
దిగ్విజయ్‌వి పచ్చి అబద్ధాలు: ఎంవీ మైసూరారెడ్డి
మా పార్టీ అనని మాటలను అన్నట్లు ఎలా అంటారు: మైసూరా
మేమెప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదు
ఆయన వ్యాఖ్యలు సంస్కార హీనం
ఒక తండ్రిలాగా పరిష్కారం చూపమన్నాం
అడ్డగోలుగా విభజించమని చెప్పలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విభజన విషయంలో పచ్చిగా అబద్ధాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. విభజన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వైఖరిని దిగ్విజయ్ సింగ్ వక్రీకరించారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాయని దిగ్విజయ్ చెప్పడం పూర్తిగా తప్పని, తమ పార్టీ ఏనాడూ అలాంటి అభిప్రాయం చెప్పలేదని గుర్తుచేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించమని తమ పార్టీ ఏనాడూ చెప్పలేదని స్పష్టంచేశారు. గత ఏడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ఒక్క దానికే తమ పార్టీ తరఫున ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. ఆ సమావేశంలో కూడా షిండేకు తమ పార్టీ ‘బ్లాంక్ చెక్’ ఏమీ ఇవ్వలేదని అన్నారు.
ఆ లేఖ ఇదీ..
‘అన్ని సమస్యలూ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలాగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం’ అని ఆనాటి అఖిలపక్ష సమావేశంలో షిండేకు లేఖ ఇచ్చిన విషయాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఆ సమావేశంలో అందించిన లేఖలోని అంశాలను మీడియా ముందు ఆయన చదివి వినిపించారు. ఒక సీనియర్ నేత, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో పరిణతి చెందిన వ్యక్తిగా ఉండి దిగ్విజయ్ అవాస్తవాలు ఎలా మాట్లాడతారని మైసూరా ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఆయనకు మానసిక దౌర్బల్యం వచ్చినట్లుంది.. అందుకే తాము చెప్పని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఒక రాజకీయ పార్టీ అనని మాటలను అన్నట్లు ఎలా చెబుతారు? ఇది సంస్కారహీనమే అవుతుంది.. అని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఇతర పార్టీలపై బురద జల్లడమే కాంగ్రెస్ విధానంగా ఉందని, వాళ్లెపుడూ తమ విధానాన్ని ప్రకటించలేదని అన్నారు. తమ పార్టీ ప్లీనరీలో చెప్పింది, ఇపుడు చెబుతున్నది ఒకటేనన్నారు. ‘మీరు పరిష్కరించలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అన్నదే మా మాట అని.. మేం షిండేకు ఇచ్చిన లేఖలో కూడా ఇదే ఉంది. ఈ లేఖలో మేం ఎక్కడా ‘బ్లాంక్ చెక్’ ఇవ్వలేదే. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇతర పత్రాలు కూడా ఇవ్వలేదు’ అని మైసూరా వివరించారు.