వెనుకబడిన ప్రాంతాన్ని రాజధాని చేయాలి
శివరామకృష్ణన్ కమిటీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి
రాజధాని సీమ, ఆంధ్రకు మధ్య ఉండాలి
న్యూఢిల్లీ: వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒంగోలు లోక్‌సభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి నివేదించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్న ఈ కమిటీని ఆయన బుధవారమిక్కడ కలిశారు. ‘‘రాజధానిని అటు ఆంధ్రా అయినా, ఇటు రాయలసీమ అయినా వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాజధాని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రెండింటి మధ్య ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ రెండు ప్రాంతాలకు మధ్య ఉంది. పైగా ఇక్కడ 55 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇక్కడే డిఫెన్స్‌కు చెందిన ఎయిర్‌పోర్టు కూడా ఉంది. కృష్ణా నది నుంచి నీటి వసతి కూడా పొందవచ్చు. దొనకొండ వద్ద నుంచే మెయిన్ కెనాల్ వెళుతోంది. కీలక రైలుమార్గం నడికుడి-శ్రీకాళహస్తి కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాంటి నిరుపయోగమైన ప్రభుత్వ భూమి ఉండగా.. కోట్లు వెచ్చించి ఇతరత్రా భూసేకరణ చేయాల్సిన అవసరం రాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సలహా కమిటీ కృష్ణా-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేయాలని మీకు విన్నవించినట్టు తెలిసింది. తుది నిర్ణయానికి ముందు ఒకసారి దొనకొండ ప్రాంతాన్ని, ప్రకాశం జిల్లాను సందర్శించండి..’’ అని ఆయన కమిటీకి విన్నవించారు. తన విన్నపాన్ని పరిశీలిస్తానని, తప్పక ఆ ప్రాంతంలో పర్యటిస్తానని శివరామకృష్ణన్ పేర్కొన్నట్టు వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.
కర్నూలులో ఏర్పాటు చేయండి: ఎంపీ బుట్టా రేణుక
న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేయాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక బుధవారమిక్కడ ఢిల్లీలో కె.సి.శివరామకృష్ణన్‌ను కలసి నివేదించారు. ‘‘కర్నూలు చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతమేగాక గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న పట్టణం. దీనికి పొరుగునున్న నాలుగు రాష్ట్రాలతో కనెక్టివిటీ ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం పాలనకు సౌలభ్యంగా ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి చాలా అనుకూలంగా ఉంటుంది’ అని ఆమె విన్నవించారు.