తేలని టెక్స్‌టైల్‌ పార్కు భవితవ్యం! | Textile Park In YSR Kadapa | Sakshi
Sakshi News home page

తేలని టెక్స్‌టైల్‌ పార్కు భవితవ్యం!

Published Tue, Aug 14 2018 8:09 AM | Last Updated on Tue, Aug 14 2018 8:09 AM

Textile Park In YSR Kadapa - Sakshi

టెక్స్‌టైల్‌ పార్కులో పూర్తయిన భవనాలు

నిధులతో పాటు అన్నీ ఉన్నాయి కానీ చిత్తశుద్ధే లేదు.. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టెక్స్‌టైల్‌ పార్కు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఎంతోకాలంగా చేనేతల ఆశలు ఆడియాసలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాకు వచ్చిన ప్రతి అధికారి పార్కును సందర్శించి త్వరలో ప్రారంభిస్తామనే హామీలు ఇస్తున్నారే తప్ప ఇంతవరకు పట్టించుకోలేదు. వేలమందికి ఉపాధి కల్పించే ఈ పార్కుపై పాలకులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. చేనేతలపై  చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

జమ్మలమడుగు(వైఎస్సార్‌ కడప): చేనేతలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టెక్స్‌టైల్‌ పార్కుకు మోక్షం లభించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది పనుల పరిస్థితి. పాలకులు అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు, మైలవరం, కొండాపురం, ముద్దనూరు మండలాల్లో చేనేత కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, అలాగే వారు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్‌ కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో 2006లో అప్పటి సీఎం వైఎస్సార్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో పనులు కూడా వేగంగా సాగాయి. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పార్కు గురించి మరిచిపోయాయి. చేనేత కార్మికులకు సంబంధించిన డైయింగ్, హ్యాండ్‌లూం, పవర్‌లూం, గార్మెట్స్‌లో కార్మికులకు శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంపొందిస్తామని, ఇందుకోసం ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉందని గతంలో ఉన్న కలెక్టర్లు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. కానీ అవి మాటలకే పరిమితమయ్యాయి.

62 ఎకరాల్లో పార్కు ఏర్పాటు
మైలవరం మండలంలో నార్జాంపల్లికు వెళ్లే రహదారిలో దాదాపు 62ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఇందులో రంగుల అద్దకం (డైయింగ్‌), హ్యాండ్‌లూం, పవర్‌లూం, గార్మెంట్స్, శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో వారికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం మొదటి విడతగా ప్రభుత్వం రూ.7.5కోట్ల నిధులు కేటా యించింది. ఇప్పటివరకు టెక్స్‌టైల్‌ పార్కులో కేవలం శిక్షణ కేంద్రం బిల్డింగ్, రక్షణగోడ, వాటర్‌ట్యాంక్, కాలువలు మాత్రమే నిర్మించారు. ఈ నిర్మాణాలు 2008నాటికి పూర్తి చేసుకుని మొత్తం యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. లక్ష్యం దాటినా    ఇంకా పనులు పూర్తికాకపోవడంతో చేనేత కార్మికులు, చేనేత యూనిట్‌లను ఏర్పాటు చేయడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు.

స్థలం కోసం డబ్బులు కట్టినా...
టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం మాస్టర్‌ వీవర్సు డబ్బులు చెల్లిం చారు. అప్పట్లో టెక్స్‌టైల్‌ పార్కు నిర్వహణ బాధ్యతలు ఎంసీ నరసింహులు అనే వ్యక్తికి అప్పగిం చారు. అయితే కొంతమంది డీడీలు కట్టి ఆయనకు ఇచ్చారు. ఆయన మరణించడంతో ఆ డీడీలు ఏమైపోయాయో  తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు సెం టు భూమికి ఎంత చెల్లించాలో తెలియపరచడకుండానే డబ్బులు కట్టించుకున్నారు.

డైయింగ్, పవర్‌లూం, హ్యాండ్‌లూం యూనిట్లను నిర్మా ణం కోసం మాస్టర్‌ వీవర్స్‌ సెంటు రూ.2వేల వంతున 48మంది స్థలాలను కొనుగోలు చేశారు. 2015లో కలెక్టర్‌ కేవీరమణ టెక్స్‌టైల్‌ పార్కును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి చేనేతలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పటికైనా పనులన్నీ పూర్తిచేసి చేనేతలకు అప్పగిస్తే వందలాది మం దికి ఉపాధి లభిస్తుందని మాస్టర్‌ వీవర్స్‌ అంటున్నారు. కాగా టెక్స్‌టైల్‌ పార్కు దూరంగా ఉండటంతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement