అమరావతిని నిర్ణయించింది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు | Amaravati was decided by politicians and businessmens | Sakshi
Sakshi News home page

అమరావతిని నిర్ణయించింది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు

Published Thu, Dec 10 2020 5:14 AM | Last Updated on Thu, Dec 10 2020 5:23 AM

Amaravati was decided by politicians and businessmens - Sakshi

సాక్షి, అమరావతి:  కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల ఏర్పాటు నిర్ణయం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజనాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆపే దిశగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు. పలు రంగాల్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి, వారిచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కానీ అమరావతిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలసి రాజధానిగా నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిపై ఏర్పాటైన మంత్రి నారాయణ కమిటీలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు తప్ప.. నిపుణులు లేనేలేరన్నారు. ఏపీ పునర్విభజన చట్టప్రకారం నిపుణులతో కూడిన శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని, కానీ గత ప్రభుత్వం ఈ చట్టబద్ధ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుందని వివరించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికివ్వడానికి ముందే.. అమరావతిని రాజధానిగా నిర్ణయించేసిందన్నారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న దుష్యంత్‌ దవే.. బుధవారం రెండోరోజు తన వాదనలు కొనసాగించారు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోనిదని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధముండదని వివరించారు. గతంలో ఏర్పాటైన రాజధానుల విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. కోర్టులు ఇందులో జోక్యం చేసుకుంటే.. అది రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమే అవుతుందన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దని స్పష్టంగా చెప్పిందని దవే తెలిపారు. అయితే ఈ కమిటీ సిఫారసుల్ని బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వ పెద్దలు తమ స్వప్రయోజనాలకోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. నిపుణులతో కూడిన కమిటీ రాజధానిని నిర్ణయించివుంటే.. పరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు కలసి రూ.లక్ష కోట్ల రాజధానిని నిర్ణయించారన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేందుకు సహేతుక కారణాలు ఏవీ లేవన్నారు.  

అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో కోర్టు తెలుసుకోవాలి... 
అనంతరం ఏజీ శ్రీరామ్‌ వాదనలు 
ప్రారంభిస్తూ.. అమరావతి పట్టణానికి, రాజధానిగా నిర్ణయించిన అమరావతికి సంబంధం లేదన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. అసలు అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో, అందులో ఎవరెవరు పాలుపంచుకున్నారో ఈ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఏజీ తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement