'రాజధాని కోసం ప్రైవేట్ భూములు కొనొద్దు'
కడప: నూతన అంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల కొనుగోలు సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.
రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని సూచించారు. శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రుల ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి ఒక్క అడుగు ముందుకు కదల్లేదని మైసూరారెడ్డి విమర్శించారు.