రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే | All the developed states in the country are as far away to Delhi | Sakshi
Sakshi News home page

రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే

Published Sun, Jan 12 2020 4:13 AM | Last Updated on Sun, Jan 12 2020 4:52 PM

All the developed states in the country are as far away to Delhi - Sakshi

రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలంటూ విష ప్రచారం చేస్తున్న కొందరికి.. అసలు దేశ రాజధాని ఎక్కడుందో? ఏయే రాష్ట్రాలకు ఎంత దూరంలో ఉందో తెలుసా? పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రాజధానులు ఆయా జిల్లా కేంద్రాలకు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా? అంతెందుకు మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌కు, శ్రీకాకుళానికి మధ్య దూరం ఎంతో గుర్తుందా? 

సెకన్ల వ్యవధిలో ఖండాంతరాలు దాటేలా సమాచార విప్లవం ఇవాళ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇ–ఫైళ్లు, ఇంటర్‌నెట్, లోకల్‌ ఏరియా నెట్‌వర్క్, వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌.. ఇలా పేరేదైనా కావచ్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్, ప్రైవేట్‌ కార్యాలయాలు క్షణాల్లో సమాచారాన్ని అటూ ఇటూ.. ఇటూ అటూ బట్వాడా చేసేస్తున్నాయి.  దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య దూరం అనేది అభివృద్ధిపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. మౌలిక వసతుల కల్పన, ప్రకృతి వనరుల సద్వినియోగంపై మాత్రమే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని ఎన్నో నగరాల చరిత్ర చెబుతోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని అత్యధిక జిల్లాలు రాజధాని నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తుండటం గమనార్హం.

పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సత్వర ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి. శాసన, న్యాయ, పరిపాలన రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచవచ్చని నివేదించాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు నానా యాగీ చేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రకు తెరతీశాయి.

మరోవైపు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని వితండవాదనను లేవనెత్తుతున్నాయి. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? దేశ రాజధానికి దగ్గరగా ఉండటానికి – అభివృద్ధికి సంబంధం ఉందా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశ రాజధానికి  ఎంత దూరంలో ఉన్నాయి? అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలకు ఆ రాష్ట్ర రాజధాని ఎంత దూరంలో ఉంది? మొదలైన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని సమీపంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. దేశ రాజధానికి దూరంగా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రాల రాజధానులకు దూరంగానే ఉండటం గమనార్హం.  
– సాక్షి, అమరావతి 

నంబర్‌ వన్‌ కేరళ..
నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక–2019 ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఢిల్లీకి 2,814 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం రాజధానిగా ఉన్న కేరళ సమగ్రాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఢిల్లీకి కేవలం 497 కిలోమీటర్ల దూరంలో లక్నో రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ 23వ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానం దక్కించుకున్నాయి. వాటికంటే దేశ రాజధానికి ఎంతో సమీపంలో ఉన్న బిహార్‌ చిట్టచివరి స్థానానికి పడిపోయింది. సమగ్రాభివృద్ధి సూచీ టాప్‌–10 జాబితాలో ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌ మినహా మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలకు చోటే లేకుండాపోయింది. దేశ రాజధానికి అత్యంత దూరంలో ఉండే సిక్కిం.. పెద్ద రాష్ట్రాలను తోసిరాజని ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌ ఢిల్లీకి 1,598 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి రాజధానికి దగ్గరగా ఉన్నామా.. దూరంగా ఉన్నామా.. అన్నదానికీ, అభివృద్ధికి సంబంధం లేదని నీతి ఆయోగ్‌ నివేదికే స్పష్టం చేస్తోంది. పరిపాలనా దక్షత, నిబద్ధత ఉంటే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరిస్తోంది. 

ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్‌ నివేదిక
సమగ్రాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి(ఐరాస) నిర్ణయించిన 17 ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్‌ ఈ నివేదికను రూపొందించింది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల ప్రాతిపదికన గరిష్టంగా 100 పాయింట్లతో సమగ్రాభివృద్ధి సూచీని నిర్ణయించారు. అందులో 65 నుంచి 99 మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ప్రగతిపథంలో ముందుండగా, 50 నుంచి 64 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనపరిచినవిగా.. .0 నుంచి 49 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ఆశావహ (అంటే ఇంకా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన) రాష్ట్రాలుగా నిర్ణయించింది. కేరళ 70 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 69 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్‌ రెండో స్థానంలో, 67 పాయింట్లతో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానం దక్కించుకున్నాయి.

కర్ణాటక 66 పాయింట్లతో నాలుగో స్థానం, గోవా, సిక్కిం 65 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా మహారాష్ట్ర, గుజరాత్‌ 64 పాయింట్లతో ఆరో స్థానం సాధించాయి. సమగ్రాభివృద్ధి సూచీలో అగ్ర స్థానంలో ఉన్న పది రాష్ట్రాల్లో తొమ్మిది అంటే కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్‌ దేశ రాజధాని ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌ మాత్రమే సమీపంలో ఉంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ 23వ స్థానంలో, బిహార్‌ చివరి స్థానంలో ఉండటం గమనార్హం. నీతి ఆయోగ్‌ నివేదిక మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. పేదరిక నిర్మూలనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొంది. ఇక జీరో హంగర్‌ (ఆకలి సమస్యను పరిష్కరించడం)లో గోవా, మిజోరం, కేరళ, నాగాలాండ్, మణిపూర్‌ మొదటి స్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం.  

అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి
దేశంలో అభివృద్ధి పథంలో ముందున్న అత్యధిక రాష్ట్రాల్లో రాజధానులు ఆ రాష్ట్రాల్లోని మెజార్టీ జిల్లాలకు దూరంగానే ఉన్నాయన్నది అక్షర సత్యం. యావత్‌ రాష్ట్రం అభివృద్ధికి చోదకశక్తిగా పని చేసేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాలనే రాజధానులుగా ఎంపిక చేశారు. అంతేగానీ రాష్ట్రానికి మధ్యలో ఉందా.. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందా.. అని స్కేల్‌ పట్టుకుని కొలిచి రాజధానులను నిర్ణయించలేదని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికే తగిన మౌలిక వసతులతో ఉన్న నగరాలను రాజధానులుగా చేసుకుని రాష్ట్రం మొత్తం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేశారు. అంతేగానీ ఎక్కడో ఖాళీ భూముల్లో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పేరిట భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ లేదు. తమిళనాడుకు ఉత్తరాన చిట్టచివరన ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఉండగా అత్యధిక జిల్లాలు ఆ నగరానికి సుదూరంగా ఉన్నాయి.

కర్ణాటకలో తూర్పు దిశలో ఏపీ సరిహద్దుకు సమీపంలో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు ఉండగా మెజార్టీ జిల్లాలు పశ్చిమ వైపున దూరంగా అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రానికి మధ్య, దక్షిణ, తూర్పు దిక్కున ఉండగా రాజధాని ముంబై మాత్రం పశ్చిమాన చిట్టచివరగా అరేబియా సముద్ర తీరంలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం ఆ రాష్ట్రానికి దక్షిణాన చిట్టచివరలో అరేబియా సముద్ర తీరంలో ఉండగా.. మెజార్టీ జిల్లాలు ఉత్తర, పశ్చిమాలుగా విస్తరించి ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. సమగ్రాభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కాబట్టి రాజధాని అన్నది అన్ని జిల్లాలకు సమాన దూరంలో రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలనడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉన్న మధ్యప్రదేశ్, లక్నో అభివృద్ధి సాధించలేకపోయాయని కూడా గుర్తు చేస్తున్నారు. 

వికేంద్రీకరణతో సొంతూళ్లలోనే సమస్యల పరిష్కారం 
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల ద్వారా సొంతూళ్లోనే సమస్యలు పరిష్కారమవుతున్నప్పుడు ఎవరికైనా అదే పనిగా రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయం, హెచ్‌వోడీ(విభాగాధిపతుల కార్యాలయాలు)ల వద్ద సాధారణ ప్రజలకు పని ఉండే అవకాశాలు చాలా తక్కువ..! ఈ నేపథ్యంలో సదుపాయాలను బట్టి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సామాజికవేత్తలు, మేధావులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడీషియల్‌ కేపిటల్‌), అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్‌లను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి సమ న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు.

అమరావతిలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడటం ద్వారా.. తక్కువ ధరలకే కాజేసిన వేలాది ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికే పచ్చదండు రాజధాని గ్రామాల రైతుల పేరుతో ఉద్యమాలను చేస్తోందని విమర్శిస్తున్నారు. రాజధాని, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై పశ్చిమతీరాన అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ రాష్ట్రంలో గోండియా జిల్లా కేంద్రానికి ముంబైకి మధ్య దూరం 1,060 కి.మీలు. గడ్చిరోలి జిల్లా కేంద్రానికీ ముంబైకి మధ్య దూరం 942 కి.మీలు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఆ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కన్యాకుమారి మధ్య ఉన్న దూరం 718 కి.మీలు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ సహా అనేక రాష్ట్రాల్లో రాజధాని నగరాలకు కొన్ని జిల్లాలకు మధ్య దూరం ఎక్కువ.

కానీ ఆ రాష్ట్రాల్లో రాజధాని అంశంపై సామాన్య ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతగానీ, ఇబ్బందులుగానీ ఉత్పన్నం అయిన దాఖలాలు లేవని మేధావులు గుర్తు చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 534 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించడానికి శ్రీకారం చుట్టారు. అంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకే వెళ్లాల్సిన అగత్యం ఇక ఉండదు. పట్టణ ప్రజలూ అంతే. అలాంటప్పుడు సమస్యల పరిష్కారం కోసం రాజధానికి వెళ్లాల్సిన అవసరం వారికి ఏముంటుందని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement