
రెండోరోజూ ‘టీ’ రగడ
* లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం
* సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు
* ఉభయ సభలూ నేటికి వాయిదా
* తెలంగాణపై చర్చ కోరుతూ వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
* అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన మోదుగుల, సబ్బం
* సభ అదుపులో లేకపోవడంతో పరిశీలించలేకపోతున్నానన్న స్పీకర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఇతర అంశాలపై వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు వారుుదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వారుుదా పడ్డారుు.
- గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.
- పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలంటూ సభలో వాయిదా తీర్మానం కూడా పార్టీ ఇచ్చింది.
మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సబ్బం హరి, టీడీపీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. -ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ఎంపీలు సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు.
- సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లోకి వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు సాయిప్రతాప్, ఎం.వేణుగోపాల్‌రెడ్డిలు కూడా వెల్‌లోకి వచ్చారు.
- తెలంగాణ ఎంపీలు విభజన బిల్లును వెంటనే సభ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడు జాలర్లపై శ్రీలంక వేధింపులకు నిరసనగా డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. అకాలీదళ్ సభ్యులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను లేవనెత్తారు.
- ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి అంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే లోక్‌సభ వారుుదా పడింది.
- మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ‘ఇది చివరి సమావేశం.. సభను శాంతియుతంగా సాగనివ్వండి..’ అంటూ స్పీకర్ కోరారు. సభ్యుల నినాదాల మధ్యే కొద్దిసేపు సభా కార్యక్రమాలను కొనసాగించారు.
- 12.16కు అవిశ్వాస తీర్మానం నోటీసులపై మీరాకుమార్ ప్రకటన చేశారు. ‘ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ సభ అదుపులో లేదు.. అందువల్ల ఈ తీర్మానాలను పరిశీలించలేక పోతున్నాను’ అని చెప్పారు. కొద్దిసేపటికే లోక్‌సభ శుక్రవారానికి వారుుదా పడింది.
- సభ అదుపులో లేనప్పటికీ కేంద్రం పలు నివేదికలను ప్రవేశపెట్టింది. మొత్తంగా రెండోరోజు లోక్‌సభ కేవలం 15 నిమిషాల పాటే కొనసాగింది.
జేడీయూ ఎంపీలతో వైఎస్సార్‌సీపీ చర్చలు
లోక్‌సభ వాయిదా అనంతరం జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డిలతో పాటు మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు రాజ్యసభలో జేడీయూ సభానాయకుడు శివానంద్ తివారీ, ఎంపీ ఎంకే సింగ్‌లతో పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో భేటీ అయ్యారు. వారితో విభజన బిల్లుపై చర్చించిన నేతలు బిల్లును అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. శాసనసభ బిల్లును తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేసిన జగన్.. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని వారికి వివరించారు.
రెండు ప్రాంతాలకూ శుభవార్త: జేడీ శీలం
‘నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు. తెలుగువారికి న్యాయం చేస్తుంది. తెలంగాణ వారికి శుభవార్త, సీమాంధ్ర వారికి కూడా శుభవార్త ఉంటుంది..’ అని కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు.
కిరణ్ చరిత్రకు త్వరలో ముగింపు: పొన్నం
‘టీ బిల్లును ఆపాలన్న ఆలోచన పొరపాటు. ముఖ్యమంత్రి కిరణ్ చరిత్ర త్వరలో ముగుస్తుంది. తెలుగువాడి పరువు ప్రతిష్టలను ఢిల్లీలో మంటగలిపారు..’ అని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
కమల్‌నాథ్ కాంగ్రెస్ ఎంపీలను రెచ్చగొట్టారు
లోక్‌సభలో గురువారం తాము అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సభలో గందరగోళం సృష్టించడానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలను రెచ్చగొట్టారని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసానికి 71 మంది ఎంపీల మద్దతు కూడా ఉందని, అవిశ్వాసానికి అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలేదని వారు పేర్కొన్నారు. ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు.
రాజ్యసభలోనూ గందరగోళం
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో మూడు నిమిషాలకే వాయిదాపడింది. సమైక్యాంధ్ర నినాదాల మధ్య తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగా.. మళ్లీ గందరగోళం నెలకొంది. ఆరు నిమిషాల తరువాత సభాపతి మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రారంభమైన ఒక నిమిషానికే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏఐడీఎంకే, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.
వివిధ అంశాలపై ఎస్పీ, వామపక్షాలు, అకాలీదళ్ సభ్యులు నిరసన వ్యక్తం చేసినా గందరగోళంలో ఏమీ విన్పించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతో పాటు పలు కుంభకోణాలను బీజేపీ సభ్యులు లేవనెత్తారు. సభలో గందరగోళంపై అసహనంగా కన్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సీట్లో నుంచి లేచి పక్కకు వెళ్లారు. ఆందోళన చేస్తున్న సభ్యులకు ఏవో సైగలు చేస్తూ, ఎద్దేవా చేస్తున్నట్టుగా కన్పించారు.