
కరెంట్ చార్జీల పెంపుపై బెహన్ ఫైర్
లక్నో : గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదన పట్ల బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయవతి మండిపడ్డారు. గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్‌లను పెంచేందుకు పవర్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలు దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారిపైనా విద్యుత్ చార్జీల భారం మోపాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదనను అందరూ ఖండించాలని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం యూపీలో 20 కోట్ల మందిపై విద్యుత్ భారాలను మోపాలని బీజేపీ భావిస్తోందా అని మాయావతి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, శాంతి భద్రతల పరిస్ధితి దారుణంగా తయారైందని ఆమె ఆరోపించారు. మహిళలకు భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేసిన మాయావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.