ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యా లయాలు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు వీలుగా 2017 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం... ఒకట్రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలలో సిద్దిపేట, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధంకాగా మరో 6 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగిలిన కేంద్రాల్లోనూ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ప్రారంభించిన ఏడాదిన్నర లోపే ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా స్థల సేకరణలో వివాదాలు, భూసేకరణ, కాంట్రాక్టు పనులకు బిల్లుల మంజూరు, కరోనా లాక్‌డౌన్, కూలీల కొరత తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. మొత్తంమీద సమీకృత కలెక్టరేట్ భవనాలు త్వరలోనే అందు బాటులోకి రానుండటంతో ప్రజలకు పాలనా సౌలభ్యం కలగనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కలెక్టరేట్ భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం నుంచి అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా ఈ భవనాలనుప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..)
రాష్ట్రవ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పురోగతి ఇలా...
►సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్‌ల పనులకు 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020 డిసెంబర్10న సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ జిల్లా భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
►సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవనానికి 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా 2019 అక్టోబర్‌లో పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణ స్థలం లోతట్టు ప్రాంతం కావడంతో మట్టి ఎక్కువగా నింపాల్సి వచ్చింది. రూ. 30 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చదవండి: (రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా.. )
►జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 2017 అక్టోబర్‌లో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. 25.34 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణం 6 నెలల కిందటే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
►వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కొత్త భవనం మొత్తం మూడంతస్తుల్లో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేశారు. సుమారు రూ. 45 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి.
►కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ పనులు పూర్తయ్యాయి. 2017 అక్టోబర్ 10న దీనికి శంకుస్థాపన జరగ్గా అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
►పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు 2018 అక్టోబర్ 11న అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. రూ. 36.60 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. ఇప్పుడు 95 శాతం పనులు పూర్తయ్యాయి.
►నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ను 2017, అక్టోబర్ 11న అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భవన నిర్మాణం మొత్తం పూర్తయింది. ఆఫీసుల్లో ఫర్నిచర్ పనులు, అదనపు పనులు, అంతర్గత రోడ్డు పనులు, మొక్కలు నాటడం, ఇతర చిన్నపాటి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో నెల నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
►వనపర్తి జిల్లా కేంద్రంలో 2017 అక్టోబర్ 11న నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 17 ఎకరాల్లో రూ. 51.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీలింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు.
►గద్వాల కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 36.80 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ. 28 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు.
►ఖమ్మం జిల్లాలో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి.
►జనగామ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను 2017 డిసెంబర్ మాసంలో ప్రారంభించారు. ఇందుకోసం రూ. 42 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఏప్రిల్ మొదటి వారానికల్లా 100 శాతం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
►మహబూబాబాద్ జిల్లాలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఏప్రిల్ 4న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు బ్లాకులుగా రూ. 43 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏ,బీ బ్లాకులు చివరి దశలో ఉండగా, మిగిలిన రెండు బ్లాకులు స్లాబ్ దశలో ఉన్నాయి.
►మంచిర్యాల జిల్లాలో 2018 ఫిబ్రవరి 27న నస్పూర్ లో ప్రారంభించారు. నస్పూర్‌లో 26.27 ఎకరాల స్థలంలో, 41.54 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికి సగానికి పైగా పనులు పూర్తయ్యాయి.
►భూపాలపల్లి జిల్లాలో 2017 అక్టోబర్ 11న రూ. 30.80 కోట్లతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడిచినా ఇక్కడ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. స్థల వివాదంతో పాటు కోర్టు కేసులు, నిర్మాణ స్థలం చెరువులో ఉండడంతో డిజైన్‌మార్చాల్సి రావడంతో తాత్కాలికంగా పనులకు బ్రేక్ పడింది.
►ములుగు జిల్లా కలెక్టరేట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ములుగు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెవెన్యూ అధికారులు 70 ఎకరాల స్థలాన్ని గుర్తించినా స్థలం అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది.
►సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి 2018 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 47.85 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం శ్లాబు పనులు పూర్తవగా ఇంటీరియర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
►మెదక్ పట్టణ శివారులో కొత్త కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి 2018 మే 9న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 48.62 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది మార్చి వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
►నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. 2018 సెప్టెంబర్‌లో భీమన్న గుట్టపై స్థలాన్ని కేటాయించగా అక్కడ నిర్మాణం చేయవద్దంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వేరే చోట 25 ఎకరాలను కేటాయించినా అక్కడ కూడా సమస్య ఉండటంతో తిరిగి 15 ఎకరాల్లోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
పరిపాలన సులభతరానికే..: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నూతన సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా 10 కలెక్టరేట్‌లను ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ నెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్‌లను ప్రారంభిస్తామని, అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కోరారు. వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, వచ్చే నెలలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్‌ఈలు, ఈఈలు, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment