మా ప్రశ్నలకు సమాధానమేదీ: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో ముందుకు రావాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు నీటి పంపకాల విషయంలో సమస్యలున్నాయని చెప్పారు. మిగులు, నికర జలాలపై ఇప్పటి దాకా తమ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం నుంచి సమాధానమే లేదన్నారు.
‘‘కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఒకే రాష్ట్రంలో ఉన్నందున ప్రజల అభీష్టం మేరకు అన్ని ప్రాంతాల వారు ఆ నీటిని వాడుకున్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ప్రతి నీటి చుక్కనూ లెక్కకడుతుంది. మిగులు జలాల ఆధారంగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మితమైన నెట్టెంపాటు, కల్వకుర్తి, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్‌ఎల్‌బీసీ, పులిచింతల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కూడా ఒక్క చుక్కనీరు అధికారికంగా పంపకాలు జరపలేదు. అలాగే గోదావరి పరీవాహక ప్రాంతంలో కూడా ఈ సమస్య తలెత్తనుంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారే కానీ.. నీటి కేటాయింపులు ఎలా చేస్తామనేది ఎందుకు చెప్పలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచన తప్ప.. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని మైసూరా మండిపడ్డారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య నదీ జలాల పంపకాలు, యాభై ఏళ్లుగా అన్ని ప్రాంతాల వారూ ఉమ్మడిగా ఉంటున్న రాజధాని హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేయటం సరికాదని తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ తన సొంత ఇంటి విషయంలా భావి స్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా హైపవర్ కమిటీని ప్రకటించింది. కానీ దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు. అదొక పవర్‌లెస్ కమిటీ.. చెత్త కమిటీ’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లోని అసంతృప్తులను సముదాయించటానికే ఈ పార్టీ కమిటీని వేశారు తప్పితే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఎండగట్టారు.
కాంగ్రెస్, టీడీపీల నేతలవి డ్రామాలే...
పార్లమెంటులో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు చేస్తున్న ప్రదర్శనలు ఉత్తి డ్రామాగానే పరిగణించాల్సి వస్తోందని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టటానికే రెండు పార్టీల నేతలు ఈ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదని మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు గవర్నర్ దగ్గరకు వెళ్లి చెప్పాలి.. అలా చేస్తే ప్రజలు విశ్వసిస్తారే కానీ.. రాజీనామాలు అంటూ పీసీసీ అధ్యక్షుడికి ఇస్తే నమ్మెదెవరు?’’ అని నిలదీశారు. టీడీపీ నేతల వ్యవహారం కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఉందన్నారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్‌జీవోలు కలిసినప్పుడు విభజనపై గతంలో నిర్ణయం తీసుకున్నానని.. అందులో మార్పులేదని చెప్పారు. అలాంటప్పుడు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసనలు చేయటం ఎందుకు?’’ అని దుయ్యబట్టారు.
మేం వచ్చాక కేసులు ఎత్తేస్తాం...
సమైక్య ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని మైసూరా తెలిపారు. ‘‘ప్రజలు వారి సమస్యలపై నిరసన గళం విప్పుతుంటే పోలీస్ బాస్ (డీజీపీ) మాట్లాడుతూ.. నిఘా పెట్టాం... కేసులు బనాయిస్తాం అంటున్నారు. కానీ మేము కచ్చితంగా ఒక మాట చెప్పగలం. అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’’ అని స్పష్టంచేశారు.