ముమ్మాటికీ సమైక్యమే | Ys jaganmohan reddy writes letter to union home ministry on samaikya stands | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ సమైక్యమే

Published Mon, Nov 4 2013 12:55 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

ముమ్మాటికీ సమైక్యమే - Sakshi

ముమ్మాటికీ సమైక్యమే

  • విభజన కోసమే మంత్రుల బృందం... జీవోఎంను మేము వ్యతిరేకిస్తున్నాం
  •  కేంద్ర హోంశాఖకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ
  •  లేఖను విడుదల చేసిన కొణతాల, మైసూరారెడ్డి
  •  సమైక్యాంధ్రను కోరుకునేవారంతా జీవోఎంను గుర్తించకుండా వ్యతిరేకించాలని పిలుపు
  •  సీఎం, చంద్రబాబు, సీమాంధ్ర మంత్రులు లోపాయికారీగా విభజనకే సహకరిస్తున్నారు
  •  బాబు చెప్పినందుకే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు
  •  ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన జగన్
  •  సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి     
  •  సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
     
     ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారందరూ జీవోఎంను గుర్తించకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జీవోఎంను వ్యతిరేకించడంతో పాటు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాసిన లేఖను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా 2013 అక్టోబర్ 30వ తేదీన హోంశాఖ నుంచి వచ్చిన లేఖకు సమాధానంగా జగన్ ఈ లేఖ రాశారని నేతలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ తొలి నుంచీ కోరుతోందని, కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేయడం, సలహాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం అనేది విభజన ప్రక్రియలో మరో ముందడుగుగా తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. అందుకే జీవోఎంను తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు.
     
     ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు సహా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులందరూ పైకి ఒక రకంగా మాట్లాడుతూ లోపాయికారీగా విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్, బాబు.. ఇద్దరూ సోనియాగాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ విభజనకు దోహదపడుతున్నారన్నారు. విభజన విషయంలో అఖిలపక్షం వేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారని, ఆయన మాట మేరకు కేంద్రం ఇప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేయ సంకల్పించిందని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కిరణ్ ఇదే ఆఖరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవుతుందేమోనని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం సాగిస్తామని ఓవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని కొణతాల, మైసూరారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? అన్న ఒక ప్రశ్నకు.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరతామని ఆయన స్పష్టం చేశారు.
     
     కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఈ విధంగా ఉంది...
     
     అయ్యా,
     ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై మా పార్టీ సలహాలు, సూచనలు కోరుతూ 2013 అక్టోబర్ 30వ తేదీన మీరు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకించాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. అందువల్ల రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా మా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3వ తేదీన తీసుకున్న నిర్ణయం మాకు ఏమాత్రం సమ్మతం కాదు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు గత మూడు నెలలుగా విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రోడ్లపై ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాస్తవాన్ని విస్మరించి విభజన అనే దారుణమైన అన్యాయానికి ఒడిగట్టడానికే సిద్ధమై ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది కూడా రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతోనే కనుక దానిని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం.     
     కృతజ్ఞతలతో...
                                        మీ
         వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
     
     జగన్‌కు నేడు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్!
     వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు సమాచారం. ప్రణబ్ సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న విషయం విదితమే. హైదరాబాద్‌లో కలవడానికి తమకు సమయం కేటాయించాల్సిందిగా జగన్ ఇటీవల ఒక లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్న రాష్ట్రపతిని 9 గంటల తరువాత కలుసుకోవాల్సిందిగా ఆయన కార్యాలయ సిబ్బంది వర్తమానం పంపినట్లు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement