అదో దగాకోరు సర్వే | It is a bogus survey | Sakshi
Sakshi News home page

అదో దగాకోరు సర్వే

Published Thu, Apr 3 2014 3:56 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

అదో దగాకోరు సర్వే - Sakshi

అదో దగాకోరు సర్వే

 సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఎన్నికల సర్వేపై మండిపడ్డ మైసూరారెడ్డి
 
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సీఎన్‌ఎన్-ఐబీఎన్ టీవీ చానల్ ప్రసారం చేసిన సర్వే ఒక దగాకోరు సర్వే అని, ఏప్రిల్ ఫస్ట్‌న ప్రజలను ఏప్రిల్ ఫూల్స్‌ను చేయడానికే ఆ చానల్ ఇలా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పతనమైపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పైకి లేపడానికి చేసిన ప్రయత్నంగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఈ సర్వేను చేసినట్లుగా ఉందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 23 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేవలం 1,300 మంది అభిప్రాయాలను సేకరించి చేసిన సర్వేకు అసలు విలువుంటుందా? ఇది గదుల్లో కూర్చుని చేసిన అంకెల గారడీ మాదిరిగా ఉందని విమర్శించారు. ఆయనేమన్నారంటే...

  సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ సర్వేలో సీమాంధ్రలో 14 శాతం ఇతర పార్టీలకు వస్తాయని చెప్పింది. అయితే ఆ ఇతర పార్టీలేమిటో కూడా చెప్పాలి కదా? అసలు వీళ్లు ఎన్నికల సర్వే నిర్వహించే సెఫాలజిస్టులేనా? రాష్ట్రంపై వీరికి అవగాహన ఉందా?   వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ కాక ఇతర పార్టీలంటే లోక్‌సత్తా, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ. గత ఎన్నికల్లో లోక్‌సత్తాకు 1.2, ఉభయ కమ్యూనిస్టులకు 4.4 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అలాంటిది 14శాతం ఇతర పార్టీలకు వస్తాయని అంచనా వేయడం మోసపూరితం కాక మరేమిటి?
 
 ఇదే చానల్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్‌కు 45 శాతం, టీడీపీకి 33 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనాలు వేసి, లోక్‌సభ సీట్లు వస్తాయనే విషయానికి వచ్చేటప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 నుంచి 17, టీడీపీకి 10 నుంచి 16 సీట్లు వస్తాయని చెప్పింది. సాధారణంగా 1 లేదా 2 శాతం ఓట్లు అధిక శాతం వచ్చే పార్టీకే భారీ విజయాలు ఎన్నికల్లో లభిస్తాయి. అలాంటిది సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ అంచనా ప్రకారమే టీడీపీ కన్నా 12 శాతం ఓట్లు అధికంగా పొందే వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం తక్కువ సీట్లు వస్తాయా? ఇదెక్కడి విశ్లేషణ? వీళ్లేం సర్వేల నిర్వాహకులు?
 
 సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఈనాడు సంస్థల్లో పెట్టుబడులు ఒకరివే , వారికి చంద్రబాబుతో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవే. పతనస్థాయిలో ఉన్న చంద్రబాబును పెకైత్తడానికి ఈ సర్వే చేసినట్లుగా ఉంది. ఈ సర్వేపై మంగళవారం రాత్రి చానల్‌లో చర్చ సందర్భంగా పాల్గొన్న ప్యానలిస్టులు హిందూ ఎడిటర్ (రూరల్ అఫైర్స్) పాలగుమ్మి సాయినాథ్, ప్రధానమంత్రి మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారులు ఈ సర్వేను తప్పులతడక అని చెప్పారు. సీమాంధ్రలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఈ సర్వే అద్దం పట్టడం లేదని దుమ్మెత్తి పోశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement