్ రిజల్ట్స్. దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిని మూటగట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఫుల్‌గా సంపాదించారు వేమిరెడ్డి నర్సింహరెడ్డి. మునుగోడుకు చెందిన ఆయన 2019లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా నరసింహరెడ్డి అర్థ బలాన్ని చూసో లేక నల్లగొండలో పోటీ చేసే నేత కనిపించకనో తెలీదు కానీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా లోక్‌సభ సీటు కేటాయించారు. అయితే నర్సింహరెడ్డి ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి హడావిడీ చేసినప్పటికీ అంచనాలు తలకిందులయ్యాయి. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఒక్క హుజూర్నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అపజయం పాలయ్యారు. కోట్లకు అధిపతులైన వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో చుక్కలు చూపించిన నియోజకవర్గంగా నల్లగొండ నిలిచిపోయింది. నల్లగొండ లోక్‌సభ సీటు పేరు చెబితేనే చాలు ఈ ఇద్దరు నేతలు నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. -
పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ
రాజకీయాల్లో కొందరిని అదృష్టం వెంటాడుతుంది. మరికొందరిని దురదృష్టం వదలనంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దురదృష్టం వెంటాడుతున్న నాయకుడు ఒకరున్నారట. ఎన్నికల్లో ఓడిపోవడం, గెలిచినా ఆ పదవి కొద్ది కాలమే ఉండటంతో.. కొంతకాలంగా ఆ నేత రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తుండటంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి వస్తారా? రారా ? అని ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారట? తేరా చిన్నపరెడ్డి. నల్లగొండ జిల్లాలో రాజకీయ దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన పేరే అని సెటైర్లు వేస్తుంటారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే... పొలిటికల్‌గా ఆయన ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. చట్టసభలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన తేరా చిన్నపరెడ్డి 2009 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయనను విజయం వరించలేదు. ఓటమి మాత్రమే పలుకరించింది. మామూలుగా అయితే ఓ రాజకీయ నాయకుడు వరుసగా ఓడిపోతూ వస్తుంటే కూడబెట్టిన ఆస్తులు కరిగిపోయి నడిరోడ్డుపై నిలబడతారని అంటారు. కానీ వ్యాపారంలో సంపాదించిన వేల కోట్లు ఉండటంతో ఆయన మరో ప్రయత్నంగా నాలుగోసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు. కానీ అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. మామూలుగా ఎమ్మెల్సీ అంటే ఆరేళ్లు ఉంటుంది. అయితే ఆయన పోటీ చేసింది ఉప ఎన్నిక కావడం..ఆ పదవి గడువు మూడేళ్ళే ఉండటంతో తేరా ఆశ సగమే తీరింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ బాస్ ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించినా కూడా కనిపించడం మానేశారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ తేరా చిన్నపరెడ్డి రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అనే చర్చ ఓ రేంజ్లో జరుగుతోంది. ఆశ ఉంది కానీ.. అవకాశాలే తక్కువ నాగార్జునసాగర్ నియోజకర్గానికి చెందిన తేరా చిన్పప రెడ్డి ఫార్మా రంగంలో వ్యాపారం చేస్తూనే తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే జానారెడ్డి లాంటి సీనియర్ నేతకే ముచ్చెమటలు పట్టించారు. కానీ ఆ ఎన్నికల్లో 6 వేల 214 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీచేసి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరారు. 2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీభత్సంగా ఖర్చు చేశారని ప్రచారం జరిగినా...అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలోనే రాజకీయం తన వల్ల అవుతుందా అని తనను తాను ప్రశ్నించుకున్నారట చిన్నపరెడ్డి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తేరాను అదృష్టం మొదటిసారి పలకరించింది. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన సీటులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి శాసనమండలిలో అడుగు పెట్టారు. కారులో సీటుందా? శాసనమండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలవడంతో ఆయన పదవి కాలపరిమితి గత ఏడాదే ముగిసింది. కాని గులాబీ బాస్ తేరాకు రెన్యువల్ చేయలేదు. చిన్నపురెడ్డి విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నించలేదు. శాసనమండలి సభ్యత్వం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవడంతో..ఏడాదిగా రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడంలేదు. దీంతో చిన్నపరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనే చర్చ మొదలైంది. జ్యోతిష్యుడి ఆజ్ఞ లేనిదే అడుగు కూడా బయట పెట్టరని చిన్నపరెడ్డికి పేరుంది. మరి జ్యోతిష్యుడి ఆదేశాల కోసం తేరా ఎదురు చూస్తూ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయనకు కాషాయ తీర్థం ఇచ్చేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కండువా కప్పి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయిస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఒకసారి చర్చలు కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చిన్నపరెడ్డి బీజేపీలో చేరతారా... లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కాలు కదిపేందుకు కూడా జ్యోతిష్యుడి ఆదేశాల కోసం ఎదురుచూసే తేరా చిన్నపరెడ్డి రాజకీయ జాతకాన్ని.. ఆయన గురువు ఎటువంటి మలుపు తిప్పుతారో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. మంత్రిని నిలదీసిన చేనేత కార్మికులు -
ఈ గెలుపు కేసీఆర్‌కి అంకితం
-
నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
సాక్షి, నల్గొండ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. నల్గొండలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తెర చిన్నపరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది. నాకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు. మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరి కృషితో మంచి మెజారిటీతో విజయం సాధించబోతున్నా. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్కు పట్టేందుకు దోహదపడింది. శాసనమండలికి వెళ్లి విశేషమైన అభివృద్ధి చేసి చూపిస్తా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లా లోకల్‌బాడీ స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుంది. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. (చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం) -
టీడీపీకి గట్టి దెబ్బ
నేడు టీఆర్ఎస్లో చేరనున్న కీలకనేత తేరా చిన్నపరెడ్డి ఆయనతోపాటు గులాబీ దళంలోకి బడుగుల, రమణానాయక్ కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతోసహా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో.. త్వరలోనే మరికొందరు నేతల చేరిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు తేరా చిన్నపరెడ్డి సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ రాష్ట్ర కమిటీలో పలు హోదాల్లో పనిచేసిన రమణానాయక్లు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన తెలుగుదేశం కేడర్, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు కూడా గులాబీ దళంలో చేరుతున్నారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో తేరా టీఆర్ఎస్లో చేరికకు ఆయన అనుచరగణం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, త్వరలోనే టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూ డా టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కుదేలైందని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు వస్తాయని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఆర్భాటపు ఏర్పాట్లు.. గతంలో ఏ నేత పార్టీలో చేరినప్పుడు జరగని విధంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించి భారీ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు చిన్నపరెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో తన బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి 1000 మంది చొప్పున కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం నియోజకవర్గానికి 100 వాహనాల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తన చేరిక జిల్లాలోనే టీఆర్ఎస్కు మంచి ఊపు తీసుకురావాలనే యోచనతో చిన్నపరెడ్డి ఉన్నారని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకుగాను వెళుతున్నందున ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అనుచరులంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కీలకంగా పనిచేసినా పార్టీ చిన్నపరెడ్డికి అన్యాయం చేసిందని వారంటున్నారు. 2009 ఎన్నికల సందర్భంగా బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి నాయకుడిని ఢీకొన్న వ్యక్తిగా తగిన ప్రాధాన్యం పార్టీలో లభించలేదని చెబుతున్నారు. గత ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసినప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి ఎంతో సేవ చేశామని, ఆ సేవకు కూడా ఉపయోగం లేకుండా పోయిందని, తెలుగుదేశం పార్టీలో చిన్నపరెడ్డికి అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే ఆ పార్టీలోకి వెళుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధికోసం చేపడుతున్న వాటర్‌గ్రిడ్, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను కేసీఆర్‌కు నైతిక బలం ఇచ్చేందుకు ఆయన పార్టీ మారుతున్నారని చెబుతున్నారు. తన చేరికపై చిన్నపరెడ్డి ఆది వారం ‘సాక్షి’తో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్ నేతగా తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
టీఆర్ఎస్ వైపు టీడీపీ నేత చిన్నపురెడ్డి చూపు
త్వరలోనే గులాబీ దళంలోకి టీడీపీ నేత చిన్నపురెడ్డి చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం! సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీకి జిల్లాకు చెందిన మరో కీలక నాయకుడు గుడ్‌బై చెప్పనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన తేరా చిన్నపురెడ్డి త్వరలోనే అధికార టీఆర్ఎస్లో చేరనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలతో మంతనాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన గులాబీదళంలో చేరనున్నట్లు సమాచారం. తేరాను పార్టీలోకి రప్పించే విషయంలో జిల్లాకు చెందిన మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే వ్యక్తి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా చిన్నపురెడ్డిని మంత్రి.. పార్టీలోకి ఆహ్వానించారని, ఇందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్వరలోనే జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికలలో ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించనున్నారని, ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌తో కూడా సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. జిల్లాలోని పెద్దవూర మండలం పిన్నవూర గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త చిన్నపురెడ్డి 2009 ఎన్నికలలో తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి జానారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నల్లగొండ పార్లమెంటు నియోజకర్గం నుంచి పోటీచేశారు. అయితే, గత ఎన్నికల సమయంలో కూడా తేరా టీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రచారం జరిగినా అది వాస్తవరూపం దాల్చలేదు. ఎన్నికల తర్వాత చిన్నపురెడ్డి టీడీపీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం జిల్లా అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల పట్ల చిన్నపురెడ్డి కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారని, అందులో భాగంగానే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
జానారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించండి: చిన్నపరెడ్డి
హైకోర్టులో టీడీపీ నేత తేరా చిన్నపరెడ్డి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందించడం లేదని పేర్కొంటూ టీడీపీ నేత డాక్టర్ తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానారెడ్డి అక్రమాలపై విచారణ జరిపేలా సీబీఐ, తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. మనీలాండర్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఎలా అతిక్రమించింది పూర్తి ఆధారాలను తాను సీబీఐకి ఇచ్చానని, ఆ తరువాత దీనిని కేంద్ర హోంశాఖకు సైతం అందచేశానని చిన్నపరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. -
'జానారెడ్డి కనుసన్నల్లోనే మాఫియా'
హైదరాబాద్: మంత్రి జానారెడ్డి కనుసన్నల్లోనే నాపరాయి, ఇసుక, మద్యం మాఫియా పని చేస్తోందని టీడీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇంఛార్జీ తేర చిన్నపరెడ్డిఆరోపించారు. దోపిడీ దార్లకు, దొంగల ముఠాలకు ఆయన కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకన విడుదల చేశారు. మంత్రి అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల నాగార్జునసాగర్ నియోజక వర్గం లో పరిపాలన గాడి తప్పిందని, ఫలితంగా గిరిజన బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నియోజకవర్గం ప్రజల ఓట్లతో గెలుపొందిన మంత్రి జానారెడ్డి వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. జిల్లాలో 1169 గ్రామ పంచాయితీలు ఉండగా, వీటిలో 495 గ్రామ పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారని, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లైనా జిల్లాకు ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అధికార పార్టీ ముసుగులో ఆయన చేస్తున్న అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చి, రిగ్గింగ్‌ను అరికట్టాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.