త్వరలోనే గులాబీ దళంలోకి టీడీపీ నేత చిన్నపురెడ్డి
చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీకి జిల్లాకు చెందిన మరో కీలక నాయకుడు గుడ్‌బై చెప్పనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన తేరా చిన్నపురెడ్డి త్వరలోనే అధికార టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ నేతలతో మంతనాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన గులాబీదళంలో చేరనున్నట్లు సమాచారం. తేరాను పార్టీలోకి రప్పించే విషయంలో జిల్లాకు చెందిన మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే వ్యక్తి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా చిన్నపురెడ్డిని మంత్రి.. పార్టీలోకి ఆహ్వానించారని, ఇందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్వరలోనే జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికలలో ఆయనను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దించనున్నారని, ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌తో కూడా సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం.
జిల్లాలోని పెద్దవూర మండలం పిన్నవూర గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త చిన్నపురెడ్డి 2009 ఎన్నికలలో తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి జానారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నల్లగొండ పార్లమెంటు నియోజకర్గం నుంచి పోటీచేశారు. అయితే, గత ఎన్నికల సమయంలో కూడా తేరా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగినా అది వాస్తవరూపం దాల్చలేదు. ఎన్నికల తర్వాత చిన్నపురెడ్డి టీడీపీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం జిల్లా అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల పట్ల చిన్నపురెడ్డి కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారని, అందులో భాగంగానే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్ వైపు టీడీపీ నేత చిన్నపురెడ్డి చూపు
Published Fri, Feb 20 2015 12:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement