కమిటీ సీఎంను కలిస్తే చాలా?
శివరామకృష్ణన్ కమిటీపై వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్థిరాస్తి వ్యాపారులు, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మలా మారిందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. మైసూరా శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన అంతా గోప్యంగా ఉందని, అసలు అంత రహస్యంగా వారి కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక చంద్రబాబునాయుడును కమిటీ సభ్యులు కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో తప్పులేదని, అయితే రాష్ట్రంలో ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలను ఎందుకు విస్మరించారు? వారిని ఎందుకు కలవ లేదు? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది? ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు? అనే విషయాలతోపాటు ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన శివరామకృష్ణన్ కమిటీ తూతూమంత్రంగా వ్యవహారం నడుపుతోందని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతం ఎంపిక కోసం పార్లమెంట్ సూచించిన షరతులను పట్టించుకోకుండా రియల్టర్లు, సిండికేట్ల చేతిలో కమిటీ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందరి అభిప్రాయాలను తీసుకోకుంటే కమిటీ వారి ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటవుతున్నట్లు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారని చెప్పారు. ఫలితంగా అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని అంటుతున్నాయని లక్షల్లో ఉన్న పొలాల ధరలు రూ.కోట్లకు పెరిగాయన్నారు.