సాక్షి, హైదరాబాద్: దక్షిణ/ఉత్తర తెలంగాణ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సిన విద్యుత్ టారిఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం రెండోరోజు ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఏడేళ్లలో డిస్కంలపై పెరిగిన వ్యయ భారాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.
కోతల్లేని నిరంతర విద్యుత్ సరఫరా, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీలు సైతం డిస్కంలపై తీవ్ర భారాన్ని మోపాయని సమీక్షలో మంత్రులకు అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో డిస్కంల నష్టాలు, ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
చార్జీల పెంపు ప్రతిపాదనలను ఒకట్రెండు రోజుల్లో ఈఆర్సీకి డిస్కంలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, దక్షిణ డిస్కం సీఎండీ జి. రఘుమారెడ్డి పాల్గొన్నారు.
డిస్కంల నష్టాలపై ప్రభుత్వానికి అధికారుల నివేదన ఇదీ...
♦గత నాలుగేళ్లలో బొగ్గు రవాణా రైల్వే చార్జీలను కేంద్రం 40 శాతం మేర పెంచింది. పునరుత్పాదక విద్యత్ (ఆర్‌పీవో)ను కేంద్రం తప్పనిసరి చేయడంతో జెన్‌కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి ఖరీదైన సోలార్, పవన విద్యుత్‌ను కొనాల్సి వస్తోంది. సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల ఒప్పందాల (పీపీఏ)ను రద్దు చేసుకోవడంతో ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో డిస్కంలపై రూ. 2,763 కోట్ల అదనపు భారం పడింది. ఏపీ జెన్‌కో ఇతర విద్యుత్ కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్‌ను సైతం నిలిపేయడంతో డిస్కంలు మరో రూ. 2,502 కోట్ల అదనపు ఖర్చులు చేశాయి.
♦ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు రూ. 18,167 సబ్సి డీని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండ గా ఏడేళ్లలో 6.89 లక్షల కొత్త కనెక్షన్లను సర్కారు మంజూరు చేసింది. ఏటా వ్యవసాయ సబ్సిడీగా ప్రభుత్వం రూ. 3,375 కోట్లు ఖర్చు చేస్తోంది.
♦ కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ సరఫరాకు రూ.3,200 కోట్లు ఖర్చు చేస్తోంది.
♦ 200 యూనిట్లలోపు గృహావసరాల విదుŠయ్‌త్ వినియోగదారులకు ఏటా రూ. 1,253 కోట్ల రాయితీలను అందిస్తోంది. 5,77,100 ఎస్సీ, 2,69,983 ఎస్టీల గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తోంది. నాయీ బ్రాహ్మణుల నిర్వహణలోని 15,046 హెయిర్ సెలూన్లు, 47,545 లాండ్రీ షాపులు, 50 దోభీ ఘాట్లకు ప్రతి నెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. 4,920 పవర్ లూమ్‌లు, 5,920 కోళ్ల ఫారాలు, 36 స్పిన్నింగ్ మిల్లులకు ఒక్కో యూనిట్‌పై రూ. 2 చొప్పున సబ్సిడీ అందిస్తోంది.
♦ కోవిడ్ లాక్‌డౌన్ల ప్రభావంతో రూ. 4,374 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. ఏటేటా డిస్కంలపై ఈ మేరకు వ్యయ భారాలు పెరిగిపోతుండగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సైతం పెంచలేదు.
టన్ను బొగ్గుపై రూ. 50 ఉన్న క్లీన్ ఎనర్జీ సెస్‌ను మోదీ ప్రభుత్వం రూ. 400కు పెంచడంతో ఏడేళ్లలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై రూ. 7,200 కోట్ల అదనపు భారం పడింది. బొగ్గు ధరలను కేంద్రం సాలీనా 6–10% పెంచడంతో డిస్కంలపై ఏటా రూ. 725 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర విభజన వేళ రూ. 12,185 కోట్ల భారీ నష్టాల తో ఏర్పడిన డిస్కంలపై మోదీ సర్కార్ విద్యుత్ సంస్కరణలూ గుదిబండగా మారాయి.
– సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారన్న అధికార వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment