మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు | All three committees voted for decentralization | Sakshi
Sakshi News home page

మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు

Published Mon, Jan 20 2020 4:19 AM | Last Updated on Mon, Jan 20 2020 4:19 AM

All three committees voted for decentralization - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి మెగా సిటీ నిర్మాణం సాధ్యం కాదని, మెగా సిటీల నిర్మాణం కాన్సెప్ట్‌ ప్రపంచంలో విఫలమైందని ఉదాహరణలతో వివరించాయి. అమరావతి మెగా సిటీ నిర్మాణ ప్రణాళిక కూడా విఫల ప్రయోగమేనని స్పష్టం చేశాయి. అత్యధిక శాతం ప్రజలు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న తరుణంలో మూడు కమిటీల సిఫార్సులు క్లుప్తంగా.. 

శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసులు
- రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని స్పష్టం చేసింది. గ్రీన్‌ సిటీ నిర్మాణం సాధ్యాసాధ్యాల మీదా విస్తృతంగా పరిశీలించింది. గ్రీన్‌ సిటీ నిర్మాణం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని అభిప్రాయపడింది. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. ఈ కమిటీ ఇంకా ఏమి సిఫారసు చేసిందంటే..
- విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. 
- ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. 
- ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. 
విజయవాడ – గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది.
స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.

జీఎన్‌ రావు కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు..
- శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. 
- పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్యా ఉండదు. 
- అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురవుతుంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి.
మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్టుమెంట్లు నిర్మించాలి. 
- అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటిని మార్చి, ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యాకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి.
- రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి. 
రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరులను పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.
- వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించరాదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.

బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు సిఫార్సులు..
- పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. 
- ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. సచివాలయానికి ఏడాదిలో మొత్తం లక్ష మంది వస్తే అందులో 75 శాతం మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా 
ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లులకోసం వచ్చే వారే.
- ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15–16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది.
- ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ విఫలమయ్యాయి. కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి. మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతం కూడా చేరుకోలేదు.  
అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పోలవరం – బొల్లాపల్లి– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.150 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement