విభజనకు సోనియా, బాబులే ప్రధాన కారకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అటు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్య కారకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ఆరోపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా శనివారం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభలో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటే... వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో యూపీఏ ప్రభుత్వం రాష్ట విభజనకు పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే విభజిస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని 16 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విభజనపై యూపీఏ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని దాడి తెలిపారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో తెలుగు ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లతోపాటు పీసీసీకి నిజాయితీ ఉంటే సమైక్య రాష్ట్రంపై తీర్మానం చేయాలని వారికి ఈ సందర్బంగా దాడి వీరభద్రరావు సూచించారు.