
ఏపీ నీళ్లు కృష్ణార్పణం : ఎంవీ మైసూరా రెడ్డి
హైదరాబాద్ సిటీ: కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వెళ్లిన ప్రతినిధులు రాష్ట్ర వాటాను కృష్ణార్పణం చేయడం సహించరాని చర్యని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏపీ రైతుల ప్రజల పాలిట ఆశనిపాతమని, మొత్తం వ్యవసాయ ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వాటాను సాధించుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో వాటాను సాధించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగాని, బోర్డు సమావేశానికి వెళ్లిన అధికారులు గాని ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించలేదని ధ్వజమెత్తారు.
ఎంతో కష్టపడి బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సాధించుకున్న హక్కులను ఆంధ్రప్రదేశ్ తేలిగ్గా వదలి వేసిందని, ఏ దశలోనూ పోరాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, ఖరీఫ్ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించకపోవడం, కేంద్రంలో వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడంలో కృషి చేయలేకపోవడం వంటి వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నాలు జరపాలని పిలుపునిచ్చినట్లు మైసూరా వెల్లడించారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు ధర్నాలు ప్రారంభమవుతాయన్నారు. కీలకమైన ఈ మూడు అంశాలతో పాటు ఆయా జిల్లాల్లో ఉండే స్థానిక సమస్యలు కూడా ఈ ధర్నాల్లో డిమాండ్లుగా ఉంటాయని తెలిపారు. సర్కారు లాలూచీ... ఏసీబీ కేసుల విషయంలో పతాకస్థాయిలో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్న కృష్ణా నదీ జలాల కేటాయింపులను తేలిగ్గా వదలి వేసిందని మైసూరా విమర్శించారు.
బోర్డు ముందుకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు ఏపీ దిగువ రాష్ట్రం అనే విషయం పరిగణించినట్లు లేదన్నారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్‌లో విస్పష్టంగా నీళ్లను కేటాయించిన విషయాన్ని విస్మరించి గంపగుత్తగా నీళ్లను వాడుకోవాలని బోర్డులో నిర్ణయించడమనేది ఏపీకి ఆశనిపాతమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు కలిపి 749.16 టీఎంసీల నీటితోపాటు శ్రీశైలంలో 33 టీంఎసీలు, జూరాలలో 17.84 టీఎంసీల నీరు ఆవిరవుతాయని అంచనా వేసి మొత్తం మీద 811 టీఎంసీల నీటిని కేటాయించారని గుర్తు చేశారు.
తెలంగాణ కేటాయింపులు కూడా ప్రాజెక్టుల వారీగానే ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా 299 టీఎంసీల నీటిని గంపగుత్తగా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అవకాశం ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలు దారుణంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రస్తుత బోర్డు నిర్ణయం ఉందన్నారు. 299 టీఎంసీలను తెలంగాణ గంపగుత్తగా ఎక్కడైనా వాడుకుంటే.. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు దారుణంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్ర అభివృద్ధి కోసం కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తయిన తర్వాతే అక్కడ మిగిలే నీటిలో 20 టీఎంసీలు భీమాకు ఇవ్వాలని నిర్ణయిస్తే, ఇంకా ఆధునీకరణ పూర్తికాకుండానే 20 టీఎంసీల నీటిని భీమాకు ఇవ్వడానికి అంగీకరించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, కృష్ణా డెల్టా రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టి తెలంగాణకు ఉదారంగా 20 టీఎంసీలు వదిలేయడం వెనక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంపై బోర్డులో మన ప్రతినిధులు గట్టిగా ప్రస్తావించకపోవడం దుర్మార్గమైన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తూంటే ఏదో లాలూచీ పడినట్లుగా కనిపిస్తోందని మైసూరా అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రస్తుతం వేడి తగ్గినట్లుగానే ఉందని, నాలుగైదు రోజుల క్రితం ఉన్న వాడి వేడి ఈ కేసులో ఇపుడు లేనేలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.