Why Paris Has Imposed A Ban On Skyscrapers, Details Inside - Sakshi
Sakshi News home page

ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్‌

Published Mon, Jun 19 2023 5:05 AM | Last Updated on Mon, Jun 19 2023 10:23 AM

Paris bans tall buildings - Sakshi

ఆకాశహర్మ్యాలకు పారిస్‌ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్‌ టవర్‌ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్‌ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్‌ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్‌ సిటీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్‌ అన్నది పర్యావరణ వేత్తల మాట.

ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్‌. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్‌ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్‌ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు.

330 మీటర్ల ఎత్తైన ఈఫిల్‌ టవర్‌ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్‌ టవర్‌ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్‌ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్‌ నగర కౌన్సిల్‌ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది.

ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్‌ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్‌ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు.

ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్‌ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్‌ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్‌ టవర్‌ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి.

రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్‌ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్‌ వంటి నగరాల బాటలో పారిస్‌ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్‌ టవర్‌ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది.

ప్రజలకి తగ్గిన మోజు
రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్‌ బాగా తగ్గిపోయింది.

దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

పర్యావరణానికీ దెబ్బే
అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్‌ చెయ్యడానికి అధికంగా విద్యుత్‌ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది.

ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్‌ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్‌ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్‌ బాటలో నడవక తప్పదు.

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement