వికేంద్రీకరణకే పెద్దపీట | Justice for all areas with three capitals | Sakshi
Sakshi News home page

ముగ్గురి నోట అదే మాట!

Published Sun, Jan 5 2020 3:57 AM | Last Updated on Sun, Jan 5 2020 1:17 PM

Justice for all areas with three capitals - Sakshi

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరి కాదు. పాలనను వికేంద్రీకరించాలి. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
– శివరామకృష్ణన్‌ కమిటీ

మానవ జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. మెగా సిటీల నిర్మాణం, భూముల ధరలు పెరగడం అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని ప్రజలందరి తలసరి ఆదాయం పెరగడం అభివృద్ధి. పాలన వికేంద్రీకరణే ఇందుకు మార్గం.
– జీఎన్‌ రావు కమిటీ

పరిపాలన వికేంద్రీకరణతో పాటు బహుళ రాజధానుల వ్యవస్థ వల్ల ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందుతాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి.
– బోస్టన్‌ కమిటీ

‘పాలన ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి.. అందుకు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణే మార్గం కావాలి’ అని రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్‌ కమిటీ, మొన్న జీఎన్‌ రావు కమిటీ, నిన్న బోస్టన్‌ కమిటీలు విస్పష్టంగా నొక్కి వక్కాణించాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రంగా పరిపాలన, అసెంబ్లీ, హైకోర్టు వ్యవహారాలు సాగితేనే అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం సాధ్యమని స్పష్టీకరించాయి. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశాయి. అవకాశాలు అందరికీ రావాలని, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలకు తావివ్వరాదని స్పష్టం చేశాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన అనర్థమేమిటో కళ్లెదుటే కనిపిస్తున్నా, మళ్లీ మళ్లీ ఆ పొరపాటుకు తావివ్వడం సరికాదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల అభిప్రాయాల మధ్య సారూప్యతపై మరోసారి అవలోకనం.. 

సాక్షి, అమరావతి : నాడు శివరామకృష్ణన్, మొన్న, నిన్న జీఎన్‌.రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికలు నిజమైన అభివృద్ధికి అద్దం పట్టేలా, వికేంద్రీకరణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే ఒకే చోట పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం కాదనే అభిప్రాయపడ్డాయి.   ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. రవాణా, మంచి నీరు, విద్య, వైద్యం, విద్యుత్‌ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెబుతూ.. ఇందుకు రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడమే మంచి మార్గమని సూచించాయి. అన్ని జిల్లాల సమతుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ సూచించడం ఎంతైనా అవసరమేనని స్పష్టీకరించాయి.

అమరావతి రాజధాని నగరం పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలను పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మోడల్‌నే రూపొందించిందనే విషయాన్ని ఎత్తి చూపాయి.  మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తాయి. పలు దేశాల్లో, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయని ఉదహరిస్తూ.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను సూచించాయి. ఇంచు మించు ఒకేలా ఉన్న ఈ మూడు కమిటీల నివేదికల సూచనల అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి: జీఎన్‌ రావు కమిటీ 
- శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. 
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా..  పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు.  
అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి.  
మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించాలి.  
అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి.  
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం.  
రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి.  
రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.    
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.  

 

మహానగరం సరికాదు : శివరామకృష్ణన్‌ కమిటీ 
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది.  ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరయినది కాదంది.   
అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. 
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి.  
శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరోచోట బెంచ్‌ను నెలకొల్పాలి.  
విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. 
విజయవాడ– గుంటూరు నగరాల మధ్య మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం (అప్పట్లో చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. 
విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పిత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. 
సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  
విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. 
ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.   
స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. 

పాలన వికేంద్రీకరణే మార్గం: బోస్టన్‌ నివేదిక 
- పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది.  
- తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. 
- చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80 వేల కోట్ల రూపాయల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో  6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. 
- ప్రపంచంలో గత 50 ఏళ్లలో ఏడు దేశాల క్యాపిటల్‌ సిటీల నిర్మాణం చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరకుంది. మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా 
చేరుకోలేదు. 
- అమరావతి నగరంపై రూ.లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదు. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. 
అమరావతి నగరంలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు.   
అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 6 నుంచి 8 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్‌లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల అభివృద్ధి పథకాల అమలకు  నిధులుండవు.     
– బోస్టన్‌ నివేదిక

మూడు రాజధానులతో సమ న్యాయం 
ఒకే పెద్ద రాజధాని బదులు మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలను వికేంద్రీకరించాలి. హైకోర్టు వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.  
– ఈఏఎస్‌ శర్మ, ఐఏఎస్‌ రిటైర్డ్‌ అధికారి 
 
సమతుల అభివృద్ధి సాధ్యం 
పాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పాలన అన్ని ప్రాంతాల వారికి చేరువవుతుంది. ఒకే చోట పాలనా వ్యవస్థలన్నీ కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో అన్నీ ఒకే చోట ఉండాలనే ఆలోచనకు అర్థం లేదు.   
         – ప్రొఫెసర్‌ ఎం.రవీంద్రనాథ్, ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ  

చదవండి:

అమరావతి.. విఫల ప్రయోగమే

పొరపాట్లు మళ్లీ జరగకూడదు

సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..

మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన

పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు

డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు

రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం

వికేంద్రీకరణకే మొగ్గు

అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ

అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement