Sivaramakrsnan Committee
-
శివరామకృష్ణన్ కమిటీ సూచనలు విలువైనవి
అరసవల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణలపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు చాలా విలువైనవని, వాటిని పక్కనపెట్టి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లున్నట్టు కన్పిస్తోందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు కె. పోలినాయుడు అన్నారు. ఇది సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని సమస్య అతి సున్నితమైందన్నారు. మూడు ప్రాంతాల వారిని సంతృప్తి పరిచేలా అన్ని ప్రాంతాల అభివృద్ధికి భరోసానిస్తూ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తలదన్నే సూపర్‌సిటీ అంటూ ప్రజల్లో భ్రమలు కలిగించేలా ప్రకటనలివ్వడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అన్నీ మేము నిర్ణయిస్తామని ఏకపక్ష ధోరణికి ప్రభుత్వం స్వస్తి చెప్పి రాజధానిపై ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చలు జరిపి అంతిమంగా శాసనసభ ఆమోదం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జిల్లా కోశాధికారి అల్లు మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు టి.మాధవరావు, పి. ప్రవీణ్, వి.అప్పలరాజు, బి.నర్సున్నాయుడు, ఎం.సత్యనారాయణ, బి.జానకీరామ్, ఆర్.గాంధీ పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి-నడికుడి మార్గంతో..పారిశ్రామికాభివృద్ధి వీచిక !
రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పిన వైనం {పధానమైన రైలుమార్గానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నారంటూ ఆక్షేపణ బెంగళూరు-కడప రైలుమార్గంతో దక్షిణాంధ్ర ప్రగతికి నాంది అన్న కమిటీ తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి రూ.1200 కోట్లు అవసరమని నివేదన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం వెన్నెముకగా నిలుస్తుందని రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అత్యంత కీలకమైన ఆ రైలుమార్గానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపించింది. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రగతికి బెంగళూరు-కడప రైలుమార్గం నాంది పలుకుతుందని అభిప్రాయపడింది. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడానికి కనీసం రూ.1200 కోట్ల వ్యయం చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి సమర్పించిన నివేదికలో శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. ఆ కమిటీ చేసిన సూచనలను అమలుచేస్తే జిల్లా సమగ్రాభివృద్ధి సుసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ఎంపికపై డాక్టర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం నియమించిన విషయం విదితమే. ఆ కమిటీ జూలై 9న తిరుపతిలో పర్యటించి.. ప్రజల అభిప్రాయాలు స్వీకరించింది. ఈ-మెయిల్స్, లేఖలు, వినతిపత్రాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించింది. గత నెల 30న కేంద్రానికి కమిటీ నివేదిక అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజధానిపై వచ్చిన 4,728 విజ్ఞప్తుల్లో తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ 113 మంది వినతిపత్రాలు సమర్పించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించాలంటే విశాఖపట్నం, గుంటూరు-విజయవాడతో పాటు తిరుపతిని కూడా మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించింది. 2051 నాటికి తిరుపతి జనాభా 14 లక్షలకు చేరుకుంటుంది.. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెగా సిటీగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే శరణ్యమని విశ్లేషించింది. తెరపైకి శ్రీకాళహస్తి స్పైన్.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రైలుమార్గాలు అత్యంత ఆవశ్యకమని తేల్చింది. తరచుగా వచ్చే తుఫాన్లు, సముద్ర అలల తాకిడి వంటి ప్రతికూల పరిస్థితులు విశాఖ-చెన్నై రహదారిలో రవాణాకు అడ్డంకిగా మారుతాయని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. పైగా ఆ మార్గంలో రవాణా ఖర్చులు సైతం అధికంగా ఉంటాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి స్పైన్‌ను తెరపైకి తెచ్చింది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం నిర్మిస్తే.. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడింది. ఆ రైలు మార్గాన్ని కృష్ణపట్నం, దుగరాజపట్నం ఓడరేవులతో అనుసంధానం చేస్తే.. నవ్యాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలుస్తుందని విశ్లేషించింది. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకూ 308 కిమీల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.1500 కోట్లు అవసరమని తేల్చింది. అత్యంత ప్రధానమైన ఆ రైలుమార్గానికి ఇప్పటిదాకా రూ.1.76 కోట్లే ఖర్చు చేశారని వివరించింది. 2013-14 బడ్జెట్లో రూ.కోటి.. 2014-15 బడ్జెట్లో రూ.ఐదు కోట్లను మాత్రమే శ్రీకాళహస్తి-నడికుడి మార్గానికి కేటాయించారని.. నిధుల కేటాయింపులో అలసత్వం పారిశ్రామికాభివృద్ధిపై పెను ప్రభావం చూపుతుందని తెలిపింది. రవాణ సౌకర్యాలే అడ్డంకి.. సీమ పారిశ్రామికాభివృద్ధికి రవాణా మార్గాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా కమిటీ పేర్కొంది. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గం పూర్తయితే సీమ పారిశ్రామికాభివృద్ధి సుసాధ్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 225 కి.మీల పొడవున నిర్మించే ఈ రైలుమార్గం అంచనా వ్యయం రూ.2,250 కోట్లని పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆ రైలుమార్గాన్ని వేగంగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. జాతీయ రహదారులు, రైలుమార్గాలతోపాటు వాయుమార్గాల(ఎయిర్ కనెక్టివిటి)ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొంది. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అభివృద్ధి చేయాలని సూచించింది. ఇందుకు రూ.1200 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైలు మార్గాలను పూర్తిచేసి.. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తే దక్షిణాంధ్ర(రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం) పారిశ్రామికాభివృద్ధి సాధించడం ఖాయమని పేర్కొంది. శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తే జిల్లా అభివృద్ధికి తిరుగుండదని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. -
తాత్కాలిక రాజధాని వెనుక బాబు ‘విజన్’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని ప్రకాశం జిల్లా మార్టూరు - దొనకొండ - గుంటూరు జిల్లా వినుకొండ మధ్య అనుకూలమంటూ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినా దీని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజధానిపై చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చినందున ఇక్కడ రాజధాని పెట్టడాదనికి ఇష్టపడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన జరగకముందు నుంచి ప్రకాశం జిల్లాను రాజధాని చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. అన్ని అనకూలతలు ఉండటంతో ఈ ప్రాంతం సరైందన్న అభిప్రాయం శివరామకృష్ణ కమిటీ కూడా వ్యక్తం చేయడంతో రాజధాని డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే కమిటీ నివేదిక ఆధారంగా ప్రకాశం జిల్లాలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాజధాని సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. రాజధానిపై కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఏ మాత్రం పట్టించుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని మంత్రులు చేస్తున్న ప్రకటనలతో అర్ధమవుతోంది. శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చినపుడే తన ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పింది. పంట పొలాలను తీసుకుని రాజధానిని చేయడం సరికాదని, దీనివల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుందని, తద్వారా ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని కోసం ఛైనా ఉదంతాన్ని కూడా ఉదహరించింది. గతంలో చైనా పట్టణీకరణ కోసం పంటపొలాలను నాశనం చేసింది. ఆ తర్వాత ఆహార కొరత ఏర్పడటంతో ఇప్పుడు మళ్లీ వ్యవసాయంపై దృష్టిపెట్టిందని కమిటీ సభ్యులు ఆర్మోర్ రవి ప్రకాశం జిల్లా పర్యటనలో స్పష్టం చే సిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఇవ్వకముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావిడిగా విజయవాడను తాత్కాలిక రాజధాని ఏర్పాటు వెనుక ఉండే ‘విజన్ ’లో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే. దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంది. దొనకొండ - మార్టూరు - వినుకొండ ప్రాంతాలను కలిపితే రాయలసీమకు దగ్గరగా ఉండటంతో రాష్టంలోని అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. అసలు కమిటీ నివేదికపై చంద్రబాబు మీడియాను ఎదురు ప్రశ్నలు వేయడంతో బాబు మనసులో మాట మరోలా ఉందన్నది స్పష్టమవుతోంది. -
రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి కడప: ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధాని ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి తెలిపారు. కమిటీ బృందం సోమవారం వైఎస్సార్ జిల్లా పర్యటనకు వచ్చారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం అరోమర్ రేవి విలేకరులతో మాట్లాడారు. కరువు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పరిశీలన ద్వారా రాయలసీమ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య అభివృద్ధితో సమతుల్యతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానికి నీటి లభ్యతే కీలకమైన అంశమని ఆయన స్పష్టంచేశారు. రాజధాని ఏర్పాటుకు వీలైనంత మేరకు తక్కువ భూమినే ఉపయోగించుకోవాలని చెప్పారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల్లో పడిందని, కొత్త రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని తెలిపారు. రాజ ధాని ఏర్పాటు అంశంపై తాము కేవలం సిఫారసులకే పరిమితమని, అందరికీ న్యాయం జరి గేలా నివేదిక రూపొందిస్తామని వివరించారు. విద్యార్థుల ఆందోళన ‘రాజధాని రాయలసీమ హక్కు.. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదు’ అంటూ ఆర్ఎస్ఎఫ్ (రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్) కమిటీ సభ్యులు సోమవారం శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల ఎదుట నిరసన గళమెత్తారు. ‘శివరామకృష్ణన్ కమిటీ గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. -
రాజధానికి 12,500 ఎకరాలు
రాజధాని సలహా కమిటీ భేటీ అనంతరం ఏపీ మంత్రి నారాయణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటుకు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లు... అంటే 10 వేలనుంచి 12,500 ఎకరాల మేరకు భూములు అవసరముంటుందని రాజధాని సలహా కమిటీ అభిప్రాయపడింది. రాజధాని సలహా కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. కమిటీ భేటీ అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్ణయిస్తూ శివరామకృష్ణన్ కమిటీ ఈ నెలలో నివేదిక ఇస్తుందని, ఈ నివేదిక అనంతరం కేబినెట్ ఆమోదానికి వెళుతుందని తెలిపారు. ఆ తర్వాత ఎలా నిర్మించాలనే దానిపై తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌తో పాటు రోడ్లు, రవాణా సౌకర్యం, ఎయిర్‌పోర్టులు, నీళ్లు, తదితర అన్నీ అందుబాటులో ఉన్న ప్రాంతంలోనే రాజధాని ఉండేలా చూస్తామన్నారు. రాజధానికోసం ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు సేకరిస్తామని, ఇవన్నీ పూర్తయ్యాకే ప్రైవేటు భూముల గురించి ఆలోచిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లాలను సైతం ఆదేశించామని చెప్పారు. ‘‘రాజధాని ఎలా నిర్మించాలన్నదానిపై ఆరు విదేశీ నగరాలు, దేశంలోని మరో నాలుగు నగరాలను పరిశీలిస్తాం.’ అని చెప్పారు. -
