రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వ్యాపారవేత్తలకు ఆ నియోజకవర్గం మింగుడు పడటం లేదు. ఎన్నికల బరిలో నిలబడి ప్రజాధరణ పొందాలని ఆశించిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులకు ఎదురైన అనుభవాలే దీనికి నిదర్శనమని వారు విశ్లేషించుకుంటున్నట్లు సమాచారం. చేతిలో కోట్లాది రూపాయలు ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో గెలవాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానం ఏదంటే..
వీరు వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే.. ఒకరకంగా చెప్పాలంటే తరాలు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించుకున్నారు. ఆ దన్నుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్నారు. కానీ వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. వీరిని నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి ఈ వ్యాపార వేత్తలు ఎవరో కాదు. ఒకరు తేరా చిన్నప్పరెడ్డి అయితే.. మరొకరు వేమిరెడ్డి నరసింహారెడ్డి..
ఇద్దరూ వ్యాపారంలో బాగానే సంపాదించారు. సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ బ్యాలెట్ బరిలో మాత్రం విఫలమయ్యారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ ఇద్దరూ ప్రజాధరణ పొందలేక పోయారు. నాగార్జున సాగర్‌కు చెందిన వ్యాపారవేత్త తేరా చిన్నప రెడ్డికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా బాగా సంపాదించారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత 2009లో టీడీపీ తరపున నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓడిపోయారు.
చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు?
తరువాత 2014లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి టీడీపీ తరపున నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడా సేమ్ రిజల్ట్స్. దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిని మూటగట్టుకున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఫుల్‌గా సంపాదించారు వేమిరెడ్డి నర్సింహరెడ్డి. మునుగోడుకు చెందిన ఆయన 2019లో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ కూడా నరసింహరెడ్డి అర్థ బలాన్ని చూసో లేక నల్లగొండలో పోటీ చేసే నేత కనిపించకనో తెలీదు కానీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా లోక్‌సభ సీటు కేటాయించారు.
అయితే నర్సింహరెడ్డి ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి హడావిడీ చేసినప్పటికీ అంచనాలు తలకిందులయ్యాయి. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఒక్క హుజూర్‌నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అపజయం పాలయ్యారు.
కోట్లకు అధిపతులైన వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో చుక్కలు చూపించిన నియోజకవర్గంగా నల్లగొండ నిలిచిపోయింది. నల్లగొండ లోక్‌సభ సీటు పేరు చెబితేనే చాలు ఈ ఇద్దరు నేతలు నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment