టీడీపీకి గట్టి దెబ్బ | TDP leader Tera Chinnapa Reddy join in trs | Sakshi
Sakshi News home page

టీడీపీకి గట్టి దెబ్బ

Published Mon, Mar 16 2015 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

టీడీపీకి గట్టి దెబ్బ

టీడీపీకి గట్టి దెబ్బ

 నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న కీలకనేత తేరా చిన్నపరెడ్డి
 ఆయనతోపాటు గులాబీ దళంలోకి బడుగుల, రమణానాయక్ కూడా
  జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతోసహా
 మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో..
  త్వరలోనే మరికొందరు నేతల చేరిక

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ
:  జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు తేరా చిన్నపరెడ్డి సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ రాష్ట్ర కమిటీలో పలు హోదాల్లో పనిచేసిన రమణానాయక్‌లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన తెలుగుదేశం కేడర్, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు కూడా గులాబీ దళంలో చేరుతున్నారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో తేరా టీఆర్‌ఎస్‌లో చేరికకు ఆయన అనుచరగణం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, త్వరలోనే టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూ డా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కుదేలైందని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు వస్తాయని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి.
 
 ఆర్భాటపు ఏర్పాట్లు..
 గతంలో ఏ నేత పార్టీలో చేరినప్పుడు జరగని విధంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించి భారీ కార్యక్రమం ద్వారా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు చిన్నపరెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో తన బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి 1000 మంది చొప్పున కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం నియోజకవర్గానికి 100 వాహనాల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తన చేరిక జిల్లాలోనే టీఆర్‌ఎస్‌కు మంచి ఊపు తీసుకురావాలనే యోచనతో చిన్నపరెడ్డి ఉన్నారని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకుగాను వెళుతున్నందున ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అనుచరులంటున్నారు.
 
  తెలుగుదేశం పార్టీకి కీలకంగా పనిచేసినా పార్టీ చిన్నపరెడ్డికి అన్యాయం చేసిందని వారంటున్నారు. 2009 ఎన్నికల సందర్భంగా బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి నాయకుడిని ఢీకొన్న వ్యక్తిగా తగిన ప్రాధాన్యం పార్టీలో లభించలేదని చెబుతున్నారు.  గత ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసినప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి ఎంతో సేవ చేశామని, ఆ సేవకు కూడా ఉపయోగం లేకుండా పోయిందని, తెలుగుదేశం పార్టీలో చిన్నపరెడ్డికి అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే ఆ పార్టీలోకి వెళుతున్నారని అంటున్నారు.
 
  ముఖ్యంగా జిల్లా అభివృద్ధికోసం చేపడుతున్న వాటర్‌గ్రిడ్, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను కేసీఆర్‌కు నైతిక బలం ఇచ్చేందుకు ఆయన పార్టీ మారుతున్నారని చెబుతున్నారు. తన చేరికపై చిన్నపరెడ్డి ఆది వారం ‘సాక్షి’తో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పునర్‌నిర్మించుకోవాలన్న ఆలోచనతోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని  చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ నేతగా తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement