MV mysura reddy
-
ఏపీ నీళ్లు కృష్ణార్పణం : ఎంవీ మైసూరా రెడ్డి
హైదరాబాద్ సిటీ: కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వెళ్లిన ప్రతినిధులు రాష్ట్ర వాటాను కృష్ణార్పణం చేయడం సహించరాని చర్యని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏపీ రైతుల ప్రజల పాలిట ఆశనిపాతమని, మొత్తం వ్యవసాయ ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వాటాను సాధించుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో వాటాను సాధించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగాని, బోర్డు సమావేశానికి వెళ్లిన అధికారులు గాని ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించలేదని ధ్వజమెత్తారు. ఎంతో కష్టపడి బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సాధించుకున్న హక్కులను ఆంధ్రప్రదేశ్ తేలిగ్గా వదలి వేసిందని, ఏ దశలోనూ పోరాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, ఖరీఫ్ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించకపోవడం, కేంద్రంలో వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడంలో కృషి చేయలేకపోవడం వంటి వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నాలు జరపాలని పిలుపునిచ్చినట్లు మైసూరా వెల్లడించారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు ధర్నాలు ప్రారంభమవుతాయన్నారు. కీలకమైన ఈ మూడు అంశాలతో పాటు ఆయా జిల్లాల్లో ఉండే స్థానిక సమస్యలు కూడా ఈ ధర్నాల్లో డిమాండ్లుగా ఉంటాయని తెలిపారు. సర్కారు లాలూచీ... ఏసీబీ కేసుల విషయంలో పతాకస్థాయిలో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్న కృష్ణా నదీ జలాల కేటాయింపులను తేలిగ్గా వదలి వేసిందని మైసూరా విమర్శించారు. బోర్డు ముందుకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు ఏపీ దిగువ రాష్ట్రం అనే విషయం పరిగణించినట్లు లేదన్నారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్‌లో విస్పష్టంగా నీళ్లను కేటాయించిన విషయాన్ని విస్మరించి గంపగుత్తగా నీళ్లను వాడుకోవాలని బోర్డులో నిర్ణయించడమనేది ఏపీకి ఆశనిపాతమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు కలిపి 749.16 టీఎంసీల నీటితోపాటు శ్రీశైలంలో 33 టీంఎసీలు, జూరాలలో 17.84 టీఎంసీల నీరు ఆవిరవుతాయని అంచనా వేసి మొత్తం మీద 811 టీఎంసీల నీటిని కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణ కేటాయింపులు కూడా ప్రాజెక్టుల వారీగానే ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా 299 టీఎంసీల నీటిని గంపగుత్తగా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అవకాశం ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలు దారుణంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రస్తుత బోర్డు నిర్ణయం ఉందన్నారు. 299 టీఎంసీలను తెలంగాణ గంపగుత్తగా ఎక్కడైనా వాడుకుంటే.. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు దారుణంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్ర అభివృద్ధి కోసం కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తయిన తర్వాతే అక్కడ మిగిలే నీటిలో 20 టీఎంసీలు భీమాకు ఇవ్వాలని నిర్ణయిస్తే, ఇంకా ఆధునీకరణ పూర్తికాకుండానే 20 టీఎంసీల నీటిని భీమాకు ఇవ్వడానికి అంగీకరించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, కృష్ణా డెల్టా రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టి తెలంగాణకు ఉదారంగా 20 టీఎంసీలు వదిలేయడం వెనక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంపై బోర్డులో మన ప్రతినిధులు గట్టిగా ప్రస్తావించకపోవడం దుర్మార్గమైన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తూంటే ఏదో లాలూచీ పడినట్లుగా కనిపిస్తోందని మైసూరా అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రస్తుతం వేడి తగ్గినట్లుగానే ఉందని, నాలుగైదు రోజుల క్రితం ఉన్న వాడి వేడి ఈ కేసులో ఇపుడు లేనేలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది'
-
'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలోని ప్రజలు కరువు పరిస్థితులు తట్టుకోలేక వలసలు పోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్ని భరించలేని ప్రజలు రాష్ట్రం నుంచి వలసలు పోతున్నారని చెప్పారు. 'మద్దతు ధర అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 25 శాతమే ధాన్యం సేకరణ జరుగుతోంది. పత్తికి కూడా కనీస మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ హామీ.. ఎన్నికలకే పరిమితమైంది. ఓ పక్క కరువు. మరో పక్క మద్దతు ధర లేదు. ఇన్ని బాధలుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. పంటల నష్టంపై అంచనాలు వేయడం లేదు. కేంద్రానికి నివేదికలు సరిగా పంపడం లేదు' అని మైసూరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 'వచ్చే నెల 4, 5 తేదీల్లో ఈ సమస్యలపై మండల స్థాయి అధికారులకు విజ్ఞాపనా పత్రాలు అందజేస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రత్యేక హోదాపై వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాని నీరుగారుస్తోంది' అంటూ మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారం మోపడంలో ఎలాంటి వివాదాల్లేవ్..
-
భారం మోపడంలో ఎలాంటి వివాదాల్లేవ్..
హైదరాబాద్: ప్రజలపై భారం మోపడంలో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్ను వేసి ప్రజల నుంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఏపీ సర్కారుకు ఎంత దురుద్దేశం ఉందో స్పష్టంగా తెలుస్తోందని మైసూరా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ పై ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులో సవాల్ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇంటికి పెద్దన్నలా ఉండే కేంద్రం కూడా దీనిపై జోక్యం చేసుకోకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఎంట్రీ పన్ను విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. గవర్నర్‌కు ఆలయాలు తిరగడానికే సమయం సరి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. ఎన్నో విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. కానీ ప్రజలపై భారం మోపడంలో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాలు పని చేస్తున్నాయని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. -
రెక్కలు విరిచారంటూనే కేబినెట్ లో ఉంటారా?
-
రెక్కలు విరిచారంటూ కేబినెట్ లో కొనసాగుతారా?
కడప: పట్టిసీమ కోసమే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు కేటాయించడంపై అనుమానాలున్నాయని అన్నారు. రెక్కలు విరిచారంటున్న చంద్రబాబు... కేంద్ర కేబినెట్ లో తమ పార్టీని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్న డిమాండ్ తో కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మైసూరారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని గతంలో దేవినేని ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈరోజు గండికోటకు జూలైలోగా నీరందిస్తామంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. సర్కారుకు అంత చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటిని ఎందుకు వృధాగా కిందికి వదిలారని అన్నారు. -
ప్రజలపై విద్యుత్ భారం దుర్మార్గం
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఆ భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలిక, ద్వైపాక్షిక విద్యుత్ కొనుగోళ్లకు భారీగా ధర చెల్లించిన ఫలితంగా వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆ భారాన్ని ప్రజలపై ఎలా వేస్తారని ప్రశ్నించారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పం మంచిదేనని.. అయితే ఇలా అధిక ధరలకు కొనుగోలు చేసి మాత్రం కాదన్నారు. అవినీతి, దుబారా, స్వలాభం కోసం నేల విడిచి సాము చేయడం వల్ల.. అధిక ధరలకు కొన్న విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేలా డిస్కంలను కోరడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మైసూరా విమర్శించారు. # 2014-15, 2015-16 సంవత్సరాలకుగాను విద్యుత్ చార్జీలు పెంచేలా అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు(ఏపీఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్) దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికతమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని, సంస్థలు చేసిన అవినీతి, దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించాలనడాన్ని అంగీకరించబోమని అన్నారు. # 12 వేల మిలియన్ యూనిట్ల మేరకు జరిగిన విద్యుత్ స్వల్పకాలిక, ద్వైపాక్షిక కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై సహా అధిక ధరలపై కూడా ఏపీఈఆర్సీ పూర్తిస్థాయి విచారణ చేయాలని మైసూరా డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు ధరలు పెరిగినందువల్ల నష్టం వాటిల్లిందని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. # అంతర్జాతీయంగా సహజవాయువు ధరలు తగ్గాయని, అయితే, పెరిగిన సహజ వాయువు ధరల వల్లే అదనపు భారం పడుతోందని డిస్కంలు పేర్కొనడంపై మైసూరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు గ్యాస్‌లో అధిక లాభాలు గడిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్ ధర నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ అయి.. ధరలు తగ్గేలా ఎంత మాత్రమూ కృషి చేయడం లేదన్నారు. # ‘అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా’ అని కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రాష్ట్రానికి లభించే సాయం అరకొరేనన్నారు. ఇలాంటి అసంబద్ధ ఒప్పందాలన్నీ ఈఆర్సీకి చూపి 2014-15 సంవత్సరానికి రూ.1200 కోట్ల మేరకు చార్జీలు పెంచడానికి అనుమతి కోరడం, 2015-16లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలపై ఆ భారం మోపడం అన్యాయమే అవుతుందన్నారు. # జెన్కో ఆధీనంలోని థర్మల్, హైడల్, ఐపీపీ(గ్యాస్-బొగ్గు) ద్వారా 51,518 మి.యూ విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అయ్యే విద్యుత్ 58,191 మి.యూ.అని మైసూరా వివరించారు. అంటే విద్యుత్ లభ్యతకు, సరఫరాకు తేడా 6,673 మి. యూ మాత్రమేనన్నారు. డిస్కంలు 2013-14 విద్యుత్ వాడకాన్ని పోలిస్తే 2014-15, 2016 సంవత్సరాలకు వినియోగం కాగల విద్యుత్ అంచనాలను సంస్థలు ఎక్కువ చేసి చూపాయన్నారు. # 2014-15లో తొలి 6 నెలల విద్యుత్ వాడకాన్ని చూపకుండా రెండో 6 నెలలకు అంచనాలను చూపారన్నారు. పారిశ్రామిక రంగంలో 33 శాతం, సాధారణ రంగంలో6 శాతం వినియోగం పెరుగుదల ఉంటుందనడం, తేడాను ఎక్కువ చేసి చెప్పడం.. అంకెల గారడీ తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో అసలు పరిశ్రమలే అంతగా లేనపుడు వినియోగంలో ఇంత వృద్ధి ఎలా ఉంటుందన్నారు. ఈ అంకెలగారడీ వల్ల 6,673 మి.యుల వినియోగంలో తేడా చూపుతూ దానికంటే అదనంగా 11,159 మి.యుల విద్యుత్ కావాలని చెబుతున్నారన్నారు. ఈ విద్యుత్‌ను తక్కువ ధరకు కొంటే ఫర్వాలేదు గానీ, ఎక్కువ ధరలకు కొనడం ఆమోదయోగ్యం కాదన్నారు. # ఒప్పందం కుదుర్చుకున్న విధంగా విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతే రూ.600 కోట్లు జరిమానా కట్టాలని చెప్పి ఆ నష్టాన్ని కూడా ప్రజల నెత్తిన రుద్దడం బరితెగించడమేనని మైసూరా విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
పట్టిసీమ నిరర్థక ప్రాజెక్టు
* కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే రూ.1,300 కోట్లు * పోలవరం ఉండగా పట్టిసీమతో పనేంటి?: మైసూరా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, నేతలు తమ జేబులు నింపుకోవడానికే ఆగమేఘాలమీద పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1,300 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ హోదా పొందిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉండగా పట్టిసీమ ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంకల్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, షేక్ బేపారి అంజాద్ బాష, కళత్తూరు నారాయణస్వామితో కలసి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా నిర్మిస్తామని ప్రకటించడం, ముఖ్యమంత్రితోసహా మంత్రులు, టీడీపీ నేతలంతా ఇదేమాట చెప్పడం సం తోషదాయకమన్నారు. అయితే మళ్లీ పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారం ప్రాంతీయ విభేదాలకు బీజాలు నాటేలా ఉందన్నారు. ‘‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్), ఇతర అనుమతులు, టెండర్లు పిలవడం వంటి ప్రక్రియ ముగిసి, నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం రెండున్నర నుంచి మూడేళ్ల వ్యవధి పడుతుంది. నాలుగేళ్లలో పోల వరం పూర్తవుతుందని అధికారపక్షం గట్టిగా చెబుతున్నపుడు ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు? ఒక్క ఏడాదికోసం రూ.1,300 కోట్లు వృథా చేయడం ఎందుకు?’’అని మైసూరా ప్రశ్నించారు. ఉద్యోగుల జీతభత్యాలకోసం ఓవర్‌డ్రాఫ్టు కోసం రిజర్వుబ్యాంకు వద్దకు వెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని వందల కోట్లు ఖర్చు చేయడం భావ్యమా అని నిల దీశారు. పోలవరం నిర్మాణం పూర్తయ్యాక పట్టిసీమ ఓ నిరర్థకమైన ప్రాజెక్టుగా మిగిలిపోతుందన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఒకేసారి వరద నీరు వస్తోందని, అలాం టపుడు ఒకచోటి నుంచి మరోచోటికి నీరు తీసుకునే అవకాశం ఉండదు కనుక ఇది నిరర్థక ప్రాజెక్టుగానే మిగిలిపోతుందని అన్నారు. అఖిలప్రియ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకమైనా, రాజధాని నిర్మాణమైనా రైతులనుంచి పంట పొలాలను ప్రభుత్వం లాక్కుంటున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎగ్గొట్టేందుకే .. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో గట్టిగా డిమాండ్ చేసి, తాము అధికారంలోకొచ్చాక పదేళ్లపాటు ఆ హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తానిచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మైసూరారెడ్డి కోరారు. ప్రత్యేక హోదా లేనట్లేనని సీఎం చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో మంత్రులతో చెప్పడాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే ఈ నాటకాలన్నీ’ అని మైసూరా అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కడంవల్ల ప్రత్యేక హోదా రాకుండా నీరుగారిపోతోందన్నారు. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'
హైదరాబాద్: భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. కర్నూలు ఎస్పీకి కనీస విచక్షణ లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎమ్మెల్యేపై రౌడీషీట్ తెరుస్తారా అని నిలదీశారు. ఏ సందర్భంలో రౌడీషీట్ తెరుస్తారో చదువుకున్నారా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు. -
కమిటీ సీఎంను కలిస్తే చాలా?
శివరామకృష్ణన్ కమిటీపై వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్థిరాస్తి వ్యాపారులు, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మలా మారిందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. మైసూరా శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన అంతా గోప్యంగా ఉందని, అసలు అంత రహస్యంగా వారి కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక చంద్రబాబునాయుడును కమిటీ సభ్యులు కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో తప్పులేదని, అయితే రాష్ట్రంలో ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలను ఎందుకు విస్మరించారు? వారిని ఎందుకు కలవ లేదు? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది? ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు? అనే విషయాలతోపాటు ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన శివరామకృష్ణన్ కమిటీ తూతూమంత్రంగా వ్యవహారం నడుపుతోందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతం ఎంపిక కోసం పార్లమెంట్ సూచించిన షరతులను పట్టించుకోకుండా రియల్టర్లు, సిండికేట్ల చేతిలో కమిటీ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందరి అభిప్రాయాలను తీసుకోకుంటే కమిటీ వారి ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటవుతున్నట్లు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారని చెప్పారు. ఫలితంగా అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని అంటుతున్నాయని లక్షల్లో ఉన్న పొలాల ధరలు రూ.కోట్లకు పెరిగాయన్నారు. -
'రాజధాని కోసం ప్రైవేట్ భూములు కొనొద్దు'
కడప: నూతన అంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల కొనుగోలు సరికాదని వైఎస్ఆర్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని సూచించారు. శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రుల ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి ఒక్క అడుగు ముందుకు కదల్లేదని మైసూరారెడ్డి విమర్శించారు. -
వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే: మైసూరారెడ్డి
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. ప్రజలు.. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ-టీడీపీ మధ్య ఓట్లశాతంలో తేడా 4 మాత్రమేనని తెలిపారు. జడ్పీటీసీ-ఎంటీసీ ఎన్నికల్లో ఈ తేడా 2.9 శాతంగా ఉందన్నారు. లోక్‌సభ, శాసనస ఎన్నికల సమయానికి రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడపాటికి సర్వేలతో పనేంటని ప్రశ్నించారు. ఆయన సర్వేలు బెట్టింగ్‌ల కోసమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి 110 నుంచి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపారు. మొత్తం 20 పైగా ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అదో దగాకోరు సర్వే
సీఎన్ఎన్-ఐబీఎన్ ఎన్నికల సర్వేపై మండిపడ్డ మైసూరారెడ్డి హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సీఎన్ఎన్-ఐబీఎన్ టీవీ చానల్ ప్రసారం చేసిన సర్వే ఒక దగాకోరు సర్వే అని, ఏప్రిల్ ఫస్ట్‌న ప్రజలను ఏప్రిల్ ఫూల్స్‌ను చేయడానికే ఆ చానల్ ఇలా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పతనమైపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పైకి లేపడానికి చేసిన ప్రయత్నంగా సీఎన్ఎన్-ఐబీఎన్ ఈ సర్వేను చేసినట్లుగా ఉందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 23 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేవలం 1,300 మంది అభిప్రాయాలను సేకరించి చేసిన సర్వేకు అసలు విలువుంటుందా? ఇది గదుల్లో కూర్చుని చేసిన అంకెల గారడీ మాదిరిగా ఉందని విమర్శించారు. ఆయనేమన్నారంటే... సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ సర్వేలో సీమాంధ్రలో 14 శాతం ఇతర పార్టీలకు వస్తాయని చెప్పింది. అయితే ఆ ఇతర పార్టీలేమిటో కూడా చెప్పాలి కదా? అసలు వీళ్లు ఎన్నికల సర్వే నిర్వహించే సెఫాలజిస్టులేనా? రాష్ట్రంపై వీరికి అవగాహన ఉందా? వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ కాక ఇతర పార్టీలంటే లోక్‌సత్తా, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ. గత ఎన్నికల్లో లోక్‌సత్తాకు 1.2, ఉభయ కమ్యూనిస్టులకు 4.4 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అలాంటిది 14శాతం ఇతర పార్టీలకు వస్తాయని అంచనా వేయడం మోసపూరితం కాక మరేమిటి? ఇదే చానల్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్‌కు 45 శాతం, టీడీపీకి 33 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనాలు వేసి, లోక్‌సభ సీట్లు వస్తాయనే విషయానికి వచ్చేటప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 నుంచి 17, టీడీపీకి 10 నుంచి 16 సీట్లు వస్తాయని చెప్పింది. సాధారణంగా 1 లేదా 2 శాతం ఓట్లు అధిక శాతం వచ్చే పార్టీకే భారీ విజయాలు ఎన్నికల్లో లభిస్తాయి. అలాంటిది సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ అంచనా ప్రకారమే టీడీపీ కన్నా 12 శాతం ఓట్లు అధికంగా పొందే వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం తక్కువ సీట్లు వస్తాయా? ఇదెక్కడి విశ్లేషణ? వీళ్లేం సర్వేల నిర్వాహకులు? సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడు సంస్థల్లో పెట్టుబడులు ఒకరివే , వారికి చంద్రబాబుతో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవే. పతనస్థాయిలో ఉన్న చంద్రబాబును పెకైత్తడానికి ఈ సర్వే చేసినట్లుగా ఉంది. ఈ సర్వేపై మంగళవారం రాత్రి చానల్లో చర్చ సందర్భంగా పాల్గొన్న ప్యానలిస్టులు హిందూ ఎడిటర్ (రూరల్ అఫైర్స్) పాలగుమ్మి సాయినాథ్, ప్రధానమంత్రి మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారులు ఈ సర్వేను తప్పులతడక అని చెప్పారు. సీమాంధ్రలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఈ సర్వే అద్దం పట్టడం లేదని దుమ్మెత్తి పోశారు. -
రెండోరోజూ ‘టీ’ రగడ
* లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం * సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు * ఉభయ సభలూ నేటికి వాయిదా * తెలంగాణపై చర్చ కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం * అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన మోదుగుల, సబ్బం * సభ అదుపులో లేకపోవడంతో పరిశీలించలేకపోతున్నానన్న స్పీకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఇతర అంశాలపై వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు వారుుదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వారుుదా పడ్డారుు. - గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. - పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలంటూ సభలో వాయిదా తీర్మానం కూడా పార్టీ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సబ్బం హరి, టీడీపీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. -ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ఎంపీలు సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. - సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లోకి వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు సాయిప్రతాప్, ఎం.వేణుగోపాల్‌రెడ్డిలు కూడా వెల్‌లోకి వచ్చారు. - తెలంగాణ ఎంపీలు విభజన బిల్లును వెంటనే సభ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడు జాలర్లపై శ్రీలంక వేధింపులకు నిరసనగా డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. అకాలీదళ్ సభ్యులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను లేవనెత్తారు. - ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి అంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే లోక్‌సభ వారుుదా పడింది. - మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ‘ఇది చివరి సమావేశం.. సభను శాంతియుతంగా సాగనివ్వండి..’ అంటూ స్పీకర్ కోరారు. సభ్యుల నినాదాల మధ్యే కొద్దిసేపు సభా కార్యక్రమాలను కొనసాగించారు. - 12.16కు అవిశ్వాస తీర్మానం నోటీసులపై మీరాకుమార్ ప్రకటన చేశారు. ‘ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ సభ అదుపులో లేదు.. అందువల్ల ఈ తీర్మానాలను పరిశీలించలేక పోతున్నాను’ అని చెప్పారు. కొద్దిసేపటికే లోక్‌సభ శుక్రవారానికి వారుుదా పడింది. - సభ అదుపులో లేనప్పటికీ కేంద్రం పలు నివేదికలను ప్రవేశపెట్టింది. మొత్తంగా రెండోరోజు లోక్‌సభ కేవలం 15 నిమిషాల పాటే కొనసాగింది. జేడీయూ ఎంపీలతో వైఎస్సార్సీపీ చర్చలు లోక్‌సభ వాయిదా అనంతరం జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డిలతో పాటు మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు రాజ్యసభలో జేడీయూ సభానాయకుడు శివానంద్ తివారీ, ఎంపీ ఎంకే సింగ్‌లతో పార్లమెంట్ సెంట్రల్హాల్లో భేటీ అయ్యారు. వారితో విభజన బిల్లుపై చర్చించిన నేతలు బిల్లును అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. శాసనసభ బిల్లును తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేసిన జగన్.. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని వారికి వివరించారు. రెండు ప్రాంతాలకూ శుభవార్త: జేడీ శీలం ‘నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు. తెలుగువారికి న్యాయం చేస్తుంది. తెలంగాణ వారికి శుభవార్త, సీమాంధ్ర వారికి కూడా శుభవార్త ఉంటుంది..’ అని కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు. కిరణ్ చరిత్రకు త్వరలో ముగింపు: పొన్నం ‘టీ బిల్లును ఆపాలన్న ఆలోచన పొరపాటు. ముఖ్యమంత్రి కిరణ్ చరిత్ర త్వరలో ముగుస్తుంది. తెలుగువాడి పరువు ప్రతిష్టలను ఢిల్లీలో మంటగలిపారు..’ అని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కమల్‌నాథ్ కాంగ్రెస్ ఎంపీలను రెచ్చగొట్టారు లోక్‌సభలో గురువారం తాము అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సభలో గందరగోళం సృష్టించడానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలను రెచ్చగొట్టారని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసానికి 71 మంది ఎంపీల మద్దతు కూడా ఉందని, అవిశ్వాసానికి అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలేదని వారు పేర్కొన్నారు. ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలోనూ గందరగోళం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో మూడు నిమిషాలకే వాయిదాపడింది. సమైక్యాంధ్ర నినాదాల మధ్య తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగా.. మళ్లీ గందరగోళం నెలకొంది. ఆరు నిమిషాల తరువాత సభాపతి మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రారంభమైన ఒక నిమిషానికే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏఐడీఎంకే, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. వివిధ అంశాలపై ఎస్పీ, వామపక్షాలు, అకాలీదళ్ సభ్యులు నిరసన వ్యక్తం చేసినా గందరగోళంలో ఏమీ విన్పించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతో పాటు పలు కుంభకోణాలను బీజేపీ సభ్యులు లేవనెత్తారు. సభలో గందరగోళంపై అసహనంగా కన్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సీట్లో నుంచి లేచి పక్కకు వెళ్లారు. ఆందోళన చేస్తున్న సభ్యులకు ఏవో సైగలు చేస్తూ, ఎద్దేవా చేస్తున్నట్టుగా కన్పించారు. -
పోలింగ్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దూరం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడం లేదు. రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంతటి సంఖ్యాబలం తమకు లేదు కనుక తమ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఫిబ్రవరి 23వ తేదీన పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి ప్రకటించిన విషయం విదితమే! పోలింగ్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. -
అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోలేదు: మైసూరారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి స్పష్టీకరణ పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే 7 రోజులు అవిశ్వాస నోటీసులిచ్చాం.. ‘లోక్‌పాల్’పై చర్చ నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే వారుుదా వేయమని కోరాం ఆ తర్వాత లోక్‌సభను అర్ధంతరంగా ముగించారు సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుందంటూ టీడీ పీ అసత్య ప్రచారం చేస్తూ దగుల్బాజీ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లుపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో తామిచ్చిన అవిశ్వాస నోటీసులను ఒక రోజు వాయిదా వేయమని మాత్రమే కోరాం తప్ప ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు. అబద్ధాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఈ విషయంలో వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదులు, టీడీపీతో కలసి లోక్‌సభ మొదటిరోజునే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విచిత్రమేమిటంటే.. అందులో రాష్ట్రాన్ని విభజిస్తున్నది ఒక పార్టీ అయితే, అందుకు సహకారంగా లేఖ ఇచ్చింది మరోపార్టీ. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఈ ప్రక్రియను ఆపాల్సిన ఆ పార్టీ ఎంపీలు ఆ పని చేయకుండా అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. వారు ఏ ఉద్దేశంతో ఇచ్చినా యావత్ దేశానికి పరిస్థితిని వేలెత్తి చూపించడం కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న పార్టీగా మేం కూడా మద్దతిచ్చాం. పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే అందులో 7 రోజుల పాటు అవిశ్వాస నోటీసులు ఇచ్చాం. దేశ ప్రజలు ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు సభలో చర్చకు వచ్చినందున సదుద్దేశంతో ఆ ఒక్క రోజు నోటీసును మరుసటి రోజుకు వాయిదా వేయమని కోరాము తప్ప ఉపసంహరించుకోలేదు. అయితే లోక్‌పాల్ బిల్లు పూర్తికాగానే సభను అర్ధంతరంగా ముగించారు. ఆ రోజే లోక్‌సభకు చివరిరోజున్న విషయం సభలో ఎవరికీ తెలియదు..’’ అని స్పష్టం చేశారు. మద్దతు కూడగడితే.. పక్కదారిపట్టించారు! ‘‘మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి అన్ని ప్రాంతీయ పార్టీలనూ కలసి రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని చెప్పి ఒప్పించారు. వారంతా సభలో వాయిదా తీర్మానం ఇస్తే మద్దతిస్తామని హామీ ఇచ్చారు కూడా. కానీ టీడీపీ, కాంగ్రెస్‌కు సంబంధించిన సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం ద్వారా.. ప్రస్తుత పరిస్థితి అవిశ్వాసానికి అనువైన సమయం కాదంటూ ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపకుండా వెనక్కి తగ్గేందుకు కారణమయ్యారు. అయినప్పటికీ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కేంద్రం చేస్తున్నది అధికార దుర్వినియోగమని ఎత్తి చూపించడం కోసం, వాళ్ల ఎంపీలే అవిశ్వాసం నోటీసిచ్చినా మేము మద్దతు ఇచ్చాం..’’ అని మైసూరా తెలిపారు. అవిశ్వాసం వీగిపోతుందనే పాట్నా వెళ్లలేదు ‘‘బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలిసేందుకు తమకు కేటాయించిన సమయం ప్రకారం అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన రోజున మాకు విపత్కర పరిస్థితి ఎదురైంది. ఒక వేళ పాట్నా వెళ్లిన సమయంలో సభలో అవిశ్వాసం ప్రస్తావన వస్తే సరైన బలం లేక వీగిపోతే రాష్ట్రం పరువు పోతుందని ఆ కార్యక్రమం రద్దు చేసుకున్నాం. అవిశ్వాసం ఇచ్చిన ఎంపీలు దానిపై చర్చకు కావాల్సిన కనీసం 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టలేకపోయారు. నోటీసులిచ్చిన సభ్యులు మీ స్థానాల్లో నిలబడితే లెక్కించి.. 50 మంది ఉంటే అనుమతిస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారు..’’ అని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీలో పారిపోరుుంది టీడీపీ కాదా? ‘‘విభజనకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది క్రితం అసెంబ్లీలో అన్ని పార్టీలు కలసి అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా పారిపోయి, పరోక్షంగా ప్రభుత్వం నిలవడానికి కారణమైంది టీడీపీ కాదా? సిగ్గులేని వ్యవహారాలు నెరపడం టీడీపీ నేతలకే చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూడా రాష్ట్ర విభజన కావాలని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు మాట్లాడుతున్నా.. బాబు మౌనంగా కూర్చుండిపోవడం ఎంత సిగ్గుచేటు వ్యవహారం?. పార్టీకి ఒక లైను, సిద్ధాంతమంటూ లేకుండా లేనిపోని ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకే తగును’’అని అన్నారు. -
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం
* చర్చలో పాల్గొనం వైఎస్సార్సీపీ * జగన్‌తో పార్టీ ముఖ్యనేతల భేటీ * అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ * ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటేస్తామన్న భూమన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి ఉద్దేశించిన విభజన బిల్లుపై శాసనసభలో జరిగే చర్చలో తాము పాల్గొనబోమని, అయితే రాష్ట్రపతి సూచనల ప్రకారం బిల్లుపై తమ అభిప్రాయాలను మాత్రం మళ్లీ కచ్చితంగా చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ బిల్లుపై ఓటింగ్ జరిపితే అందులో తమ ఎమ్మెల్యేలందరూ పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశామని, విభజనకు వ్యతిరేకంగా మళ్లీ అవే అభిప్రాయాలను వెల్లడిస్తామే కానీ చర్చలో పాల్గొనబోమని విస్పష్టంగా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎంవి మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు సహా పలువురు ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమై శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి పార్టీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ సమక్షంలో సభలో జరిగే చర్చలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పారు. సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్, రాష్ట్రాన్ని విభ జించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయి విభజన బిల్లుపై చర్చ సజావుగా పూర్తి చేసి కేంద్రానికి పంపడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కోర్ కమిటీలోనూ, ఆ తరువాత సీడబ్ల్యూసీలోనూ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నపుడు భాగస్వామిగా ఉన్న సీఎం అప్పుడు గంగిరెద్దులా తలూపి వచ్చారని, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు భయపడి పది రోజుల తరువాత బయటకు వచ్చి తాను విభజనకు వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కి పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని మాట్లాడి ఆ ఉద్యమంపై కిరణ్ నీళ్లు చల్లారన్నారు. తీర్మానం ద్వారా బిల్లును ఓడిద్దామని, రకరకాలుగా ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. చివరకు విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకే సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ఉద్దేశ్యపూర్వకంగా సభకు రాకుండా, బీఏసీ సమావేశాలకు గైర్హాజరవుతూ బయట మాత్రం సమైక్యవాదినని పత్రికల్లో రాయించుకున్నారని ఆరోపించారు. ఇక బాబు 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేఖ నివ్వడంతో పాటుగా 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో జరిగిన సమావేశంలో కూడా విభజనకు అనుకూలమని స్పష్టంగా చెప్పారని భూమన గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా షిండేతో జరిగిన సమావేశంలో సైతం రాష్ట్రాన్ని త్వరగా విడగొట్టాలని చెప్పారని, అయితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాక ఇపుడు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లుపై తమ పార్టీ వంద శాతం అభిప్రాయాలు వ్యక్తీకరిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 11న ఏకాదశి నాడు తిరుమలలో విచ్చలవిడిగా వీఐపీ పాసుల జారీపై ప్రశ్నించినందుకు సామాన్య భక్తులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు.. జాతీయ పార్టీల మద్దతు కూడగడతాం: మైసూరారెడ్డి
* వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ఉద్ఘాటన * మద్దతు కూడగట్టేందుకు జగన్‌తోపాటు ఢిల్లీకి ఐదుగురు నేతల ప్రతినిధి బృందం * నేడు సీపీఎం, సీపీఐలతో, రేపు బీజేపీతో భేటీ * కోర్టు అనుమతి లభిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటన * ఆర్టికల్ 3ను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విభజన విషయంలో ఎలాంటి విధానం పాటించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యకు నిరసనగా, సమైక్య రాష్ట్రానికి జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. ఈ బృందం శనివారం సీపీఎం, సీపీఐలతోను, ఆదివారం బీజేపీ నేతలతోను భేటీ అవుతున్నట్లు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు కోర్టు అనుమతి లభిస్తే ఇతర రాష్ట్రాల రాజధానులకు కూడా వెళ్లి వారి మద్దతు కూడగడతామని, ఆలోపు ఢిల్లీలో ఉన్న పార్టీల నేతలందరినీ కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన పరిస్థితి భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చే ప్రమాదముందని ఢిల్లీ పర్యటనలో జాతీయ పార్టీలకు నచ్చచెబుతామన్నారు. ఆర్టికల్ 3 సవరణ దిశగా పోరాడాల్సిందిగా అన్ని పార్టీలకు విన్నవిస్తామన్నారు. ఈ పర్యటనలో జగన్‌తోపాటు తాను, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, వి.బాలశౌరి, గట్టు రామచంద్రరావు పాల్గొంటారని తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విభజిస్తున్నారు? విభజనకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల నుంచి కేంద్రం వద్ద విజ్ఞప్తులు ఉన్నాయని మైసూరా చెప్పారు. ఉత్తరప్రదేశ్, విదర్భలు అయితే ఏకంగా అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపించినప్పటికీ వాటినేవీ పట్టించుకోకుండా కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్నే విభజిస్తామంటూ ఆగమేఘాల మీద కసరత్తు చేయడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఆయా రాష్ట్రాల్లో వారు బలహీనంగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా అడ్డగోలు విభజనను అనుసరించే ప్రమాదముందన్నారు. ఇదే విషయాన్ని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు వివరిస్తామన్నారు. ప్రజాస్వామ్యంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని కాంగ్రెస్ పార్టీని కలిసేదిలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. దేశ సమగ్రత కోసం ఆర్టికల్ 3ను పెడితే.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగమవుతోందని మైసూరా విమర్శించారు. దానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 3కు ఉన్న ప్రాధాన్యతను మైసూరా వివరించారు. ‘దేశంలో అప్పట్లో సంస్థానాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రాలు ఉండేవి. అందుకే దేశం సమగ్రంగా ఉండాలని ఆర్టికల్ 3ను రూపొందించారు. ఎస్సార్సీ వేసిన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అందులో భాగంగానే మన రాష్ట్రం ఏర్పడింది. ఇటువంటి నేపథ్యం ఉన్న వాటిని కేంద్రం తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే దేశ సమగ్రతకే భంగం వాటిల్లే ప్రమాదముంది’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా వైఎస్ జగన్ నేతృత్వంలో జాతీయ పార్టీలను కలిసి మద్దతు కూడగట్టనున్నట్లు వివరించారు. -
ఏకపక్షం.. నిరంకుశం
* రాష్ట్ర విభజన నిర్ణయంపై జీవోఎం ముందు వైఎస్సార్ సీపీ స్పష్టీకరణ * సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలి * సరైన హేతుబద్ధత, ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విడదీయడం సమంజసం కానేకాదు * జగన్ రాసిన 8 పేజీల లేఖను జీవోఎంకు అందజేసిన మైసూరా * మైసూరాతోపాటు జీవోఎం సభ్యులతో భేటీ అయిన గట్టు * ఓట్ల కోసమో, సీట్ల కోసమో విభజన దురదృష్టకరమన్నాం: మైసూరా * నదీ జలాల సమస్యను, అన్నిటికీ కార్యక్షేత్రమైన హైదరాబాద్ గురించి వివరించాం * ఏదైనా బిల్లు తెచ్చి సోనియాను దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారని అడిగాం * మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు * కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది సాక్షి, న్యూఢిల్లీ: ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సుస్పష్టంగా చెప్పింది. సరైన హేతుబద్ధత, గట్టి ప్రాతిపదిక లేకుండా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం, సమర్థనీయం కానే కాదని తెలిపింది. సమైక్యాంధ్రప్రదేశ్ అనే తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. జీవోఎం ఆహ్వానం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు బుధవారం ఉదయం హోం శాఖ కార్యాలయంలో జీవోఎం సభ్యులతో భేటీ అయ్యారు. విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్, కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన ఎనిమిది పేజీల లేఖను మైసూరా వారికి అందజేశారు. జీవోఎం సభ్యుల్లో ముగ్గురు మాత్రమే.. సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్, వీరప్పమొయిలీ పాల్గొన్న ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. వీరు కూడా మైసూరా బృందం చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు తప్ప ఏమీ మాట్లాడలేదని తెలిసింది. చివర్లో షిండే మాత్రం ‘మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జీవోఎంతో భేటీ అనంతరం మైసూరా విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీ, ప్రభుత్వం మధ్య ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది. అంతా వాళ్ల సొంతింటి వ్యవహారంలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పార్టీలతో ఈ భేటీలు కూడా కంటితుడుపు చర్య మాత్రమే. వాళ్లు చేయదల్చుకున్నదేదో చేస్తూ ఏదో రికార్డు కోసం ఇదంతా సాగిస్తున్నారు. పేరుకు పార్టీలను సంప్రదించినా అవి చెప్పేదేం చేయడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆదేశాల ప్రకారమే వారు నడుచుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. జీవోఎం స్పందన ఏమిటని అడగ్గా.. ‘‘వాళ్లకు 112 ప్రశ్నలు సంధించాం. వాటికి జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు..’’ అని మైసూరా చెప్పారు. పార్టీ తరఫున జీవోఎం ముందు చేసిన వాదనను ఆయన వివరించారు. నదీ జలాలు చాలా క్లిష్టమైన సమస్య ‘‘కొందరు ప్రత్యేక రాష్ట్రం సోనియాగాంధీ బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు. అదేనా విభజనకు మీ ప్రాతిపదిక? దేశంలో మరెన్నో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకంత స్పీడ్‌గా వెళుతున్నారు? విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ఆలోచించడం లేదు. 70 శాతం మంది ప్రజల అభిప్రాయాలను మీరు గుర్తించడం లేదు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నదీజలాలు చాలా క్లిష్టమైన సమస్య. ఇప్పటికే ఎన్నో ట్రిబ్యునళ్లు ఉన్నాయి. ఆ ట్రిబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను ఏ రాష్ట్రమూ పాటించడం లేదు, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే మీరేం చేయగలిగారు?’’ అని అడిగినట్లు మైసూరా తెలిపారు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి ‘‘ సోనియాగాంధీ మనదేశ పౌరసత్వం తీసుకుని 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు ఏదైనా బిల్లు తెచ్చి ఈ పౌరసత్వం చెల్లదని.. దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారు? అలాగే 60 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత సెంటిమెంట్‌గా ఫీలవుతారో.. ఎంత బాధ పడతారో మీరు అర్థం చేసుకుంటున్నారా?’’ అని లేఖలో ప్రశ్నించినట్టు చెప్పారు. జీవోఎంకు నిర్దేశించిన 11 విధివిధానాలపై తమ అభిప్రాయాల్ని అడగలేదని, తాము సమైక్యంగా ఉండాలని చెప్తున్నం దున వాటిపై అభిప్రాయం అడిగేదేముంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. జగన్ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తారు అధికారంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటే అది దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ.. దేశ ప్రయోజనాల కోసం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణార్థం విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలనూ కలుస్తారని మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని కూడగడతారన్నారు. విభజనపై తమ నిరసనలు, పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటివరకు అధికార పార్టీ ఇష్టానుసారం చేసింది. ఇకమీదట కుదరదు. మేమైతే బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడతాం’’ అని చెప్పారు. హైదరాబాద్ విషయంలోనూ కేంద్రం ఆలోచన సరికాదని, శాంతిభద్రతలు, రెవెన్యూ తదితర అంశాలను గవర్నర్‌కి ఇవ్వడమో లేదా కేంద్రం చేతిలోకి తీసుకోవడమో సబబు కాదని, ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను ఈ తరహాలో ఆక్రమించడం సమర్థనీయం కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అప్పుడు, ఇప్పుడు సమైక్యమే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న మాటను లోగడ ఎందుకు కేంద్రానికి చెప్పలేదన్న ప్రశ్నకు మైసూరా స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని మాపై పెత్తనం చేయొద్దు. మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీ ఆలోచన ఉండాలని మేం చెప్పాం. ఆ రోజున మేం చెప్పినదాని అర్థం విభజన చేయాలని కాదు. సమస్యను పరిష్కరించలేరు కనుక యథాతథంగా ఉంచాలని అర్థం స్ఫురించేలా మేం మా వైఖరి చెప్పాం. దానికి మీరు వక్రభాష్యం చెప్పడం సరికాదు. మేం ఆ రోజున చెప్పింది సమైక్యమే.. ఇప్పుడు చెప్తున్నదీ సమైక్యమే’’ అని స్పష్టం చేశారు. నేరుగా సమైక్యమని అప్పుడు ఎందుకు చెప్పలేదని అడగ్గా.. ‘‘అప్పటి పరిస్థితుల్లో వారు అడిగినదానికి మేం అది చెప్పాం. ఇప్పుడు విభజిస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే విభజన వద్దు, సమైక్యంగా ఉంచండని కోరుతున్నాం.. ఇందులో డొంక తిరుగుడు ఏం లేదు.’’ అని ఆయన వివరించారు. ‘‘సెంటిమెంట్ వేరు, అభివృద్ధి వేరు. విభజిస్తే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగదని, నష్టపోతారని మేం చెప్తున్నాం. సెంటిమెంట్‌ని గౌరవించడం వేరు, విభజన వేరు. విభజన అనేది పరిష్కారం కాదు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అనేది మా పార్టీ అభిప్రాయం’’ అని కొన్ని ప్రశ్నలకు జవాబుగా మైసూరా చెప్పారు. సమైక్యంగా ఉంటే అభివృద్ధి జరిగే పరిస్థితి తప్పకుండా ఉందన్నారు. తెలుగుజాతికి పట్టిన తెగుళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లు: గట్టు విభజన పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలుగు ప్రజలను హింసిస్తున్నాయని గట్టు అన్నారు. ఆ రెండు పార్టీలు తెలుగు జాతికి పట్టిన తెగుళ్లుగా ఆయన అభివర్ణించారు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. తెలంగాణపై ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ కార్యాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించాలని సూచించారు. వెనుకబాటుతనానికి విభజన ఏమాత్రం పరిష్కారం కాదని అన్నారు. సమర్థ పరిపాలన, అభివృద్ధి ద్వారా వెనుకబాటుతనాన్ని అధిగమించవచ్చని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు విభజనను కోరుకోవడం లేదన్నారు. -
ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ 8,067 ఈ-మెయిళ్లను ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రుల బృందానికి(జీవోఎం) పంపామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు 8,067 గ్రామపంచాయతీలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాయని తెలిపారు. మైసూరా మాట్లాడుతూ.. సమైక్య తీర్మానాలు చేసిన గ్రామాలు ఇంకా ఎక్కువే ఉన్నాయని, ఈ-మెయిల్ చేయడానికి సౌకర్యం లేనందున తమకు పూర్తి సమాచారం రాలేదని చెప్పారు. ఈ నెల 7న జీవోఎం సమావేశమవుతున్నందుకు నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును ఆయన మరోసారి గుర్తు చేశారు. కేంద్రానికి ఈ-మెయిళ్లు పంపడం వల్ల ప్రయోజనముంటుందా? అని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రభుత్వమైతే తప్పక స్పందిస్తుందని మైసూరా వివరించారు. ప్రభుత్వమే ప్రేరేపించింది నల్లగొండ జిల్లాలో వరద బాధితులను పరామర్శించకుండా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ప్రతిఘటించడం వెనుక రాష్ట్రప్రభుత్వమే ఉందని, మంత్రులు ప్రేరేపించడంతోనే ఇలా జరిగిందని కొణతాల దుయ్యబట్టారు. మంత్రులుగా ఉన్నవారే అడ్డుకోవాలని పిలుపునివ్వడం చాలా తప్పని, ఆ నియోజకవర్గాల్లో వారి పలుకుబడి క్షీణిస్తుంటే మాత్రం ఇలా చేయాలా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ వరద ప్రాంతాలను సందర్శించి రాజకీయాలు మాట్లాడారు కానీ విజయమ్మ తన పర్యటనలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, అయినా ప్రభుత్వమే కావాలని అడ్డుకుందని కొణతాల విమర్శించారు. చంద్రబాబుకు మాత్రం పోలీసులు, మంత్రులే ఘనస్వాగతం పలికారన్నారు. ఖమ్మంలో విజయమ్మ పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగిందని, అందుకే నల్లగొండలో కావాలని అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి అడ్డంకులవల్ల తమ పర్యటనలు ఆగవని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన దృఢంగా పేర్కొన్నారు. -
ముమ్మాటికీ సమైక్యమే
విభజన కోసమే మంత్రుల బృందం... జీవోఎంను మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర హోంశాఖకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ లేఖను విడుదల చేసిన కొణతాల, మైసూరారెడ్డి సమైక్యాంధ్రను కోరుకునేవారంతా జీవోఎంను గుర్తించకుండా వ్యతిరేకించాలని పిలుపు సీఎం, చంద్రబాబు, సీమాంధ్ర మంత్రులు లోపాయికారీగా విభజనకే సహకరిస్తున్నారు బాబు చెప్పినందుకే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన జగన్ సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారందరూ జీవోఎంను గుర్తించకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జీవోఎంను వ్యతిరేకించడంతో పాటు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాసిన లేఖను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా 2013 అక్టోబర్ 30వ తేదీన హోంశాఖ నుంచి వచ్చిన లేఖకు సమాధానంగా జగన్ ఈ లేఖ రాశారని నేతలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ తొలి నుంచీ కోరుతోందని, కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేయడం, సలహాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం అనేది విభజన ప్రక్రియలో మరో ముందడుగుగా తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. అందుకే జీవోఎంను తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు సహా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులందరూ పైకి ఒక రకంగా మాట్లాడుతూ లోపాయికారీగా విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్, బాబు.. ఇద్దరూ సోనియాగాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ విభజనకు దోహదపడుతున్నారన్నారు. విభజన విషయంలో అఖిలపక్షం వేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారని, ఆయన మాట మేరకు కేంద్రం ఇప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేయ సంకల్పించిందని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కిరణ్ ఇదే ఆఖరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవుతుందేమోనని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం సాగిస్తామని ఓవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని కొణతాల, మైసూరారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? అన్న ఒక ప్రశ్నకు.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఈ విధంగా ఉంది... అయ్యా, ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై మా పార్టీ సలహాలు, సూచనలు కోరుతూ 2013 అక్టోబర్ 30వ తేదీన మీరు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకించాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. అందువల్ల రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా మా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3వ తేదీన తీసుకున్న నిర్ణయం మాకు ఏమాత్రం సమ్మతం కాదు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు గత మూడు నెలలుగా విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రోడ్లపై ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాస్తవాన్ని విస్మరించి విభజన అనే దారుణమైన అన్యాయానికి ఒడిగట్టడానికే సిద్ధమై ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది కూడా రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతోనే కనుక దానిని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. కృతజ్ఞతలతో... మీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్‌కు నేడు రాష్ట్రపతి అపాయింట్మెంట్! వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. ప్రణబ్ సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న విషయం విదితమే. హైదరాబాద్‌లో కలవడానికి తమకు సమయం కేటాయించాల్సిందిగా జగన్ ఇటీవల ఒక లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్న రాష్ట్రపతిని 9 గంటల తరువాత కలుసుకోవాల్సిందిగా ఆయన కార్యాలయ సిబ్బంది వర్తమానం పంపినట్లు తెలిసింది. -
సోనియా డెరైక్షన్.. బాబు యాక్షన్: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆడిస్తున్న నాటకంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రధారులని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్ర విభజనకు బీజం పడిందని బుధవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి చేతిలో అసెంబ్లీ తీర్మానం అనే బ్రహ్మాస్త్రం ఉన్నప్పటికీ ఆయన దాన్ని వాడటం లేదని విమర్శించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య రాష్ట్రం కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామన్న వైఎస్సార్సీపీ ప్రతిపాదనను ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యపై ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిన విషయాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం రాష్ట్రాన్ని బలిచేయబోతున్నారన్న విషయం వెల్లడయ్యాక.. ‘ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలిగితే చేయండి లేకపోతే సమైక్యంగా ఉంచండి’ అని మొట్టమొదట కోరింది వైఎస్సార్సీపీనే అని మైసూరా తెలిపారు. ఆ రెండు పార్టీల ఎజెండా సమన్యాయమే! ‘తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఆమోదం లభించిన రోజే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఢిల్లీలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. వారిద్దరూ కలిసి రూపొందించిన పథకంలో భాగంగానే నాల్గవ తేదీన చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ దీక్ష కూడా సమైక్యం కోసం కాదు. విభజన పట్ల జాతీయ మీడియా పదే పదే ప్రశ్నించినా దాటవేశారు. ఇప్పటికీ సమైక్యమని ఒక్క మాటా అనడంలేదు’ అని మైసూరా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘అడ్డుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కేంద్రమంత్రులు ఇప్పుడు విభజన తప్పదు, సమన్యాయం కోసం పోరాడుతామంటున్నారు. టీడీపీ చెబుతున్న సమన్యాయమే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఆ రెండు పార్టీల ఎజెండా ఒక్కటే అని స్పష్టమైంది’ అని విమర్శించారు. సమైక్యమంటూ వారానికో ప్రెస్‌మీట్ పెట్టడం తప్ప ముఖ్యమంత్రి ఏమీ చేయడం లేదని మైసూరా విమర్శించారు. పైగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం ఆడిస్తున్న నాటకాన్ని సీఎం కిరణ్, ఎంపీలు లగడపాటి, ఉండవల్లి ఒకరి తర్వాత ఒకరు రక్తి కట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు బయటపడకుండా ఉండేందుకే తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు. యనమల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని మైసూరా తెలిపారు. జగన్‌కు బెయిల్ నిబంధనలు సడలించవద్దంటూ యనమల చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తే కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అయినా, రాజకీయంగా పోరాడాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్లడంలేదు’ అన్నారు. ‘యనమల ధోరణి చూస్తుంటే ప్రత్యర్థి కాళ్లు కట్టేయండి, కుస్తీ పోటీల్లో పాల్గొంటాను అన్నట్లుంది’ అని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెట్టడం చంద్రబాబు దివాలాకోరు తనానికి నిదర్శనం రాష్ట్రమంతా ఢిల్లీ వైపు చూస్తుంటే ఆయన మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారు మాజీ సీఎంగా బాధ్యతారహితంగా మాట్లాడటం తగదు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. జగన్ ఫోబియా పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెడుతూ విమర్శలు చేయడం చూస్తుంటే చంద్రబాబు దివాలాకోరుతనం స్పష్టంగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే చంద్రబాబు మాత్రం మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తిగా, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన వ్యక్తి, దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌ను సీబీఐ డెరైక్టర్ కలిసిన విషయంపై కూడా అర్థం లేకుండా జగన్‌పై విమర్శలు చేయడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 173 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుంది. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల లోగా చార్జిషీట్ వేయకపోతే కూడా స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి వక్రమార్గాలు పట్టి, చట్టాన్ని వక్రీకరించి, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని సీబీఐ ఇష్ట ప్రకారం దర్యాప్తు చేసినా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోగా సంతోషించారు. సుప్రీంకోర్టు ఒకమారు 4 నెలలు గడువు ఇస్తే.. ఆరు నెలలైనా సీబీఐ చార్జిషీట్ వేయలేదు. మరోసారి నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ వేయమని సుప్రీంకోర్టు కచ్చితంగా ఆదేశించడంతో తుది చార్జీషీట్ వేసింది. దీనిని కూడా చంద్రబాబు తప్పుపట్టడం సరైంది కాదు’’ అని అన్నారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్నట్టు అసత్య ఆరోపణలతో చంద్రబాబు.. జగన్ మీద అభాండాలు వేస్తున్నారన్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచి సంప్రదాయం కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం 10 జన్‌పథ్ పంజరంలో చిలుక.. సున్నితమైన రాష్ట్ర విభజన సమస్యపై కేంద్రం ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని మైసూరా పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ లబ్ధికోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్సును రాహుల్‌గాంధీ చెబితేనే ఉపసంహరించుకోవడం సిగ్గుచేటన్నారు. ఆ ఆర్డినెన్సును వైఎస్సార్ కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. 10 జన్‌పథ్ పంజరంలో చిలుకలా తయారైందని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి కనుసన్నల్లో కేంద్రప్రభుత్వం పనిచేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. -
దిగ్విజయ్‌వి పచ్చి అబద్ధాలు: ఎంవీ మైసూరారెడ్డి
మా పార్టీ అనని మాటలను అన్నట్లు ఎలా అంటారు: మైసూరా మేమెప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదు ఆయన వ్యాఖ్యలు సంస్కార హీనం ఒక తండ్రిలాగా పరిష్కారం చూపమన్నాం అడ్డగోలుగా విభజించమని చెప్పలేదు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విభజన విషయంలో పచ్చిగా అబద్ధాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. విభజన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వైఖరిని దిగ్విజయ్ సింగ్ వక్రీకరించారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాయని దిగ్విజయ్ చెప్పడం పూర్తిగా తప్పని, తమ పార్టీ ఏనాడూ అలాంటి అభిప్రాయం చెప్పలేదని గుర్తుచేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించమని తమ పార్టీ ఏనాడూ చెప్పలేదని స్పష్టంచేశారు. గత ఏడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ఒక్క దానికే తమ పార్టీ తరఫున ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. ఆ సమావేశంలో కూడా షిండేకు తమ పార్టీ ‘బ్లాంక్ చెక్’ ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఆ లేఖ ఇదీ.. ‘అన్ని సమస్యలూ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలాగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం’ అని ఆనాటి అఖిలపక్ష సమావేశంలో షిండేకు లేఖ ఇచ్చిన విషయాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఆ సమావేశంలో అందించిన లేఖలోని అంశాలను మీడియా ముందు ఆయన చదివి వినిపించారు. ఒక సీనియర్ నేత, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో పరిణతి చెందిన వ్యక్తిగా ఉండి దిగ్విజయ్ అవాస్తవాలు ఎలా మాట్లాడతారని మైసూరా ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఆయనకు మానసిక దౌర్బల్యం వచ్చినట్లుంది.. అందుకే తాము చెప్పని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక రాజకీయ పార్టీ అనని మాటలను అన్నట్లు ఎలా చెబుతారు? ఇది సంస్కారహీనమే అవుతుంది.. అని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఇతర పార్టీలపై బురద జల్లడమే కాంగ్రెస్ విధానంగా ఉందని, వాళ్లెపుడూ తమ విధానాన్ని ప్రకటించలేదని అన్నారు. తమ పార్టీ ప్లీనరీలో చెప్పింది, ఇపుడు చెబుతున్నది ఒకటేనన్నారు. ‘మీరు పరిష్కరించలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అన్నదే మా మాట అని.. మేం షిండేకు ఇచ్చిన లేఖలో కూడా ఇదే ఉంది. ఈ లేఖలో మేం ఎక్కడా ‘బ్లాంక్ చెక్’ ఇవ్వలేదే. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇతర పత్రాలు కూడా ఇవ్వలేదు’ అని మైసూరా వివరించారు. -
ఆంటోనీ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదు: ఎంవీ మైసూరారెడ్డి
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి రాష్ట్రాన్ని చీల్చారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేయడంతో ఆంటోనీ సారథ్యంలో వేసిన హైపవర్ కమిటీతో ఒరిగేదేమీ లేదన్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఆదివారం సాయంత్రం దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మైసూరా మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపుల సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. డిగ్గీరాజా నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు కంపుకొడుతోందని విమర్శించారు. సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిందన్నారు. తమిళనాడుకి చెందిన కేంద్ర మంత్రి చిదంబరం మన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. -
మా ప్రశ్నలకు సమాధానమేదీ: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో ముందుకు రావాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు నీటి పంపకాల విషయంలో సమస్యలున్నాయని చెప్పారు. మిగులు, నికర జలాలపై ఇప్పటి దాకా తమ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం నుంచి సమాధానమే లేదన్నారు. ‘‘కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఒకే రాష్ట్రంలో ఉన్నందున ప్రజల అభీష్టం మేరకు అన్ని ప్రాంతాల వారు ఆ నీటిని వాడుకున్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ప్రతి నీటి చుక్కనూ లెక్కకడుతుంది. మిగులు జలాల ఆధారంగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మితమైన నెట్టెంపాటు, కల్వకుర్తి, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్ఎల్బీసీ, పులిచింతల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కూడా ఒక్క చుక్కనీరు అధికారికంగా పంపకాలు జరపలేదు. అలాగే గోదావరి పరీవాహక ప్రాంతంలో కూడా ఈ సమస్య తలెత్తనుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారే కానీ.. నీటి కేటాయింపులు ఎలా చేస్తామనేది ఎందుకు చెప్పలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచన తప్ప.. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని మైసూరా మండిపడ్డారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య నదీ జలాల పంపకాలు, యాభై ఏళ్లుగా అన్ని ప్రాంతాల వారూ ఉమ్మడిగా ఉంటున్న రాజధాని హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేయటం సరికాదని తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ తన సొంత ఇంటి విషయంలా భావి స్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా హైపవర్ కమిటీని ప్రకటించింది. కానీ దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు. అదొక పవర్‌లెస్ కమిటీ.. చెత్త కమిటీ’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లోని అసంతృప్తులను సముదాయించటానికే ఈ పార్టీ కమిటీని వేశారు తప్పితే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఎండగట్టారు. కాంగ్రెస్, టీడీపీల నేతలవి డ్రామాలే... పార్లమెంటులో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు చేస్తున్న ప్రదర్శనలు ఉత్తి డ్రామాగానే పరిగణించాల్సి వస్తోందని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టటానికే రెండు పార్టీల నేతలు ఈ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదని మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు గవర్నర్ దగ్గరకు వెళ్లి చెప్పాలి.. అలా చేస్తే ప్రజలు విశ్వసిస్తారే కానీ.. రాజీనామాలు అంటూ పీసీసీ అధ్యక్షుడికి ఇస్తే నమ్మెదెవరు?’’ అని నిలదీశారు. టీడీపీ నేతల వ్యవహారం కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఉందన్నారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్జీవోలు కలిసినప్పుడు విభజనపై గతంలో నిర్ణయం తీసుకున్నానని.. అందులో మార్పులేదని చెప్పారు. అలాంటప్పుడు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసనలు చేయటం ఎందుకు?’’ అని దుయ్యబట్టారు. మేం వచ్చాక కేసులు ఎత్తేస్తాం... సమైక్య ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని మైసూరా తెలిపారు. ‘‘ప్రజలు వారి సమస్యలపై నిరసన గళం విప్పుతుంటే పోలీస్ బాస్ (డీజీపీ) మాట్లాడుతూ.. నిఘా పెట్టాం... కేసులు బనాయిస్తాం అంటున్నారు. కానీ మేము కచ్చితంగా ఒక మాట చెప్పగలం. అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’’ అని స్పష్టంచేశారు.