ఏపీ రాజధానిపై ‘బాబు’ కమిటీ
పేరుకు రాజధాని ఏర్పాటు సలహా కమిటీ
నిఫుణులకు దక్కని చోటు
చైర్మన్‌గా నారాయణ.. సభ్యులంతా పారిశ్రామికవేత్తలే
రాజధాని రూపురేఖలు,సలహాల కోసమని వెల్లడి
కేంద్ర కమిటీ కసరత్తు జరుగుతుండగానే
రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రూపురేఖలు, నిర్మాణానికి సలహాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ‘రాజకీయ’ కమిటీని నియమించింది. ఈ కమిటీలో అందరూ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి అనుంగులే తప్ప అసలు ఓ నగర నిర్మాణానికి అవసరమైన నిపుణులు లేకపోవడం విమర్శలకు దారితీసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతం ఎంపిక, దానికి మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అవసరాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తవుతోంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం, అందులోనూ పారిశ్రామికవేత్తలనే నియమించడం, ఇతర రంగాల నిపుణులకు చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోపక్క.. విజయవాడ - గుంటూరు మధ్యనే రాజధాని అంటూ ముఖ్యమంత్రితోసహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు ప్రకటించి గందరగోళం సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ చైర్మన్‌గా ఓ కమిటీని నియమించి మరో గందరగోళానికి తెరలేపింది. అసలు ఈ కమిటీ ప్రకటన వెలువడీ వెలువడకముందే దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లి శివరామకృష్ణన్‌కు రాజధానిపై ఓ నివేదిక అందించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కమిటీ ఎందుకు, అందులోనూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలనే ఎందుకు సభ్యులుగా నియమించారు, దీని వెనుక ఉద్దేశాలేమిటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఫక్తు ‘రాజకీయ’ సలహా కమిటీయేనన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు సన్నిహితులైన మంత్రి నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), గల్లా జయదేవ్‌లిద్దరూ పారిశ్రామికవేత్తలే. టీడీపీ ఎంపీలైన వీరిద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే. వీరిలో ఒకరు బాబుకు వ్యాపార బినామీ అన్న విమర్శలున్నాయి. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూపులో స్టీల్, టెలికాం, విద్యుత్తు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ రంగం తదితర సంస్థలు ఉన్నాయి. గల్లా జయదేవ్ అమర్‌రాజా గ్రూపు కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్. ఈ గ్రూపులో ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ బ్యాటరీలు, బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఇన్వెర్టర్లు తదితర తయారీ విభాగాలతో పాటు మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇతర సభ్యుల్లో జీవీ సంజీవరెడ్డి జీవీకే గ్రూపు కంపెనీల వైస్ చైర్మన్‌గా ఉన్నారు. బొమ్మిడాల శ్రీనివాస్ జీఎమ్మార్ గ్రూపు కంపెనీల్లో ముఖ్యమైన ఎయిర్‌పోర్టుల విభాగానికి చైర్మన్. మండవ ప్రభాకర్‌రావు నూజివీడు సీడ్స్ కంపెనీ చైర్మన్. ఈ గ్రూపులోనూ అనేక ఇతర పరిశ్రమలున్నాయి.
చింతలపాటి శ్రీనివాస్ రాజు (శ్రీనిరాజు) పీపల్ క్యాపిటల్ చైర్మన్‌గా ఉన్నారు. కమిటీలో ఉన్న మరో సభ్యుడు బీదమస్తాన్‌రావు టీడీపీకి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే. ఈ కమిటీలో నిపుణులెవరికీ స్థానం దక్కకపోవడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. కేవలం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి మాత్రమే చోటు కల్పించారు. ఆయన కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. శివరామకృష్ణన్ కమిటీకి ఆగస్టు 31వ తేదీలోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం కూడా చేస్తోంది. కమిటీ పిలుపు మేరకు ప్రజల నుంచి ఈ మెయిళ్ల రూపంలో 7 వేలకు పైగా వినతులు అందాయి. ఈ కమిటీలో ఉన్న వారంతా వివిధ రంగాల్లో నిపుణులే. తాజా కమిటీ మొత్తం రాజకీయ మయంగా మారింది.
రాజధానిపై ముందే చెప్పిన ప్రభుత్వం
శివరామకృష్ణన్ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంపై రోజుకోరకమైన ప్రకటన చేస్తూ గందరగోళానికి తెరలేపింది. గుంటూరు -విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు అవుతుందన్నట్లుగా, అదే అనుకూల ప్రాంతమన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహారాష్ట్ర మంత్రులు పదేపదే ప్రకటనలు చేయడంతో ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేశాయి. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లోనే రాజధానికి తాము సుముఖమన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీకి ఓ నివేదికను కూడా అందించినట్లు మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు.
కొత్త కేపిటల్‌కు 30 టీఎంసీల నీరివ్వాలని వినతి
నూతన రాజధాని తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎవరికీ కేటాయించని కృష్ణా జలాల నుంచి ఈ 30 టీఎంసీలను రాజధానికి ఇవ్వాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. గత ఏడాది కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పును వెలువరించిన తరువాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో నూతన రాజధాని కోసం 30 టీఎంసీలు అవసరమని అంచనా వేసినట్లు కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
నేడు ఢిల్లీకి నారాయణ
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడైన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌తో ఆయన భేటీ కానున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా సదుపాయాలు, ఇందుకయ్యే వ్యయం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ఆయన కేంద్ర కమిటీకి అందించనున్నారని సమాచారం.