కోరినంత ఇసుక.. నిర్మాణాలు చకచకా.. | No Shortage Of Sand In Srikakulam District | Sakshi
Sakshi News home page

కోరినంత ఇసుక.. నిర్మాణాలు చకచకా..

Published Tue, Nov 19 2019 8:00 AM | Last Updated on Tue, Nov 19 2019 8:02 AM

No Shortage Of Sand In Srikakulam District - Sakshi

బిర్లంగి వద్ద ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తున్న కూలీలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక కొరత లేదు. టీడీపీ హయాంలో ఉచిత విధానం ముసుగులో వసూలు చేసిన రేటు కన్నా తక్కువకు దొరుకుతోంది. ఎవరికెంత అవసరమో అంత ఇసుక సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఫలితంగా నిర్మాణాలు జోరందుకున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నాగావళి, వంశధార నదుల్లో 18 రీచ్‌లకు అనుమతి వచ్చింది. వాటిలో 12 లక్షల 45 వేల టన్నుల ఇసుక లభ్యత ఉంది. అనుమతులొచ్చిన వాటిలో 13 రీచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిలో 8 లక్షల 68 వేల టన్నుల ఇసుక ఉంది. మరో 5 రీచ్‌లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

వాటిలో మరో 4 లక్షల టన్నుల ఇసుకను తవ్వు కోవచ్చు. మొత్తానికి జిల్లాలో 12 లక్షల 45 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు జరిపేందుకు అవకాశం ఉంది. భవన నిర్మాణదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఇసుక కొరత కారణంగా పని దొరకలేదన్న పరిస్థితులు ఎక్కడా లేవు. రెండు పట్టా భూములకు కూడా అనుమతులిచ్చారు. వాటిలో ఒక పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా బాహుద, మహేంద్రతనయ నదుల్లో తహశీల్దార్ల ఆధ్వర్యంలో కార్యదర్శుల సమక్షంలో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. టెక్కలి, పలాసలోనైతే స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఇసుక కొరత అనేది ఎక్కడా లేదు. మన జిల్లా అవసరాలను తీర్చడమే కాకుండా విశాఖపట్నం, డెంకాడ, బొబ్బిలిలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇసుక తరలిస్తున్నారు. కేవలం స్టాక్‌ పాయింట్ల ద్వారా రోజుకి 2వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు.

అవసరానికి మించి... 
జిల్లాలో ప్రతి రోజూ 8 వేల నుంచి 10 వేల టన్నుల మేర ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు 4 వేల టన్నుల వరకు బుకింగ్‌ జరుగుతున్నది. బయట ఏర్పాటు చేసిన స్టాక్‌ పాయింట్లు, జిల్లాలోని బుక్‌ చేసుకున్న వారికి కలిపి ప్రతి రోజూ 5 వేల నుంచి 6 వేల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఇసుక ఎంత అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్కలి, పలాస స్టాక్‌ పాయింట్ల ద్వారా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేస్తుండగా, బాహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి కార్యదర్శుల ఆధ్వర్యంలో నడుస్తున్న రీచ్‌ల ద్వారా çపలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమస్య లేకుండా ఇసుక సరఫరా జరుగుతున్నది.

 ఉచితం కన్న తక్కువ ధరకే.. 
గతంలో ఇసుక ఉచిత విధానం పేరుకే తప్ప ఎక్కడా ఇసుక ఉచితంగా దొరకలేదు. టీడీపీ నేతలు దోపిడీదారులుగా తయారై రీచ్‌లను ఆక్రమించి ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి అమ్మకాలు సాగించారు. ప్రభుత్వానికి పైసా రాకపోగా టీడీపీ నేతలు కోట్లు దండుకున్నారు. ఉచిత విధానమని చెప్పి ట్రాక్టర్‌ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రూ.2400 నుంచి రూ.4 వేల వరకు ఇసుక దొరుకుతున్నది. ఈ లెక్కడ అప్పట్లో ఇసుక  సొమ్ము అంతా ఎక్కడికెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో ప్రారంభమైన రీచ్‌లివి.. 
మడపాం, పర్లాం, ఎరగాం, పెద చావలాపురం, పురుషోత్తపట్నం 2, గోపాలపెంట, పోతయ్యవలస, కిల్లిపాలెం, కల్లేపల్లి, సింగూరు, తునివాడ, అంగూరు, చవ్వాకులపేటలో ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా మహేంద్రతనయ, బాహుదా నదుల్లో మరో 10 రీచ్‌లు నడుస్తున్నాయి. స్థానికంగా కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీచ్‌లివి.

ఇసుక పుష్కలంగా దొరుకుతోంది.. 
మా ప్రాంతంలో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. రోజుకు 90 వరకు ట్రాక్టర్లు ఇక్కడకు వస్తున్నాయి. అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఇసుకను అక్ర మంగా తరలించే చాన్సే లేదు. ఇళ్ల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భవన కార్మికులందరికీ చేతి నిండా పనులు ఉన్నాయి. ఇసుకకు కట్టే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు జరిపేందుకు ఇది అవకాశం ఇస్తుంది.

పుష్కలంగా ఇసుక  
జిల్లాలో ఇసుక పూర్తిగా అందుబాటులో ఉంది. ఎవరికెంత అవసరమో అంతా బుక్‌ చేసుకోవచ్చు. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొరత అనేది లేదు. రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఉన్నాం.  
– ఎస్‌.కె.వి.సత్యనారాయణ, అసిస్టెంట్‌ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ

ఇసుక సరఫరా పెరిగింది..  
వంశధారలో నీటిమట్టం బా గా తగ్గింది. ప్రస్తుతం ఇసుక అందుబాటులోకి వచ్చింది. 10 రోజుల క్రితం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది. నరసన్నపేటలో రూ.2700 కు లభిస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో మరింతగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం.  
–అరవల ఆదినారాయణ, పోతయ్యవలస, నరసన్నపేట

ఇసుక కొరత లేదు 
ప్రస్తుతం ఇసుక బిర్లంగిలో పుష్కలంగా దొరుకుతోంది. భవన నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తొలి నెల రోజులు ఇబ్బంది పడినా నేను సోంపేట నుంచి వచ్చి ఇక్కడే ఇసుకను కొనుగోలు చేస్తున్నాను. త్వరలో మరో మూడు ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు.  
 – టి.దుర్యోధన, ట్రాక్టర్‌ డ్రైవర్, ఇచ్ఛాపురం మండలం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement