Buildings Construction
-
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సమీకృత కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యా లయాలు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు వీలుగా 2017 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం... ఒకట్రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలలో సిద్దిపేట, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధంకాగా మరో 6 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన కేంద్రాల్లోనూ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ప్రారంభించిన ఏడాదిన్నర లోపే ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా స్థల సేకరణలో వివాదాలు, భూసేకరణ, కాంట్రాక్టు పనులకు బిల్లుల మంజూరు, కరోనా లాక్డౌన్, కూలీల కొరత తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. మొత్తంమీద సమీకృత కలెక్టరేట్ భవనాలు త్వరలోనే అందు బాటులోకి రానుండటంతో ప్రజలకు పాలనా సౌలభ్యం కలగనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కలెక్టరేట్ భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం నుంచి అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా ఈ భవనాలనుప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..) రాష్ట్రవ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పురోగతి ఇలా... ►సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ల పనులకు 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020 డిసెంబర్10న సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ జిల్లా భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవనానికి 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా 2019 అక్టోబర్‌లో పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణ స్థలం లోతట్టు ప్రాంతం కావడంతో మట్టి ఎక్కువగా నింపాల్సి వచ్చింది. రూ. 30 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చదవండి: (రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా.. ) ►జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 2017 అక్టోబర్‌లో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. 25.34 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణం 6 నెలల కిందటే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కొత్త భవనం మొత్తం మూడంతస్తుల్లో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేశారు. సుమారు రూ. 45 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి. ►కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ పనులు పూర్తయ్యాయి. 2017 అక్టోబర్ 10న దీనికి శంకుస్థాపన జరగ్గా అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు 2018 అక్టోబర్ 11న అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. రూ. 36.60 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. ఇప్పుడు 95 శాతం పనులు పూర్తయ్యాయి. ►నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ను 2017, అక్టోబర్ 11న అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భవన నిర్మాణం మొత్తం పూర్తయింది. ఆఫీసుల్లో ఫర్నిచర్ పనులు, అదనపు పనులు, అంతర్గత రోడ్డు పనులు, మొక్కలు నాటడం, ఇతర చిన్నపాటి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో నెల నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ►వనపర్తి జిల్లా కేంద్రంలో 2017 అక్టోబర్ 11న నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 17 ఎకరాల్లో రూ. 51.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీలింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ►గద్వాల కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 36.80 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ. 28 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ►ఖమ్మం జిల్లాలో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ►జనగామ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను 2017 డిసెంబర్ మాసంలో ప్రారంభించారు. ఇందుకోసం రూ. 42 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఏప్రిల్ మొదటి వారానికల్లా 100 శాతం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లాలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఏప్రిల్ 4న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు బ్లాకులుగా రూ. 43 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏ,బీ బ్లాకులు చివరి దశలో ఉండగా, మిగిలిన రెండు బ్లాకులు స్లాబ్ దశలో ఉన్నాయి. ►మంచిర్యాల జిల్లాలో 2018 ఫిబ్రవరి 27న నస్పూర్ లో ప్రారంభించారు. నస్పూర్‌లో 26.27 ఎకరాల స్థలంలో, 41.54 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికి సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ►భూపాలపల్లి జిల్లాలో 2017 అక్టోబర్ 11న రూ. 30.80 కోట్లతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడిచినా ఇక్కడ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. స్థల వివాదంతో పాటు కోర్టు కేసులు, నిర్మాణ స్థలం చెరువులో ఉండడంతో డిజైన్మార్చాల్సి రావడంతో తాత్కాలికంగా పనులకు బ్రేక్ పడింది. ►ములుగు జిల్లా కలెక్టరేట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ములుగు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెవెన్యూ అధికారులు 70 ఎకరాల స్థలాన్ని గుర్తించినా స్థలం అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ►సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి 2018 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 47.85 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం శ్లాబు పనులు పూర్తవగా ఇంటీరియర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►మెదక్ పట్టణ శివారులో కొత్త కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి 2018 మే 9న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 48.62 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది మార్చి వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. 2018 సెప్టెంబర్‌లో భీమన్న గుట్టపై స్థలాన్ని కేటాయించగా అక్కడ నిర్మాణం చేయవద్దంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వేరే చోట 25 ఎకరాలను కేటాయించినా అక్కడ కూడా సమస్య ఉండటంతో తిరిగి 15 ఎకరాల్లోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరిపాలన సులభతరానికే..: మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నూతన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా 10 కలెక్టరేట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభిస్తామని, అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కోరారు. వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, వచ్చే నెలలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్ఈలు, ఈఈలు, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ పాల్గొన్నారు. -
కోరినంత ఇసుక.. నిర్మాణాలు చకచకా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక కొరత లేదు. టీడీపీ హయాంలో ఉచిత విధానం ముసుగులో వసూలు చేసిన రేటు కన్నా తక్కువకు దొరుకుతోంది. ఎవరికెంత అవసరమో అంత ఇసుక సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఫలితంగా నిర్మాణాలు జోరందుకున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నాగావళి, వంశధార నదుల్లో 18 రీచ్‌లకు అనుమతి వచ్చింది. వాటిలో 12 లక్షల 45 వేల టన్నుల ఇసుక లభ్యత ఉంది. అనుమతులొచ్చిన వాటిలో 13 రీచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిలో 8 లక్షల 68 వేల టన్నుల ఇసుక ఉంది. మరో 5 రీచ్‌లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వాటిలో మరో 4 లక్షల టన్నుల ఇసుకను తవ్వు కోవచ్చు. మొత్తానికి జిల్లాలో 12 లక్షల 45 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు జరిపేందుకు అవకాశం ఉంది. భవన నిర్మాణదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఇసుక కొరత కారణంగా పని దొరకలేదన్న పరిస్థితులు ఎక్కడా లేవు. రెండు పట్టా భూములకు కూడా అనుమతులిచ్చారు. వాటిలో ఒక పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా బాహుద, మహేంద్రతనయ నదుల్లో తహశీల్దార్ల ఆధ్వర్యంలో కార్యదర్శుల సమక్షంలో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. టెక్కలి, పలాసలోనైతే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఇసుక కొరత అనేది ఎక్కడా లేదు. మన జిల్లా అవసరాలను తీర్చడమే కాకుండా విశాఖపట్నం, డెంకాడ, బొబ్బిలిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇసుక తరలిస్తున్నారు. కేవలం స్టాక్ పాయింట్ల ద్వారా రోజుకి 2వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు. అవసరానికి మించి... జిల్లాలో ప్రతి రోజూ 8 వేల నుంచి 10 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు 4 వేల టన్నుల వరకు బుకింగ్ జరుగుతున్నది. బయట ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు, జిల్లాలోని బుక్ చేసుకున్న వారికి కలిపి ప్రతి రోజూ 5 వేల నుంచి 6 వేల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఇసుక ఎంత అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్కలి, పలాస స్టాక్ పాయింట్ల ద్వారా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేస్తుండగా, బాహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి కార్యదర్శుల ఆధ్వర్యంలో నడుస్తున్న రీచ్‌ల ద్వారా çపలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమస్య లేకుండా ఇసుక సరఫరా జరుగుతున్నది. ఉచితం కన్న తక్కువ ధరకే.. గతంలో ఇసుక ఉచిత విధానం పేరుకే తప్ప ఎక్కడా ఇసుక ఉచితంగా దొరకలేదు. టీడీపీ నేతలు దోపిడీదారులుగా తయారై రీచ్‌లను ఆక్రమించి ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి అమ్మకాలు సాగించారు. ప్రభుత్వానికి పైసా రాకపోగా టీడీపీ నేతలు కోట్లు దండుకున్నారు. ఉచిత విధానమని చెప్పి ట్రాక్టర్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రూ.2400 నుంచి రూ.4 వేల వరకు ఇసుక దొరుకుతున్నది. ఈ లెక్కడ అప్పట్లో ఇసుక సొమ్ము అంతా ఎక్కడికెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రారంభమైన రీచ్‌లివి.. మడపాం, పర్లాం, ఎరగాం, పెద చావలాపురం, పురుషోత్తపట్నం 2, గోపాలపెంట, పోతయ్యవలస, కిల్లిపాలెం, కల్లేపల్లి, సింగూరు, తునివాడ, అంగూరు, చవ్వాకులపేటలో ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా మహేంద్రతనయ, బాహుదా నదుల్లో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. స్థానికంగా కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీచ్‌లివి. ఇసుక పుష్కలంగా దొరుకుతోంది.. మా ప్రాంతంలో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. రోజుకు 90 వరకు ట్రాక్టర్లు ఇక్కడకు వస్తున్నాయి. అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఇసుకను అక్ర మంగా తరలించే చాన్సే లేదు. ఇళ్ల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భవన కార్మికులందరికీ చేతి నిండా పనులు ఉన్నాయి. ఇసుకకు కట్టే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు జరిపేందుకు ఇది అవకాశం ఇస్తుంది. పుష్కలంగా ఇసుక జిల్లాలో ఇసుక పూర్తిగా అందుబాటులో ఉంది. ఎవరికెంత అవసరమో అంతా బుక్ చేసుకోవచ్చు. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొరత అనేది లేదు. రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఉన్నాం. – ఎస్.కె.వి.సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ ఇసుక సరఫరా పెరిగింది.. వంశధారలో నీటిమట్టం బా గా తగ్గింది. ప్రస్తుతం ఇసుక అందుబాటులోకి వచ్చింది. 10 రోజుల క్రితం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది. నరసన్నపేటలో రూ.2700 కు లభిస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో మరింతగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం. –అరవల ఆదినారాయణ, పోతయ్యవలస, నరసన్నపేట ఇసుక కొరత లేదు ప్రస్తుతం ఇసుక బిర్లంగిలో పుష్కలంగా దొరుకుతోంది. భవన నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తొలి నెల రోజులు ఇబ్బంది పడినా నేను సోంపేట నుంచి వచ్చి ఇక్కడే ఇసుకను కొనుగోలు చేస్తున్నాను. త్వరలో మరో మూడు ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు. – టి.దుర్యోధన, ట్రాక్టర్ డ్రైవర్, ఇచ్ఛాపురం మండలం -
తేలని టెక్స్టైల్ పార్కు భవితవ్యం!
నిధులతో పాటు అన్నీ ఉన్నాయి కానీ చిత్తశుద్ధే లేదు.. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టెక్స్టైల్ పార్కు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఎంతోకాలంగా చేనేతల ఆశలు ఆడియాసలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాకు వచ్చిన ప్రతి అధికారి పార్కును సందర్శించి త్వరలో ప్రారంభిస్తామనే హామీలు ఇస్తున్నారే తప్ప ఇంతవరకు పట్టించుకోలేదు. వేలమందికి ఉపాధి కల్పించే ఈ పార్కుపై పాలకులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. చేనేతలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జమ్మలమడుగు(వైఎస్సార్ కడప): చేనేతలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టెక్స్టైల్ పార్కుకు మోక్షం లభించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది పనుల పరిస్థితి. పాలకులు అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు, మైలవరం, కొండాపురం, ముద్దనూరు మండలాల్లో చేనేత కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, అలాగే వారు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో పనులు కూడా వేగంగా సాగాయి. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పార్కు గురించి మరిచిపోయాయి. చేనేత కార్మికులకు సంబంధించిన డైయింగ్, హ్యాండ్లూం, పవర్‌లూం, గార్మెట్స్లో కార్మికులకు శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంపొందిస్తామని, ఇందుకోసం ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉందని గతంలో ఉన్న కలెక్టర్లు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. కానీ అవి మాటలకే పరిమితమయ్యాయి. 62 ఎకరాల్లో పార్కు ఏర్పాటు మైలవరం మండలంలో నార్జాంపల్లికు వెళ్లే రహదారిలో దాదాపు 62ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఇందులో రంగుల అద్దకం (డైయింగ్), హ్యాండ్లూం, పవర్‌లూం, గార్మెంట్స్, శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో వారికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం మొదటి విడతగా ప్రభుత్వం రూ.7.5కోట్ల నిధులు కేటా యించింది. ఇప్పటివరకు టెక్స్టైల్ పార్కులో కేవలం శిక్షణ కేంద్రం బిల్డింగ్, రక్షణగోడ, వాటర్‌ట్యాంక్, కాలువలు మాత్రమే నిర్మించారు. ఈ నిర్మాణాలు 2008నాటికి పూర్తి చేసుకుని మొత్తం యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. లక్ష్యం దాటినా ఇంకా పనులు పూర్తికాకపోవడంతో చేనేత కార్మికులు, చేనేత యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. స్థలం కోసం డబ్బులు కట్టినా... టెక్స్టైల్ పార్కులో యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం మాస్టర్ వీవర్సు డబ్బులు చెల్లిం చారు. అప్పట్లో టెక్స్టైల్ పార్కు నిర్వహణ బాధ్యతలు ఎంసీ నరసింహులు అనే వ్యక్తికి అప్పగిం చారు. అయితే కొంతమంది డీడీలు కట్టి ఆయనకు ఇచ్చారు. ఆయన మరణించడంతో ఆ డీడీలు ఏమైపోయాయో తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు సెం టు భూమికి ఎంత చెల్లించాలో తెలియపరచడకుండానే డబ్బులు కట్టించుకున్నారు. డైయింగ్, పవర్‌లూం, హ్యాండ్లూం యూనిట్లను నిర్మా ణం కోసం మాస్టర్ వీవర్స్ సెంటు రూ.2వేల వంతున 48మంది స్థలాలను కొనుగోలు చేశారు. 2015లో కలెక్టర్ కేవీరమణ టెక్స్టైల్ పార్కును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి చేనేతలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పటికైనా పనులన్నీ పూర్తిచేసి చేనేతలకు అప్పగిస్తే వందలాది మం దికి ఉపాధి లభిస్తుందని మాస్టర్ వీవర్స్ అంటున్నారు. కాగా టెక్స్టైల్ పార్కు దూరంగా ఉండటంతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తుంది. -
అరచేతిలో స్వర్గం అమరావతి స్వప్నం
-
వ్యథాభరితంగా భవనాలు!
ఏళ్ల తరబడి పూర్తికాని పాఠశాల భవనాలు వసతి లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో విద్యాభివృద్ధికి, పాఠశాలల భవనాల నిర్మాణం కోసం రూ.కోట్లు మంజూరు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పలు పాఠశాలలకు చెందిన దాదాపు ఐదు వందల భవనాల నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం రూ.40 కోట్లకు పైగా మంజూరు చేశారు. అయితే ఇప్పటికీ అవి పూర్తికాలేదు. ఇప్పటికే చాలా భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటిని పట్టించుకునే నాథుడు కూడా కరువయ్యాడు. పాచిపెంట మండల కేంద్రంలో సక్సెస్ పాఠశాల కోసమని ఏడు గదులతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు 2006లో ప్రభుత్వం రూ.28లక్షలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో భవనాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ సకాలంలో పూర్తి చేయలేదు. 2010లో పూర్తి స్థాయిలో నిర్మాణం కాకుండానే నాటి ప్రధానోపాధ్యాయుడికి సదరు కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. పనులు అసంపూర్తిగా జరిగాయన్న కారణంతో ప్రధానోపాధ్యాయుడు స్వాధీనం చేసుకోలేదు. ఆ తరువాత ఏ ఒక్క అధికారీ దీనిని పట్టించుకోలేదు. దీంతో భవనం గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ భవనం అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతమున్న పాచిపెంట పాఠశాల భవనంలో వసతి సమస్యతో 600మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆ భవన పునర్నిర్మాణ పనులు చేసి పూర్తి చేయాలంటే మంజూరు చేసిన మొత్తానికి రెట్టింపు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదే విషయమై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పలుమార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల్ని ప్రశ్నించినా, నిలదీసినా స్పందన లేదు. ఈ ఒక్క భవనమే కాదు జిల్లాలో దాదాపు 500 పాఠశాల భవనాల పరిస్థితి ఇలాగే ఉంది. అదనపు తరగతుల కోసం సుమారు రూ.21కోట్లతో మంజూరు చేశారు. ఈ నిధులతో 323 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలాగే,రూ.4.5కోట్లతో మంజూరు చేసిన 68 ప్రాథమికోన్నత పాఠశాలల భవన నిర్మాణాల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. నాలుగు మున్సిపాల్టీలలో 77 తరగతి గదుల నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరు చేశారు. వాటి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు ఇలా కోట్లాది రూపాయలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం పూర్తి కావడం లేదు. ఈ క్రమంలో అంచనాలు పెరిగిపోతున్నాయి. నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయి, శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో పాఠశాలల భవనాల కోసం మంజూరు చేసిన కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా వీటి గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతోంది. బాధ్యులెవరో తేల్చాలి పాచిపెంట పాఠశాల భవనం కోసం ఖర్చు చేసిన రూ.28 లక్షలు వృథా అయ్యాయి. చాలా సార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో ప్రస్తావించినా అధికారుల నుంచి స్పందన లేదు. ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులెవరో అధికారులే తేల్చాలి. ఇప్పుడా భవనానికి మరమ్మతులు చేపడితే ప్రయోజనం ఉండదు, పూర్తిగా కూల్చేసి, కొత్త భవనాన్ని నిర్మించాలి. -పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు