విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం | YSRCP Oppose Telangana Bill, Says Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం

Published Fri, Jan 17 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం

విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం

* చర్చలో పాల్గొనం వైఎస్సార్‌సీపీ
* జగన్‌తో పార్టీ ముఖ్యనేతల భేటీ
* అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
* ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటేస్తామన్న భూమన
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి ఉద్దేశించిన విభజన బిల్లుపై శాసనసభలో జరిగే చర్చలో తాము పాల్గొనబోమని, అయితే రాష్ట్రపతి సూచనల ప్రకారం బిల్లుపై తమ అభిప్రాయాలను మాత్రం మళ్లీ కచ్చితంగా చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ బిల్లుపై ఓటింగ్ జరిపితే అందులో తమ ఎమ్మెల్యేలందరూ పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశామని, విభజనకు వ్యతిరేకంగా మళ్లీ అవే అభిప్రాయాలను వెల్లడిస్తామే కానీ చర్చలో పాల్గొనబోమని విస్పష్టంగా తెలిపారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎంవి మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు సహా పలువురు ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమై శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి పార్టీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ సమక్షంలో సభలో జరిగే చర్చలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పారు. సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్, రాష్ట్రాన్ని విభ జించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయి విభజన బిల్లుపై చర్చ సజావుగా పూర్తి చేసి కేంద్రానికి పంపడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కోర్ కమిటీలోనూ, ఆ తరువాత సీడబ్ల్యూసీలోనూ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నపుడు భాగస్వామిగా ఉన్న సీఎం అప్పుడు గంగిరెద్దులా తలూపి వచ్చారని, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు భయపడి పది రోజుల తరువాత బయటకు వచ్చి తాను విభజనకు వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కి పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని మాట్లాడి ఆ ఉద్యమంపై కిరణ్ నీళ్లు చల్లారన్నారు.

తీర్మానం ద్వారా బిల్లును ఓడిద్దామని, రకరకాలుగా ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. చివరకు విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకే సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ఉద్దేశ్యపూర్వకంగా సభకు రాకుండా, బీఏసీ సమావేశాలకు గైర్హాజరవుతూ బయట మాత్రం సమైక్యవాదినని పత్రికల్లో రాయించుకున్నారని ఆరోపించారు. ఇక బాబు 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేఖ నివ్వడంతో పాటుగా 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో జరిగిన సమావేశంలో కూడా విభజనకు అనుకూలమని స్పష్టంగా చెప్పారని భూమన గుర్తుచేశారు.

అంతటితో ఆగకుండా షిండేతో జరిగిన సమావేశంలో సైతం రాష్ట్రాన్ని త్వరగా విడగొట్టాలని చెప్పారని, అయితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాక ఇపుడు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లుపై తమ పార్టీ వంద శాతం అభిప్రాయాలు వ్యక్తీకరిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 11న ఏకాదశి నాడు తిరుమలలో విచ్చలవిడిగా వీఐపీ పాసుల జారీపై ప్రశ్నించినందుకు సామాన్య భక్తులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement