కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు
♦ పిల్లలతో కలసి నిప్పంటించుకున్న తల్లి
♦ తల్లితోపాటు ఇద్దరు కుమార్తెల మృతి
♦ చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ ఘటన
పుంగనూరు: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘోరం జరిగింది. కన్న తండ్రే కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేకబుధవారం ఓ తల్లి తనతోపాటు నలుగురు బిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. ఈ సంఘటలో తల్లితోపాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జరీనా(28)ను పుంగనూరుకు చెందిన రెహమాన్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు అయేషా(13), మహమ్మద్ (10), అంజుమ్(6), నాగూర్ (8) ఉన్నారు. వ్యసనాలకు బానిసైన రెహమాన్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమార్తె అయేషాను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయమై పలుమార్లు జరీనా భర్తతో గొడవపడింది.
ఇలాంటి బతుకు వద్దు.. చచ్చిపోదాం
మంగళవారం రాత్రి రెహమాన్ మద్యం సేవించి వచ్చి భార్య, కుమార్తెతో ఘర్షణ పడ్డాడు. దీంతో దిక్కుతోచక ‘‘ఇలాంటి బతుకు వద్దమ్మా.. చచ్చిపోదాం..’’ అని కుమార్తె జరీనాకు సలహా ఇచ్చింది. ఉదయం 7 గం టలకు రెహమాన్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఇంట్లో తలుపు గడియ పెట్టుకుని ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులపైన కిరోసిన్ పోసి, తానూ పోసుకుని జరీనా నిప్పంటించుకుంది. చిన్నారుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గ్రామస్తులు వెంటనే తలుపులు పగులగొట్టి మంటల్లో కాలిపోతున్న తల్లీబిడ్డలను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జరీనా, అయేషా, అంజుమ్ మృతి చెందారు. ఇద్దరు కుమారులు చికిత్స పొందుతున్నారు. పుంగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో జరీనాను పుంగనూరు న్యాయమూర్తి మోతీలాల్ కలసి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రాణాలతో బయటపడిన కుమారులను ప్రభుత్వ హాస్టల్ లేదా అంజుమన్ ఆధ్వ ర్యంలో మదర్సాలో సంరక్షించనున్నట్లు తహశీల్దార్ మనిరాజు తెలిపారు.