చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి | Chandrababu Naidu has Ys Jagan mohan reddy's Fobiya, says Mysura reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి

Published Fri, Oct 4 2013 3:11 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి - Sakshi

చంద్రబాబుకు జగన్ ఫోబియా: మైసూరారెడ్డి

వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం
ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెట్టడం
చంద్రబాబు దివాలాకోరు తనానికి నిదర్శనం
రాష్ట్రమంతా ఢిల్లీ వైపు చూస్తుంటే ఆయన మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారు
మాజీ సీఎంగా బాధ్యతారహితంగా మాట్లాడటం తగదు

 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. జగన్ ఫోబియా పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని జగన్‌కు ముడిపెడుతూ విమర్శలు చేయడం చూస్తుంటే చంద్రబాబు దివాలాకోరుతనం స్పష్టంగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే చంద్రబాబు మాత్రం మీడియాలో కనిపించేందుకు ఆరాటపడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తిగా, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన వ్యక్తి, దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌ను సీబీఐ డెరైక్టర్ కలిసిన విషయంపై కూడా అర్థం లేకుండా జగన్‌పై విమర్శలు చేయడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ‘‘సీఆర్‌పీసీ సెక్షన్ 173 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుంది. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల  లోగా చార్జిషీట్ వేయకపోతే కూడా స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది.
 
 ఈ నిబంధనలను తుంగలో తొక్కి వక్రమార్గాలు పట్టి, చట్టాన్ని వక్రీకరించి, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని సీబీఐ ఇష్ట ప్రకారం దర్యాప్తు చేసినా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోగా సంతోషించారు. సుప్రీంకోర్టు ఒకమారు 4 నెలలు గడువు ఇస్తే.. ఆరు నెలలైనా సీబీఐ చార్జిషీట్ వేయలేదు. మరోసారి నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ వేయమని సుప్రీంకోర్టు కచ్చితంగా ఆదేశించడంతో తుది చార్జీషీట్ వేసింది. దీనిని కూడా చంద్రబాబు తప్పుపట్టడం సరైంది కాదు’’ అని అన్నారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్నట్టు అసత్య ఆరోపణలతో చంద్రబాబు.. జగన్ మీద అభాండాలు వేస్తున్నారన్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచి సంప్రదాయం కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
 
 కేంద్రం 10 జన్‌పథ్ పంజరంలో చిలుక..
 సున్నితమైన రాష్ట్ర విభజన సమస్యపై కేంద్రం ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని మైసూరా పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ లబ్ధికోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్సును రాహుల్‌గాంధీ చెబితేనే ఉపసంహరించుకోవడం సిగ్గుచేటన్నారు. ఆ ఆర్డినెన్సును వైఎస్సార్ కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. 10 జన్‌పథ్ పంజరంలో చిలుకలా తయారైందని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి కనుసన్నల్లో కేంద్రప్రభుత్వం పనిచేయడం మంచి సంప్రదాయం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement