విశాఖలో వైద్యం పొందుతున్న బాలిక
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్‌లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది.
కఠినంగా శిక్షించాలి
ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్‌ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్‌లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్‌లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు.
వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్‌ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment