ఏళ్ల తరబడి పూర్తికాని పాఠశాల భవనాలు
వసతి లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో విద్యాభివృద్ధికి, పాఠశాలల భవనాల నిర్మాణం కోసం రూ.కోట్లు మంజూరు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పలు పాఠశాలలకు చెందిన దాదాపు ఐదు వందల భవనాల నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం రూ.40 కోట్లకు పైగా మంజూరు చేశారు. అయితే ఇప్పటికీ అవి పూర్తికాలేదు. ఇప్పటికే చాలా భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటిని పట్టించుకునే నాథుడు కూడా కరువయ్యాడు. పాచిపెంట మండల కేంద్రంలో సక్సెస్ పాఠశాల కోసమని ఏడు గదులతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు 2006లో ప్రభుత్వం రూ.28లక్షలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో భవనాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ సకాలంలో పూర్తి చేయలేదు. 2010లో పూర్తి స్థాయిలో నిర్మాణం కాకుండానే నాటి ప్రధానోపాధ్యాయుడికి సదరు కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. పనులు అసంపూర్తిగా జరిగాయన్న కారణంతో ప్రధానోపాధ్యాయుడు స్వాధీనం చేసుకోలేదు.
ఆ తరువాత ఏ ఒక్క అధికారీ దీనిని పట్టించుకోలేదు. దీంతో భవనం గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ భవనం అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతమున్న పాచిపెంట పాఠశాల భవనంలో వసతి సమస్యతో 600మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆ భవన పునర్నిర్మాణ పనులు చేసి పూర్తి చేయాలంటే మంజూరు చేసిన మొత్తానికి రెట్టింపు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదే విషయమై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పలుమార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల్ని ప్రశ్నించినా, నిలదీసినా స్పందన లేదు. ఈ ఒక్క భవనమే కాదు జిల్లాలో దాదాపు 500 పాఠశాల భవనాల పరిస్థితి ఇలాగే ఉంది. అదనపు తరగతుల కోసం సుమారు రూ.21కోట్లతో మంజూరు చేశారు.
ఈ నిధులతో 323 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలాగే,రూ.4.5కోట్లతో మంజూరు చేసిన 68 ప్రాథమికోన్నత పాఠశాలల భవన నిర్మాణాల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. నాలుగు మున్సిపాల్టీలలో 77 తరగతి గదుల నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరు చేశారు. వాటి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు ఇలా కోట్లాది రూపాయలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం పూర్తి కావడం లేదు. ఈ క్రమంలో అంచనాలు పెరిగిపోతున్నాయి. నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయి, శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో పాఠశాలల భవనాల కోసం మంజూరు చేసిన కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా వీటి గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతోంది.
బాధ్యులెవరో తేల్చాలి
పాచిపెంట పాఠశాల భవనం కోసం ఖర్చు చేసిన రూ.28 లక్షలు వృథా అయ్యాయి. చాలా సార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో ప్రస్తావించినా అధికారుల నుంచి స్పందన లేదు. ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులెవరో అధికారులే తేల్చాలి. ఇప్పుడా భవనానికి మరమ్మతులు చేపడితే ప్రయోజనం ఉండదు, పూర్తిగా కూల్చేసి, కొత్త భవనాన్ని నిర్మించాలి.
-పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు
వ్యథాభరితంగా భవనాలు!
Published Thu, Jul 30 2015 12:24 AM | Last Updated on Sat, Sep 15 2018 5:06 PM
Advertisement
Advertisement