ఒంగోలులో ప్రజాసంఘాల భారీ ప్రదర్శన, చిత్రంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
‘అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలా.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా.. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధికి బాటలు పడుతుంటే అడ్డుకుంటారా.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం కావాలా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు విరుచుకుపడ్డారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు కలుగుతుందని నినదిస్తూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అంతా ఒక్కటై కదం తొక్కారు. శనివారం పలుచోట్ల ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.
ఒంగోలు సిటీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలతోపాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను అమలు చేయాలని కోరుతూ ఒంగోలు ప్రజలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాజధానిని అమరావతికే పరిమితం చేయాలంటూ రైతులను, ప్రజలను రెచ్చగొట్టి కపట నాటకాలు ఆడుతున్న చంద్రబాబు వాటికి ఇకనైనా తెరదించాలని సూచించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు.
కదం తొక్కిన గిరిజనులు
పాయకరావుపేట/పాడేరు: విశాఖ జిల్లా పాయకరావుపేట, పాడేరులో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటును స్వాగతించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అందరి పైనా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, పాడేరు మండలం వనుగుపల్లిలోనూ గిరిజనులు భారీ ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్బ నరసింగరావు పాల్గొన్నారు.
ఆస్తుల్ని కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం
మదనపల్లె/నగరి (చిత్తూరు జిల్లా): అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మదనపల్లె, నగరిలో మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సినీ దర్శకులు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరావతిలో రైతులను మోసగించి కొన్న భూములు, ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సెల్వమణి మాట్లాడుతూ గతంలో రాజధాని పేరిట మద్రాసు, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
హిందూపురం: పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు నినదించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని నిపుణుల కమిటీలు, విశ్లేషకులు చెబుతున్నారని, ఆ దిశగానే ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన రియల్ బాగోతం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు.
‘సీమ ద్రోహులను అడుగుపెట్టనివ్వం’
కర్నూలు (సెంట్రల్): అమరావతి పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎవరైనా యాత్రలంటూ రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు రవికుమార్ హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
లక్షల కోట్లు దోచుకుని జోలె పడతారా..
శ్రీకాకుళం: శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబడి ఉందన్నారు. రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రాజధాని పేరుతో జోలెపట్టి భిక్షాటన చేయడం సిగ్గు చేటన్నారు. ర్యాలీల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పాల్గొని మద్దతు తెలిపారు.
సమతుల అభివృద్ధి కోరుతూ..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల కమిటీల సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమతుల అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ చేపట్టాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లాలో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడలో ప్రదర్శనకు ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని బాలాంత్రం గ్రామం, కాకినాడ భానుగుడి సెంటర్, అనపర్తి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.
సాగర తీరంలో కదం తొక్కిన విద్యార్థులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని విద్యార్థులు నినదించారు. హార్బర్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు సాగర తీరంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల రాజధానులతో పోటీపడే స్థాయి మన రాష్ట్రంలో విశాఖపట్నానికి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు.
మేధావుల నిర్ణయం మేరకే వికేంద్రీకరణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తణుకు, అత్తిలి, ఇరగవరం ప్రాంతాల్లో శనివారం ప్రదర్శనలు జరిగాయి. కొవ్వూరులో కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరై మద్దతు తెలిపారు. తణుకు, ఇరగవరంలో నిర్వహించిన ర్యాలీల్లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనది
విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన చర్చాగోష్టిలో మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనదని వక్తలు పేర్కొన్నారు. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో జరిగిన ర్యాలీలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక విజయనగరం కోట జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించింది.
మూడు రాజధానుల విషయంలో అడుగులు ముందుకే..: మంత్రి కొడాలి నాని
గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియా డాంబికాలకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. స్థానిక కే కన్వెన్షన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణ విషయంలో మూడు కమిటీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఇక అడుగులు ముందుకే పడతాయని స్పష్టం చేశారు. రైతులు చర్చలకు సిద్ధమైతే తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టం జరగకుండా చూస్తానన్నారు.
విభజన సమయంలో రాష్ట్రం రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉందని, చంద్రబాబు పాలనలో మరో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఒక కులాన్ని, వర్గాన్ని, డబ్బా మీడియాను వెనకేసుకుని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని అభివృద్ధిని అమరావతికే పరిమితం చేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్‌పై పడిందన్నారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటే అభివృద్ధి మొత్తం ఆ ప్రాంతానికే పరిమితమవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒక్కచోటే పోస్తే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటుంది.
– చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం
సీమ అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు
పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు హయాంలో సీమ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలంకాదని పలువురు నిపుణులు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. అక్కడే రాజధాని ఏర్పాటు చేసి.. నేడు కొందరికి మద్దతు తెలపడం శోచనీయం. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.
–బొజ్జ దశరథరామిరెడ్డి, జాతీయ రైతు సంఘాల సమాఖ్య కార్యదర్శి
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపుతూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారు. కక్ష పూరిత చర్యలతో మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబు రాజనీతికి నిదర్శనం. పాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. సీమ వాసిగా ఉండి తన 15 ఏళ్ల పాలనలో సీమ అభివృద్ధికి ఏనాడూ చర్యలు తీసుకోని బాబు.. నేడు రాయలసీమలో రాజధానులపై ర్యాలీ చేయడం విడ్డూరం.
–డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్
వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి
పరిపాలన వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదు. పరిపాలనా వికేంద్రీకరణను వేళ్ల మీద లెక్కించే కొందరే వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారే ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతిస్తోంది.
– చల్లా జయశంకరరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు
సీఎం నిర్ణయం అభినందనీయం
రాష్ట్రంలో మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడంతో పాటు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం హర్షణీయం. విశాఖలో సుమారు రెండు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.. వీరిలో ఎవరికైనా హైకోర్టులో అప్పీల్ చేయాల్సి వస్తే ఇక్కడ హైకోర్టు బెంచ్ అవసరం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనా వికేంద్రీకరణకు పూనుకోవడం అభినందనీయం.
– ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ సభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు పెంటకోట చంద్రరావు
Comments
Please login to add a commentAdd a comment