
ప్రజలపై విద్యుత్ భారం దుర్మార్గం
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఆ భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలిక, ద్వైపాక్షిక విద్యుత్ కొనుగోళ్లకు భారీగా ధర చెల్లించిన ఫలితంగా వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆ భారాన్ని ప్రజలపై ఎలా వేస్తారని ప్రశ్నించారు.
24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పం మంచిదేనని.. అయితే ఇలా అధిక ధరలకు కొనుగోలు చేసి మాత్రం కాదన్నారు. అవినీతి, దుబారా, స్వలాభం కోసం నేల విడిచి సాము చేయడం వల్ల.. అధిక ధరలకు కొన్న విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేలా డిస్కంలను కోరడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మైసూరా విమర్శించారు.
# 2014-15, 2015-16 సంవత్సరాలకుగాను విద్యుత్ చార్జీలు పెంచేలా అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి పంపిణీ సంస్థలు(ఏపీఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్) దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికతమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని, సంస్థలు చేసిన అవినీతి, దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించాలనడాన్ని అంగీకరించబోమని అన్నారు.
# 12 వేల మిలియన్ యూనిట్ల మేరకు జరిగిన విద్యుత్ స్వల్పకాలిక, ద్వైపాక్షిక కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలపై సహా అధిక ధరలపై కూడా ఏపీఈఆర్‌సీ పూర్తిస్థాయి విచారణ చేయాలని మైసూరా డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు ధరలు పెరిగినందువల్ల నష్టం వాటిల్లిందని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు.
# అంతర్జాతీయంగా సహజవాయువు ధరలు తగ్గాయని, అయితే, పెరిగిన సహజ వాయువు ధరల వల్లే అదనపు భారం పడుతోందని డిస్కంలు పేర్కొనడంపై మైసూరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు గ్యాస్‌లో అధిక లాభాలు గడిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్ ధర నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ అయి.. ధరలు తగ్గేలా ఎంత మాత్రమూ కృషి చేయడం లేదన్నారు.
# ‘అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా’ అని కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రాష్ట్రానికి లభించే సాయం అరకొరేనన్నారు. ఇలాంటి అసంబద్ధ ఒప్పందాలన్నీ ఈఆర్‌సీకి చూపి 2014-15 సంవత్సరానికి రూ.1200 కోట్ల మేరకు చార్జీలు పెంచడానికి అనుమతి కోరడం, 2015-16లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలపై ఆ భారం మోపడం అన్యాయమే అవుతుందన్నారు.
# జెన్‌కో ఆధీనంలోని థర్మల్, హైడల్, ఐపీపీ(గ్యాస్-బొగ్గు) ద్వారా 51,518 మి.యూ విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అయ్యే విద్యుత్ 58,191 మి.యూ.అని మైసూరా వివరించారు. అంటే విద్యుత్ లభ్యతకు, సరఫరాకు తేడా 6,673 మి. యూ మాత్రమేనన్నారు. డిస్కంలు 2013-14 విద్యుత్ వాడకాన్ని పోలిస్తే 2014-15, 2016 సంవత్సరాలకు వినియోగం కాగల విద్యుత్ అంచనాలను సంస్థలు ఎక్కువ చేసి చూపాయన్నారు.
# 2014-15లో తొలి 6 నెలల విద్యుత్ వాడకాన్ని చూపకుండా రెండో 6 నెలలకు అంచనాలను చూపారన్నారు. పారిశ్రామిక రంగంలో 33 శాతం, సాధారణ రంగంలో6 శాతం వినియోగం పెరుగుదల ఉంటుందనడం, తేడాను ఎక్కువ చేసి చెప్పడం.. అంకెల గారడీ తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో అసలు పరిశ్రమలే అంతగా లేనపుడు వినియోగంలో ఇంత వృద్ధి ఎలా ఉంటుందన్నారు. ఈ అంకెలగారడీ వల్ల 6,673 మి.యుల వినియోగంలో తేడా చూపుతూ దానికంటే అదనంగా 11,159 మి.యుల విద్యుత్ కావాలని చెబుతున్నారన్నారు. ఈ విద్యుత్‌ను తక్కువ ధరకు కొంటే ఫర్వాలేదు గానీ, ఎక్కువ ధరలకు కొనడం ఆమోదయోగ్యం కాదన్నారు.
# ఒప్పందం కుదుర్చుకున్న విధంగా విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతే రూ.600 కోట్లు జరిమానా కట్టాలని చెప్పి ఆ నష్టాన్ని కూడా ప్రజల నెత్తిన రుద్దడం బరితెగించడమేనని మైసూరా విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.