'పరిశీలనలో ఏపీకి రెండు రాజధానులు'
కడప: అన్ని ప్రాంతాల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. రాయలసీమ సాగునీటి కోసం మరి కొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, రాజధాని ఎంపిక విషయంలో ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
రాజధానుల నిర్మాణం సాధారణంగా 30-100 సంవత్సరాల సమయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తొందరపాటు నిర్ణయం భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు జరగొచ్చని, అందుకే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇస్తామన్నారు. ఏపీకి రెండు రాజధానుల అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.