పట్టిసీమ నిరర్థక ప్రాజెక్టు | Ysrcp fires on contractors by allocating RS 1,300 crore for Pattiseema irrigation scheme | Sakshi
Sakshi News home page

పట్టిసీమ నిరర్థక ప్రాజెక్టు

Published Wed, Jan 28 2015 6:51 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Ysrcp fires on contractors by allocating RS 1,300 crore for Pattiseema irrigation scheme

* కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే రూ.1,300 కోట్లు  
* పోలవరం ఉండగా పట్టిసీమతో పనేంటి?: మైసూరా

 
 సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, నేతలు తమ జేబులు నింపుకోవడానికే ఆగమేఘాలమీద పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1,300 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ హోదా పొందిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉండగా పట్టిసీమ ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంకల్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, షేక్ బేపారి అంజాద్ బాష, కళత్తూరు నారాయణస్వామితో కలసి వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా నిర్మిస్తామని ప్రకటించడం, ముఖ్యమంత్రితోసహా మంత్రులు, టీడీపీ నేతలంతా ఇదేమాట చెప్పడం సం తోషదాయకమన్నారు. అయితే మళ్లీ పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు  వ్యవహారం ప్రాంతీయ విభేదాలకు బీజాలు నాటేలా ఉందన్నారు.
 
  ‘‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్), ఇతర అనుమతులు, టెండర్లు పిలవడం వంటి ప్రక్రియ ముగిసి, నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం రెండున్నర నుంచి మూడేళ్ల వ్యవధి పడుతుంది. నాలుగేళ్లలో పోల వరం పూర్తవుతుందని అధికారపక్షం గట్టిగా చెబుతున్నపుడు ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు? ఒక్క ఏడాదికోసం రూ.1,300 కోట్లు వృథా చేయడం ఎందుకు?’’అని మైసూరా ప్రశ్నించారు. ఉద్యోగుల జీతభత్యాలకోసం ఓవర్‌డ్రాఫ్టు కోసం రిజర్వుబ్యాంకు వద్దకు వెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని వందల కోట్లు ఖర్చు చేయడం భావ్యమా అని నిల దీశారు. పోలవరం నిర్మాణం పూర్తయ్యాక పట్టిసీమ ఓ నిరర్థకమైన ప్రాజెక్టుగా మిగిలిపోతుందన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఒకేసారి వరద నీరు వస్తోందని, అలాం టపుడు ఒకచోటి నుంచి మరోచోటికి నీరు తీసుకునే అవకాశం ఉండదు కనుక  ఇది నిరర్థక ప్రాజెక్టుగానే మిగిలిపోతుందని అన్నారు.  అఖిలప్రియ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకమైనా, రాజధాని నిర్మాణమైనా రైతులనుంచి పంట పొలాలను ప్రభుత్వం లాక్కుంటున్నదని విమర్శించారు.  
 
 ప్రత్యేక హోదా ఎగ్గొట్టేందుకే ..
 ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో గట్టిగా డిమాండ్ చేసి, తాము అధికారంలోకొచ్చాక పదేళ్లపాటు ఆ హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తానిచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మైసూరారెడ్డి కోరారు. ప్రత్యేక హోదా లేనట్లేనని సీఎం చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో మంత్రులతో చెప్పడాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే ఈ నాటకాలన్నీ’ అని మైసూరా అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కడంవల్ల ప్రత్యేక హోదా రాకుండా నీరుగారిపోతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement