
రెక్కలు విరిచారంటూ కేబినెట్ లో కొనసాగుతారా?
కడప: పట్టిసీమ కోసమే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు కేటాయించడంపై అనుమానాలున్నాయని అన్నారు. రెక్కలు విరిచారంటున్న చంద్రబాబు... కేంద్ర కేబినెట్ లో తమ పార్టీని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.
గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్న డిమాండ్ తో కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మైసూరారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని గతంలో దేవినేని ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈరోజు గండికోటకు జూలైలోగా నీరందిస్తామంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. సర్కారుకు అంత చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటిని ఎందుకు వృధాగా కిందికి వదిలారని అన్నారు.