రూ.15,000కోట్లు
ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్‌కు 8 లైన్ల రహదారి నిర్మించడానికయ్యే ఖర్చు ఇది.. శివరామకృష్ణన్ కమిటీ అంచనా రాజధాని నిర్మాణంపై కేంద్ర కమిటీ - రాష్ట్ర కమిటీల అంచనాల్లో భారీ వ్యత్యాసాలు ప్రభుత్వ భూములున్న చోటును రాజధానికి ఎంపిక చేయాలన్న శివరామకృష్ణన్ కమిటీ భూసేకరణకు రూ. 20,000 కోట్లు వ్యయం అవుతుందన్న నారాయణ కమిటీ విజయవాడ - గుంటూరు - తెనాలి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిర్ణయం రింగ్ రోడ్డు కోసం రూ. 19,700 కోట్లు ఇవ్వాలని ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు 8 లైన్ల రహదారి నిర్మాణం కోసం రూ. 15,000 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. అయితే రాజధాని ఎంపికకు అనువైన ప్రాంతం, నిర్మాణానికి అవసరమైన వనరులకు సంబంధించిన వ్యయంపై.. శివరామకృష్ణన్ కమిటీ అంచనాలకు, ఏపీ మునిసిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో వ్యాపారవేత్తలతో నియమించిన కమిటీ అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు వ్యయంపై శివరామకృష్ణన్ కమిటీ ఎటువంటి అంచనాలూ రూపొందించలేదు. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అంతరించిన అటవీ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే సూచన చేసింది. అయితే.. ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రాజధాని నిర్మాణానికి ఏ రంగంలో ఎంత వ్యయం అవుతుందనే అంచనాలను రూపొందించిన నారాయణ కమిటీ మాత్రం భూసేకరణకు రూ. 20,000 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. రాజధాని నిర్మాణం కోసం ఏకంగా భూసేకరణకే ఇంత పెద్ద మొత్తంలో వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ కమిటీ అంచనా వేయడం పట్ల శివరామకృష్ణన్ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 19,700 కోట్లు... ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేయనున్నట్లు చెప్తున్న ప్రాంతమైన విజయవాడ - గుంటూరు - తెనాలి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఐదున్నర లక్షల ఎకరాల భూమి ఉందని, అందులో నాలుగున్నర లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణంతో పాటు వివిధ రంగాల అభివృద్ధికి వినియోగించాలని చంద్రబాబు ఆలోచనగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రాధమికంగా రూ. 19,700 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాసారని అధికార వర్గాలు తెలిపాయి. రాజధాని పరిసరాల్లో ఒక్కో రంగం అభివృద్ధికి 15,000 ఎకరాలతో ప్లాట్లను విభజించనున్నారని, ఆ విధంగా పదిహేను రంగాలకు పదిహేను ప్లాట్లను కేటాయించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని వ్యాపారవేత్తలతో పాటు కొందరి ప్రయోజనాల కోసం ఈ ప్లాట్ల కేటాయింపు జరగనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రకాశం జిల్లాను పరిశీలించాలని కమిటీకి నివేదిక ఇచ్చామన్నారు. 13 జిల్లాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయా లని కోరినట్లు చెప్పారు. కమిటీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించిందన్నారు. -
సమాన దూరమే సరిపోదు
రాజధాని అంటే చాలా కావాలి.. ఎంపిక తేలిక కాదు శివరామకృష్ణన్ కమిటీ వ్యాఖ్య మధ్యలో ఉండటం ఒక్కటే ప్రధానం కాదు ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు రాజధానికి చౌకగా భూములు లభించాలి.. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ‘ల్యాండ్ పూలింగ్’పై ప్రభుత్వమే చెప్పాలి అనుకూలమైన నేల, వాతావరణం, నీరుండాలి అన్ని ప్రధాన కార్యాలయాలూ రాజధానిలోనే ఉండాల్సిన పనిలేదు.. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్ల్లు, ఉద్యోగుల గృహాలు ఒక చోట ఉండాలి సూపర్ రాజధాని నిర్మాణం పరిష్కారం కాదు {పకాశం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా త్వరలో పర్యటిస్తాం వచ్చే నెల నివేదిక .. నిర్ణయం ప్రభుత్వాలదే ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండటం ఒక్కటే రాజధాని ఎంపికకు ప్రధాన అర్హత కాదు. చౌకగా భూమి లభించడం, అనువైన నేల, అనుకూలమైన వాతావరణం, నీటి లభ్యత వంటి చాలా అంశాలు చూడాలి’’ అని ఏపీ రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ డెరైక్టర్ అరోమర్ రెవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుం దనే విషయంలో తాము సిఫార్సులు మాత్రమే చేస్తామని, ఒక ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పబోమని చెప్పారు. తాము నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో శివరామకృష్ణన్, రెవి వెల్లడించిన ముఖ్యాంశాలు.. దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇట్లాంటి విభజన జరగలేదు. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కూడా రాజధానిని పూర్తిగా తరలించాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక సంక్లిష్టమైన వ్యవహారం. ► రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సానుకూల అంశాలున్నాయి. ►రాష్ట్రంలో 3, 4 ప్రధాన అభివృద్ధి కేంద్రాలు ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వైజాగ్, తిరుపతి, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలుండాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ గురించి సీఎంతో చర్చించాం. రాయలసీమలో సగటు వర్షపాతం కూడా పడని విషయాన్ని, ఆ ప్రాంతవాసులు నీటి కోసం పడుతున్న ఆరాటాన్ని వివరించాం. ► రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రయత్నిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం అంత సులభం కాదు. రాష్ట్రానికి మధ్యలో ఉండటం కూడా రాజధానికి ముఖ్యమే. కానీ అదొక్కటే రాజధాని ఏర్పాటుకు ప్రధానం కాదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘లాండ్ పూలింగ్’ గురించి ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది కొత్త విధానం. విజయవంతమైతే మంచిదే. ఇప్పటికిప్పుడే ‘లాండ్ పూలింగ్’ చేసి రమ్మని ప్రభుత్వానికి చెప్పలేం. కొత్త విధానం అమల్లో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వమే చెప్పాలి. ► ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు. కోరిక ఉండటం ఒక్కటే భూమిని తయారు చేయలేదు. చౌకగా భూమి లభించాలి. భూసేకరణకే భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కొత్త రాజధాని నిర్మాణంలో ఉండకూడదు. భూమితో పాటు అవసరమైన నీటి సౌకర్యం కూడా ఉండాలి. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయాలి. ► అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యేల క్వార్టర్లు, అసెంబ్లీ ఉద్యోగులకు నివాసాల నిర్మాణానికి ఒకే ప్రాంతంలో 60 నుంచి 70 ఎకరాలు కావాలి. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయానికి 15 నుంచి 20 ఎకరాలు సరిపోతుంది. కానీ మంత్రులు, సెక్రటేరియట్ ఉద్యోగుల నివాసాలు, ఇతర అవసరాల కోసం కనీసం మరో 120 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ స్థాయిలో భూమి లభ్యత ఉందని నిర్ధారించిన తర్వాతే.. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయాలి. కేవలం రవాణా అనుసంధానం ఉందనో, రాష్ట్రం మధ్యలో ఉందనో రాజధానిగా ఎంపిక చేయకూడదు. ► రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం ఎక్కువ అనుకూలమనే విషయాన్ని నిర్ణయించలేం. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే యోచన మంచిది కాదు. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల నివాసాలు, ఉద్యోగులకు గృహాలు ఒక చోట ఉండాలి. మిగతా కార్యాలయూలను వేర్వేరు చోట్ల వాటికి అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయొచ్చు. హైదరాబాద్‌లో 192 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అవసరమా? ఏపీలో 89 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా ముఖ్యమే. పశుగణాభివృద్ధి, భూగర్భ గనుల డెరైక్టరేట్లను ఒకే చోట ఏర్పాటు చేయడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. అదేవిధంగా పోర్టుల డెరైక్టరేట్ అనంతపురంలో ఏర్పాటు చేయడంలో అర్థం లేదు. రవాణా అనుసంధానం బాగా ఉన్న కొన్ని ప్రాంతాలను కమిటీ గుర్తించింది. ► ఏపీలో అభివృద్ధికి అవకాశం ఉన్న 13, 14 ప్రాంతాలను కమిటీ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కనీసం మూడు, నాలుగు పట్టణాల విస్తరణకు అవకాశం వస్తుంది. ► బాబు ఉద్యోగాలను సృష్టించలేడు. ఏటా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. ఇన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇవ్వలేదు. పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయి. ► రాజధాని కమిటీ అనే పేరు ఉండవచ్చు. కానీ మా బాధ్యత కేవలం రాజధానిని ఎంపిక చేయడమే కాదు. దానికి ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కమిటీ సరిపోతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి నివేదిక ఇవ్వడం మా కమిటీ విధి. ► కొత్త రాజధాని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను ప్రతిబింబించాలి. ► ఏదో ఒక ప్రధాన నగరాన్ని ఆసరా చేసుకొని రాజధాని నిర్మాణం జరగాలి. ప్రపంచంలో ప్రఖ్యాత రాజధానుల నిర్మాణం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నా దృష్టిలో భువనేశ్వర్ ఉత్తమ రాజధాని. రాజధాని అంటే భారీ భవంతులనే భావన వదిలేయాలి. విజయవాడకు మేం వ్యతిరేకం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూపర్ రాజధాని నిర్మాణం పరిష్కారం కాదు. పెద్ద సంఖ్యలో జనం వస్తే సేవల విషయంలో ఇబ్బంది ఉంటుంది. సమగ్రాభివృద్ధి దిశగా ప్రణాళికలు ఉండాలి. ► గుంటూరు-విజయవాడ చుట్టూ విస్తరించిన ప్రాంతం సారవంతమైన సాగు భూములతో నిండి ఉంది. ఆహార భద్రతనూ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వారి జీవనోపాధినీ పరిగణనలోనికి తీసుకోవాలి. ఎక్కువ మంది జీవనోపాధిని దెబ్బతీసే ప్రణాళికలు ఫలితాన్నివ్వలేవు. కేంద్రీకృత అభివృద్ధి బ్రిటిష్ ఆలోచనా ధోరణి. ఇప్పుడు వికేంద్రీకరణ అవసరం. ► కమిటీ త్వరలో ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పర్యటిస్తుంది. ► సెప్టెంబర్ వరకు కమిటీకి గడువు ఉంది. కానీ ఆగస్టు మధ్యలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అవసరమని కేంద్రానికి చెప్పనున్నాం. -
అది ప్రభుత్వ అభిప్రాయమే
‘గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని’పై మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: గుంటూరు-విజయవాడ నడుమ రాజధాని ఏర్పాటనేది ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ఈ విషయాన్నే శివరామకృష్ణన్ కమిటీకి చెప్పినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతాలు కృష్ణా-గుంటూరు-పశ్చిమగోదావరి జిల్లాలేనన్నారు. శివరామకృష్ణన్ కమిటీతో రాష్ట్ర రాజధాని సలహా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. భేటీ అనంతరం సచివాలయంలో నారాయణ విలేకరులతో మాట్లాడారు. దేశంలో నయా రాయ్‌పూర్, చండీగఢ్, గాంధీనగర్, భువనేశ్వర్, ఇతర దేశాల్లోని బ్రసీలియా(బ్రెజిల్), ఇస్లామాబాద్(పాకిస్తాన్), షాంఘై(చైనా), సింగపూర్, పుత్రజయ(మలేసియా)లను ఉత్తమ రాజధానులుగా గుర్తించామని, అధ్యయనానికి త్వరలో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తామని తెలిపారు. ఈ పర్యటనకయ్యే ఖర్చును సలహా కమిటీలో ఎవరికివారే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి 15 రోజులకోసారి రాజధాని సలహా కమిటీ సమావేశమవుతుందన్నారు. రాజధాని అధ్యయనం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విషయంలో 12 వారాలపాటు ఉచితంగా సేవలందించేందుకు మెకన్సీ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. భూమి, నీరు, సహజ వనరులు, రైలు, రోడ్డు, వాయు రవాణా అనుసంధానంతోపాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పురోగతి ఉండేలా సిఫార్సులు ఉంటాయన్నారు. -
కమిటీ సీఎంను కలిస్తే చాలా?
శివరామకృష్ణన్ కమిటీపై వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్థిరాస్తి వ్యాపారులు, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మలా మారిందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. మైసూరా శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన అంతా గోప్యంగా ఉందని, అసలు అంత రహస్యంగా వారి కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక చంద్రబాబునాయుడును కమిటీ సభ్యులు కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో తప్పులేదని, అయితే రాష్ట్రంలో ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలను ఎందుకు విస్మరించారు? వారిని ఎందుకు కలవ లేదు? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది? ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు? అనే విషయాలతోపాటు ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన శివరామకృష్ణన్ కమిటీ తూతూమంత్రంగా వ్యవహారం నడుపుతోందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతం ఎంపిక కోసం పార్లమెంట్ సూచించిన షరతులను పట్టించుకోకుండా రియల్టర్లు, సిండికేట్ల చేతిలో కమిటీ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందరి అభిప్రాయాలను తీసుకోకుంటే కమిటీ వారి ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటవుతున్నట్లు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారని చెప్పారు. ఫలితంగా అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని అంటుతున్నాయని లక్షల్లో ఉన్న పొలాల ధరలు రూ.కోట్లకు పెరిగాయన్నారు. -
రాజధాని అంటే చాలా కావాలి
ఏపీ కేపిటల్ ఎంపిక అంత సులభం కాదు : శివరామకృష్ణన్ కమిటీ అన్ని ప్రధాన కార్యాలయాలూ రాజధానిలోనే ఉండాల్సిన పనిలేదు వచ్చే నెల్లో నివేదిక ఇస్తాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిని ఎంపిక చేస్తాయి హైదరాబాద్: ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండటం ఒక్కటే రాజధాని ఎంపికకు ప్రధాన అర్హత కాదు. చౌకగా భూమి లభించడం, అనువైన నేల, అనుకూలమైన వాతావరణం, నీటి లభ్యత వంటి చాలా అంశాలు చూడాలి’’ అని ఏపీ రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. శనివారం సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ డెరైక్టర్ అరోమర్ రెవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందనే విషయంలో తాము సిఫార్సులు మాత్రమే చేస్తామని, ఒక ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పబోమని చెప్పారు. విలేకరుల సమావేశంలో శివరామకృష్ణన్, రెవి వెల్లడించిన ముఖ్యాంశాలు.. ► దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇట్లాంటి విభజన జరగలేదు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాజధాని ఎంపిక క్లిష్టమైన వ్యవహారం. ►రాష్ట్రంలో 3, 4 ప్రధాన అభివృద్ధి కేంద్రాలు ఉండాలని సీఎం భావిస్తున్నారు. వైజాగ్, తిరుపతి, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలుండాలనే యోచనలో ఉన్నారు. ► రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడానికి సీఎం కార్యాలయం కూడా ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి మధ్యలో ఉండటం కూడా రాజధానికి ముఖ్యమే. కానీ అదొక్కటేప్రధానంకాదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘లాండ్ పూలింగ్’ గురించి ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది కొత్త విధానం. విజయవంతమైతే మంచిదే. కొత్త విధానం అమల్లో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వమే చెప్పాలి. ►ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు. అదొక్కటే భూమిని తయారు చేయలేదు. చౌకగా భూమి లభించాలి. దీనికే భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కొత్త రాజధాని నిర్మాణంలో ఉండకూడదు. భూమితో పాటు అవసరమైన నీటి సౌకర్యం కూడా ఉండాలి. ►అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యేల క్వార్టర్లు, అసెంబ్లీ ఉద్యోగులకు నివాసాల నిర్మాణానికి ఒకే ప్రాంతంలో 60 నుంచి 70 ఎకరాలు కావాలి. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయానికి 15 నుంచి 20 ఎకరాలు సరిపోతుంది. కానీ మంత్రులు, సెక్రటేరియట్ ఉద్యోగుల నివాసాలు, ఇతర అవసరాల కోసం కనీసం మరో 120 ఎకరాల భూమి అవసరమవుతుంది. ► అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే యోచన మంచిది కాదు. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల నివాసాలు, ఉద్యోగులకు గృహాలు ఒక చోట ఉండాలి. మిగతా కార్యాలయూలను వేర్వేరు చోట్ల వాటికి అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయొచ్చు. హైదరాబాద్‌లో 192 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అవసరమా? ►ఏపీలో అభివృద్ధికి అవకాశం ఉన్న 13, 14 ప్రాంతాలను కమిటీ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కనీసం మూడు, నాలుగు పట్టణాల విస్తరణకు అవకాశం వస్తుంది. ► బాబు ఉద్యోగాలను సృష్టించలేడు. ఏటా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. ఇన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇవ్వలేదు. పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయి. ► ఏదో ఒక ప్రధాన నగరాన్ని ఆసరా చేసుకొని రాజధాని నిర్మాణం జరగాలి. ప్రపంచంలో ప్రఖ్యాత రాజధానుల నిర్మాణం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నా దృష్టిలో భువనేశ్వర్ ఉత్తమ రాజధాని. రాజధాని అంటే భారీ భవంతులనే భావన వదిలేయాలి. భూమి ఎలా బాబూ..! చంద్రబాబును ప్రశ్నించిన కమిటీ హైదరాబాద్: విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆలోచనను శివరామకృష్ణన్ కమిటీ వ్యతిరేకించినట్లు సమాచారం. సీఎంతో కమిటీ రెండు గంటలకుపైగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో సీఎం తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. కొత్త రాజధాని నిర్మాణానికి విజయవాడ - గుంటూరు మధ్య భూసేకరణ పెద్ద సమస్య అవుతుందనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. ‘డెవలెప్మెంట్’ పేరిట పట్టణాల్లో స్థలాలు తీసుకొని అపార్ట్మెంట్లలో వాటా ఇస్తున్న తరహాలో రైతుల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేసిన తర్వాత 40 శాతం వాటా ఇచ్చే ‘ల్యాండ్ పూలింగ్’ విధానాన్ని తాము అనుసరిస్తామని, కమిటీకి సీఎం వివరించారు. దీని సాధ్యాసాధ్యాలపై కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ప్రయోజనాలుంటాయంటూ చంద్రబాబు ఎంతగా ఏకరువు పెట్టినా కమిటీ సానుకూలంగా స్పందించలేదు. -
వెనుకబడిన ప్రాంతాన్ని రాజధాని చేయాలి
శివరామకృష్ణన్ కమిటీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి రాజధాని సీమ, ఆంధ్రకు మధ్య ఉండాలి న్యూఢిల్లీ: వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒంగోలు లోక్‌సభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి నివేదించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్న ఈ కమిటీని ఆయన బుధవారమిక్కడ కలిశారు. ‘‘రాజధానిని అటు ఆంధ్రా అయినా, ఇటు రాయలసీమ అయినా వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాజధాని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రెండింటి మధ్య ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ రెండు ప్రాంతాలకు మధ్య ఉంది. పైగా ఇక్కడ 55 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇక్కడే డిఫెన్స్‌కు చెందిన ఎయిర్‌పోర్టు కూడా ఉంది. కృష్ణా నది నుంచి నీటి వసతి కూడా పొందవచ్చు. దొనకొండ వద్ద నుంచే మెయిన్ కెనాల్ వెళుతోంది. కీలక రైలుమార్గం నడికుడి-శ్రీకాళహస్తి కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాంటి నిరుపయోగమైన ప్రభుత్వ భూమి ఉండగా.. కోట్లు వెచ్చించి ఇతరత్రా భూసేకరణ చేయాల్సిన అవసరం రాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సలహా కమిటీ కృష్ణా-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేయాలని మీకు విన్నవించినట్టు తెలిసింది. తుది నిర్ణయానికి ముందు ఒకసారి దొనకొండ ప్రాంతాన్ని, ప్రకాశం జిల్లాను సందర్శించండి..’’ అని ఆయన కమిటీకి విన్నవించారు. తన విన్నపాన్ని పరిశీలిస్తానని, తప్పక ఆ ప్రాంతంలో పర్యటిస్తానని శివరామకృష్ణన్ పేర్కొన్నట్టు వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేయండి: ఎంపీ బుట్టా రేణుక న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేయాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక బుధవారమిక్కడ ఢిల్లీలో కె.సి.శివరామకృష్ణన్‌ను కలసి నివేదించారు. ‘‘కర్నూలు చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతమేగాక గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న పట్టణం. దీనికి పొరుగునున్న నాలుగు రాష్ట్రాలతో కనెక్టివిటీ ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం పాలనకు సౌలభ్యంగా ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి చాలా అనుకూలంగా ఉంటుంది’ అని ఆమె విన్నవించారు. -
1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చలు
కర్నూలు(న్యూసిటీ) : కర్నూలును రాజధానిగా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ విద్యార్థి సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కొత్త బస్టాండ్ నుంచి రాజ్‌విహార్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు అక్కడ నుంచి సీక్యాంప్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రశేఖర్, శ్రీరాములు మాట్లాడుతూ 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చల ఫలితంగా కర్నూలును రాజధానిగా చేయాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీకి చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు కన్నభూమికి ద్రోహం చేశారని ఆరోపించారు. రాయలసీమలో కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడును అడ్డుకుంటామని హెచ్చరించారు. -
దొనకొండే బంగారు కొండ!
ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవైపున కోస్తాంధ్ర ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం... రాజధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయమై ఇటు ప్రభుత్వం నుంచి, అటు శివరామకృష్ణన్ కమిటీ నుంచి ఇంతవరకు నిర్దిష్ట ప్రతిపాదనలు ఏవీ స్పష్టం కాలేదు. దీంతో నూతన రాజధానిని ఎక్కడ నిర్మిం చబోతున్నారు? అనే విషయంపై అన్ని ప్రాంతాల ప్రజల అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే కర్నూలు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి పట్టణాలు రాజధాని విషయంలో పోటీ పడుతున్నాయి. అయితే జనాభా కిక్కిరిసి ఉన్న నగరప్రాంతాల్లో రాజ ధాని నిర్మాణానికి తగిన భూమి, ఇతర వనరులు లభించే అవకాశం లేదు. రాజధానిని తమ ప్రాంతంలోనే ఏర్పర్చనున్నారనే పుకార్ల మధ్య ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ భూముల విలువ కొండెక్కి కూర్చుంది. ప్రైవేట్ భూములను భారీ విలువ పెట్టి కొని రాజధానిని నిర్మించడం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా ప్రభుత్వ భూముల్లోనే కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కల్పిస్తోంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో విస్తారంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయవచ్చని తొలినుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. రాష్ట్రానికి ప్రజలకు అభివృద్ధి, ఉపాధి కల్పనా కేంద్రం రాజధాని. పాల నాపరంగా, అభివృద్ధి పరంగా రాజధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే కనీసం వంద సంవత్సరాల వరకు ఇబ్బంది లేని రాజధాని నిర్మాణం చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంలో ఇరుకైన ప్రదేశా లలో రాజధానిని నిర్మించడం ఇబ్బందికరం. మరోవైపున రాజధాని కోసం ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొనడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆచరణీయం కాదు. అందుకే అత్యంత అనుకూలమైన పరిస్థితు లున్న దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకాశం జిల్లావాసుల అభిప్రాయం. దొనకొండ ప్రత్యేకత ఏమిటీ? ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన దొనకొండ, కొనకన మిట్ల, పొదిలి, మార్కాపురం, త్రిపురాంతకం, పెద్దారవీడు, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, కనిగిరి, వెలిగండ్ల, హనుమంతుని పాడు మండలాల పరిధిలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు, మరికొన్ని వేల ఎకరాల అటవీ భూ ములు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి సరిపోగా మిగిలిన భూమి నుండి ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా అనేక అనుబంధ అవసరాలు కూడా నెరవేరే అవకాశముంది. ఉదాహరణకు మార్కాపురం డివిజన్లో ఉన్న 56 వేల ఎకరాల భూమిలో 20 వేల ఎకరాలను రాజధానికి ఉపయోగించు కోవచ్చు. మిగతా 30 వేల ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు రహదా రులు, భవనాలు, పార్కులు, హాస్పిటల్స్, ఆర్.టి.సి వంటి సంస్థలకు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ లభించే భూమిలో 70 శాతాన్ని ప్రభుత్వ అవస రాలకు ఉపయోగిస్తే మిగిలిన 30 శాతం భూమిని ప్రైవేట్ అవసరాలకు ఉప యోగించవచ్చు. ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొను గోలు చేయన వసరం లేకుండా మార్కాపురంలోని ప్రభుత్వ భూములను ఎలాంటి వివాదాలు లేకుండానే రాజధాని కోసం తీసుకోవచ్చు. పైగా, భౌగోళికంగా చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మధ్యస్థ ప్రాం తంలో ప్రకాశం జిల్లా ఉంది. ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవై పున కోస్తాంధ్ర ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రకాశం జిల్లాలో రాజ ధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయా లను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. పైన ప్రస్తావించిన అన్ని మండలాల్లోనూ దొనకొండకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర రాజధానికి అవసరమైన నీరు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలలో దొనకొండే మిగతా ప్రాంతాల కంటే ముందంజలో ఉంది. రైలు, రోడ్డు, గగనతలం మూడు రంగాల్లో అభివృద్ధికి దొనకొండ అనుకూలంగా ఉంటోంది. నీరు: ప్రతిరోజూ లక్షలాది లీటర్ల నీరు అవసరమయ్యే రాజధానికి దొనకొండ అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి పది కి.మీ దూరంలో నాగార్జున సాగర్ కుడి కాలువ ఉంది. 30 కి.మీ దూరంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. 80 కి.మీ దూరంలో శ్రీశైలం డ్యాం ఉంది. 100 కి.మీ దూరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. పైగా పురాతనమైన కంభం చెరువు ఇక్కడికి 70 కి.మీ దూరంలో ఉంది. కాబట్టి, రాజధానిని ఇక్కడే నిర్మిస్తే నీటి సమస్య ఏ మాత్రం ఉండదు. రోడ్డు మార్గం: ఒంగోలు నుండి నంద్యాలకు ఉన్న హైవే దూరం కేవలం 40 కి.మీ. అలాగే మార్కాపురం నుండి కడప వెళ్లే జాతీయ రహదారి దూరం 25 కి.మీ మాత్రమే. రాజధానిని ఇక్కడే నిర్మిస్తే ఇక్కడినుంచి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చాలా సులభం. రైల్వే: దొనకొండలో గతంలో రైల్వేలోకో షెడ్ ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి అనంతపురం వరకు రైల్వే లైన్ ఉంది. ఇక్కడికి 80 కి.మీ దూరంలో ఒంగోలు ఉంది. ఇక్కడినుండి కోల్‌కతా-చెన్నై రైల్వే లైన్ ఉంది. దొనకొండ మార్గంలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను సర్వే గతంలోనే పూర్తయ్యింది. విమానాశ్రయం: దొనకొండలో బ్రిటిష్ వారి హయాంలో 135 ఎకరాలలో నిర్మించిన విమానాశ్రయం ఉంది. అప్పట్లో విమానాల్లో పెట్రోలు నింపడా నికి బ్రిటిష్ వారు దీన్ని ఉపయోగించేవారు. నేటికీ ఈ విమానాశ్రయం అలాగే ఉంది. కాగా, ఒంగోలు దగ్గర బీరంగుంట ప్రాంతంలో విమానాశ్ర యానికి గతంలోనే స్థల పరిశీలన జరిగింది. పంటలు: జిల్లాలో పొగాకు, మిర్చి పంటలు విస్తారంగా పండుతాయి. అలాగే మత్స్య, పాడి పరిశ్రమలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గ్రానైట్, క్వార్జ్, పలకల పరిశ్రమ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచమంతటా గుర్తింపు పొందిన ఒంగోలు గిత్త ప్రకాశం జిల్లాదే. వివాద రహితం... ఖర్చు తక్కువ ఇన్ని అనుకూలతలకు తోడుగా, కేంద్రప్రభుత్వం విభజన బిల్లులో రాజధానికోసం భూ సేకరణపై గతంలోనే స్పష్టతనిచ్చింది. రాజధానికోసం ఒక్క ఎకరా భూమిని కూడా కొనుగోలు చేయబోమని, అవసరమైతే అటవీ భూములను డీ - నోటిఫై చేసి భూములను తీసుకుంటామని మునుపటి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పైగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో రాజధానిని ఏర్పరిస్తే వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. వెనుకబడిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం, ప్రజలు అభివృద్ధిలోకి పయనిస్తారు. పైగా మౌలిక వసతులు కూడా గణనీయంగా మెరుగుపడతాయి. రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు సరైన ప్రాంతంలో జరిగితే మరో వేర్పాటు ఉద్యమం జరిగే అవకాశం ఉండదు. విభజన అనంతరం మళ్లీ కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్న రాయలసీమ వాసులు కూడా ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. రాజధాని ప్రకాశం జిల్లాలో పెడితే అందరికీ సముచితంగా ఉంటుందన్న వాదనతో సీమవాసులు ఏకీభవించే అవకాశం కనబడుతోంది. ఈ లక్ష్యం తోటే గత సంవత్సరం ఆగస్టున ప్రకాశం జిల్లాలో రాజధాని సాధన సమితిని స్థాపించాము. రాష్ట్ర రాజధానిని ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, ఆ విధంగానే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తూ ప్రచారం చేస్తున్నాము. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిలో పయనించా లంటే రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశం. రాజధాని సాధన సమితి వాదం అభివృద్ధి వాదమే తప్ప మరొకటి కాదు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజ నాలు, రాజకీయ పార్టీలకు తావు లేకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాజ ధాని సాధన సమితి కృషి చేస్తోంది. మేధావులు, రాజకీయ నాయకులు, అధి కారులు, అనధికారులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, విద్యా ర్థులు... సహా వివిధ వర్గాల ప్రజలు ఇక్కడే రాజధాని నిర్మాణం కోసం తమ వంతు బాధ్యతగా ప్రయత్నాలు చేపట్టాలి. ఒక్క ఎకరా భూమి కూడా కొను గోలు చేయనవసరం లేకుండా విస్తారంగా ప్రభుత్వ భూమి లభ్యమవుతున్న ప్రకాశం జిల్లాలోనే రాజధానిని నిర్మించడం సముచితం కూడా. (వ్యాసకర్త ‘రాజధాని సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు) వినుకొండ రాజారావు -
ఏపీ రాజధానిపై ‘బాబు’ కమిటీ
-
ఏపీ రాజధానిపై ‘బాబు’ కమిటీ
పేరుకు రాజధాని ఏర్పాటు సలహా కమిటీ నిఫుణులకు దక్కని చోటు చైర్మన్‌గా నారాయణ.. సభ్యులంతా పారిశ్రామికవేత్తలే రాజధాని రూపురేఖలు,సలహాల కోసమని వెల్లడి కేంద్ర కమిటీ కసరత్తు జరుగుతుండగానే రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రూపురేఖలు, నిర్మాణానికి సలహాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ‘రాజకీయ’ కమిటీని నియమించింది. ఈ కమిటీలో అందరూ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి అనుంగులే తప్ప అసలు ఓ నగర నిర్మాణానికి అవసరమైన నిపుణులు లేకపోవడం విమర్శలకు దారితీసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతం ఎంపిక, దానికి మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అవసరాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తవుతోంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం, అందులోనూ పారిశ్రామికవేత్తలనే నియమించడం, ఇతర రంగాల నిపుణులకు చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోపక్క.. విజయవాడ - గుంటూరు మధ్యనే రాజధాని అంటూ ముఖ్యమంత్రితోసహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు ప్రకటించి గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ చైర్మన్‌గా ఓ కమిటీని నియమించి మరో గందరగోళానికి తెరలేపింది. అసలు ఈ కమిటీ ప్రకటన వెలువడీ వెలువడకముందే దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లి శివరామకృష్ణన్‌కు రాజధానిపై ఓ నివేదిక అందించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కమిటీ ఎందుకు, అందులోనూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలనే ఎందుకు సభ్యులుగా నియమించారు, దీని వెనుక ఉద్దేశాలేమిటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఫక్తు ‘రాజకీయ’ సలహా కమిటీయేనన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు సన్నిహితులైన మంత్రి నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), గల్లా జయదేవ్లిద్దరూ పారిశ్రామికవేత్తలే. టీడీపీ ఎంపీలైన వీరిద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే. వీరిలో ఒకరు బాబుకు వ్యాపార బినామీ అన్న విమర్శలున్నాయి. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూపులో స్టీల్, టెలికాం, విద్యుత్తు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ రంగం తదితర సంస్థలు ఉన్నాయి. గల్లా జయదేవ్ అమర్‌రాజా గ్రూపు కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్. ఈ గ్రూపులో ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ బ్యాటరీలు, బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఇన్వెర్టర్లు తదితర తయారీ విభాగాలతో పాటు మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇతర సభ్యుల్లో జీవీ సంజీవరెడ్డి జీవీకే గ్రూపు కంపెనీల వైస్ చైర్మన్‌గా ఉన్నారు. బొమ్మిడాల శ్రీనివాస్ జీఎమ్మార్ గ్రూపు కంపెనీల్లో ముఖ్యమైన ఎయిర్‌పోర్టుల విభాగానికి చైర్మన్. మండవ ప్రభాకర్‌రావు నూజివీడు సీడ్స్ కంపెనీ చైర్మన్. ఈ గ్రూపులోనూ అనేక ఇతర పరిశ్రమలున్నాయి. చింతలపాటి శ్రీనివాస్ రాజు (శ్రీనిరాజు) పీపల్ క్యాపిటల్ చైర్మన్‌గా ఉన్నారు. కమిటీలో ఉన్న మరో సభ్యుడు బీదమస్తాన్‌రావు టీడీపీకి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే. ఈ కమిటీలో నిపుణులెవరికీ స్థానం దక్కకపోవడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. కేవలం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి మాత్రమే చోటు కల్పించారు. ఆయన కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. శివరామకృష్ణన్ కమిటీకి ఆగస్టు 31వ తేదీలోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం కూడా చేస్తోంది. కమిటీ పిలుపు మేరకు ప్రజల నుంచి ఈ మెయిళ్ల రూపంలో 7 వేలకు పైగా వినతులు అందాయి. ఈ కమిటీలో ఉన్న వారంతా వివిధ రంగాల్లో నిపుణులే. తాజా కమిటీ మొత్తం రాజకీయ మయంగా మారింది. రాజధానిపై ముందే చెప్పిన ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంపై రోజుకోరకమైన ప్రకటన చేస్తూ గందరగోళానికి తెరలేపింది. గుంటూరు -విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు అవుతుందన్నట్లుగా, అదే అనుకూల ప్రాంతమన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహారాష్ట్ర మంత్రులు పదేపదే ప్రకటనలు చేయడంతో ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేశాయి. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లోనే రాజధానికి తాము సుముఖమన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీకి ఓ నివేదికను కూడా అందించినట్లు మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు. కొత్త కేపిటల్‌కు 30 టీఎంసీల నీరివ్వాలని వినతి నూతన రాజధాని తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎవరికీ కేటాయించని కృష్ణా జలాల నుంచి ఈ 30 టీఎంసీలను రాజధానికి ఇవ్వాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. గత ఏడాది కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పును వెలువరించిన తరువాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో నూతన రాజధాని కోసం 30 టీఎంసీలు అవసరమని అంచనా వేసినట్లు కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నేడు ఢిల్లీకి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడైన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌తో ఆయన భేటీ కానున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా సదుపాయాలు, ఇందుకయ్యే వ్యయం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ఆయన కేంద్ర కమిటీకి అందించనున్నారని సమాచారం.