ఇస్కపల్లి తీరంలో మెరైన్ పోలీసులు
నెల్లూరు(క్రైమ్): దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీరం వెంబడి అప్రమత్తతను పెంచారు. మెరైన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. మెరైన్ పోలీసులతో పాటు కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలు గస్తీని ముమ్మరం చేశాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు సైతం తీర ప్రాంతంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయాననే కోణంలో విచారణ జరుపుతున్నారు.
జిల్లాలో 140 కిలోమీటర్ల తీరప్రాంతం
జిల్లాలో 140 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం వెంబడి 130 గ్రామాలున్నాయి. ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోటలో మెరైన్ పోలీస్‌స్టేషన్లు, కృష్ణపట్నం పోర్టులో మెరైన్ అవుట్‌పోస్ట్ ఉంది. గత నెల్లో ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పసిగట్టి అప్రమత్తం చేశాయి. తాజాగా మరోసారి దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేశారు. తీరం వెంబడి గ్రామాల్లో మెరైన్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సముద్రం నుంచి పడవల్లో ఒడ్డుకు వస్తున్న వారిని విచారిస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా వారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. స్థానిక పెద్దలతో సంప్రదింపులు జరిపి కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారమివ్వాలని కోరారు. 1093 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహకారంతో సముద్రంలో గస్తీ కాస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment