సోనియా డెరైక్షన్.. బాబు యాక్షన్: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆడిస్తున్న నాటకంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రధారులని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్ర విభజనకు బీజం పడిందని బుధవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.
ముఖ్యమంత్రి చేతిలో అసెంబ్లీ తీర్మానం అనే బ్రహ్మాస్త్రం ఉన్నప్పటికీ ఆయన దాన్ని వాడటం లేదని విమర్శించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య రాష్ట్రం కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామన్న వైఎస్సార్‌సీపీ ప్రతిపాదనను ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యపై ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిన విషయాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం రాష్ట్రాన్ని బలిచేయబోతున్నారన్న విషయం వెల్లడయ్యాక.. ‘ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలిగితే చేయండి లేకపోతే సమైక్యంగా ఉంచండి’ అని మొట్టమొదట కోరింది వైఎస్సార్సీపీనే అని మైసూరా తెలిపారు.
ఆ రెండు పార్టీల ఎజెండా సమన్యాయమే!
‘తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఆమోదం లభించిన రోజే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఢిల్లీలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. వారిద్దరూ కలిసి రూపొందించిన పథకంలో భాగంగానే నాల్గవ తేదీన చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ దీక్ష కూడా సమైక్యం కోసం కాదు. విభజన పట్ల జాతీయ మీడియా పదే పదే ప్రశ్నించినా దాటవేశారు. ఇప్పటికీ సమైక్యమని ఒక్క మాటా అనడంలేదు’ అని మైసూరా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘అడ్డుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కేంద్రమంత్రులు ఇప్పుడు విభజన తప్పదు, సమన్యాయం కోసం పోరాడుతామంటున్నారు. టీడీపీ చెబుతున్న సమన్యాయమే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఆ రెండు పార్టీల ఎజెండా ఒక్కటే అని స్పష్టమైంది’ అని విమర్శించారు.
సమైక్యమంటూ వారానికో ప్రెస్‌మీట్ పెట్టడం తప్ప ముఖ్యమంత్రి ఏమీ చేయడం లేదని మైసూరా విమర్శించారు. పైగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం ఆడిస్తున్న నాటకాన్ని సీఎం కిరణ్, ఎంపీలు లగడపాటి, ఉండవల్లి ఒకరి తర్వాత ఒకరు రక్తి కట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు బయటపడకుండా ఉండేందుకే తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు.
యనమల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని మైసూరా తెలిపారు. జగన్‌కు బెయిల్ నిబంధనలు సడలించవద్దంటూ యనమల చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తే కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అయినా, రాజకీయంగా పోరాడాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్లడంలేదు’ అన్నారు. ‘యనమల ధోరణి చూస్తుంటే ప్రత్యర్థి కాళ్లు కట్టేయండి, కుస్తీ పోటీల్లో పాల్గొంటాను అన్నట్లుంది’ అని ఎద్దేవా చేశారు.