సాక్షి, హైదరాబాద్: తీవ్ర నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిస్కంల ఆర్థిక పరిస్థితిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
దీర్ఘకాలిక సెలవులో ఉన్న ప్రభాకర్‌రావు మంగళవారం మంత్రి సమక్షంలో విధుల్లో చేరారు. ఈ మేరకు ఆయనకు సెలవులు మంజూరు చేయడంతోపాటు విధుల్లో చేరినట్టు ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చేపట్టిన సమీక్షలో ఏ కేటగిరీల వినియోగదారులపై ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించాలనే అంశంపై చర్చ జరిగిందని, పెంపు ప్రతిపాదనలకు తుదిరూపు వచ్చిందని సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థల సీఎండీలతో సమీక్ష నిర్వహించి ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం అనుమతి లభించిన వెంటనే ఈఆర్సీకి డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదినలు సమర్పించనున్నాయి.
చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఎన్నికల కోడ్ ప్రభావం?
విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
వచ్చే నెల 14 వరకు ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండనుంది. దీంతో ఈ నెలాఖరులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించడం సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం అనుమతిస్తే మాత్రం నిబంధనల ప్రకారం నెలాఖరులోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపును అమలు చేయడానికి డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment