సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందిస్తున్న జీఎన్ రావు కమిటీ
సాక్షి, అమరావతి: ‘‘పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. సమగ్రాభివృద్ధి అంటే.. ఒకే చోట మహానగరాలు నిర్మించడం కాదు.. రక్షిత తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూర్తిగా రూపుమాపవచ్చు.. ఇది అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలలో, రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయి.’’ ఇవి చెప్పింది ఒకటి కాదు రెండు కాదు మూడు కమిటీలు. శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) ఇవే విషయాలను నివేదికల రూపంలో అందించాయి. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆ కమిటీలు చెప్పిన ముఖ్యమైన అంశాలను ఓ మారు పరిశీలిద్దాం..
శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే..
విభజన తర్వాత రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని తేల్చిచెప్పింది. కమిటీ సిఫార్సులివి..
► రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైనది కాదు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
► శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి.
► విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం వాటిల్లుతుంది. పర్యావరణానికీ విఘాతం కలుగుతుంది.
► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే ప్రతికూల పరిణామాలనెదుర్కోవాల్సి ఉంటుంది.
► విజయవాడ–గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
జీఎన్ రావు కమిటీ ఏం చెప్పిందంటే..
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ..
► శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు.
► అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించాలి.
► అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి.
► అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే వి«షయాన్ని ప్రభుత్వానికి సూచించాం.
► రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి.
► రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం చెప్పిందంటే..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీజీ ఏం చెప్పిందంటే
సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు
► ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉంటేనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది.
► చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు)
► ఆంధ్రప్రదేశ్ అప్పు ఇప్పటికే 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి 1.20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది భారం.
► అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలా అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు.
► అమరావతి నగరంలో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటికి పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు.
► ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment